హైదరాబాద్ ఓ సముద్రంలా.. మూసీ ముప్పుకి శాశ్వత పరిష్కారం ఎలా?

  • Published By: sreehari ,Published On : October 15, 2020 / 08:44 PM IST
హైదరాబాద్ ఓ సముద్రంలా.. మూసీ ముప్పుకి శాశ్వత పరిష్కారం ఎలా?

Hyderabad floods : ఓ వైపు వర్షపు నీరు.. మరోవైపు విరిగి పడిన చెట్లతో బీభత్సంగా ఉన్న హైదరాబాద్ భాగ్యనగరం కాదు.. నరకం అన్పించేలా కన్పిస్తోంది. జరిగిన నష్టాన్ని ఇప్పటికిప్పుడు అంచనా వేయడం సాధ్యపడటం లేదు..అంతేకాదు.. వరద మిగిల్చిన బురద తీసుకోవడానికే రోజులు పట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ప్రస్తుతానికి వరద మప్పు భాగ్యనగరానికి తప్పినా..వందేళ్ల తర్వాత ఈ స్థాయి వరదలు రావడం మాత్రం భవిష్యత్తులో రానున్న ప్రమాదానికి ఘంటికలుగానే చూడాలి..



ఏదో అప్పటికప్పుడు వచ్చి పోతుందిలే అని కానీ..ఎప్పుడో వందేళ్లకి ఒకసారి వచ్చిపడే వర్షాల్లే అని లైట్ తీసుకోవడానికి లేదు. ఎందుకంటే..సిటికి వరద ముప్పు గురించిన హెచ్చరికలు 2000 సంవత్సరంలో ఓసారి..2016లో ఓసారి వచ్చాయ్ కూడా..ఐనా సరే వాటి నుంచి పాఠాలు నేర్చుకోలేక పోవడమే ఈ విలయానికి కారణమనుకోవాలి.



సిటీలో కురిసిన వాన దెబ్బకి భాగ్యనగరంలో 600 చెరువులు తెగిపోగా..1500 కాలనీలు..బస్తీలు నీటిలో తేలాడుతూ..అసలు వరదల మధ్యలో నగరం కట్టారా అనేలా దృశ్యాలు కన్పిస్తున్నాయ్. వీటి ధాటికే కార్లు కాగితపు పడవల్లా కొట్టుకుపోగా.. రోడ్లపక్కన చెట్లు కూలిపోవడంతో..కరెంట్ సరఫరా నిలిచిపోయింది.



ఒకేసారి 30 ప్రాంతాల్లో 20 నుంచి 30 సెంటీమీటర్ల వర్షం పడిందంటే నగరానికి ప్రమాదం ఏ స్థాయిలో ఉందో అర్ధమైపోతోంది..సాయం కోసం ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ నంబర్లకి వేలసంఖ్యలో కాల్స్ వచ్చాయంటే ఎంతమంది బాధితులుగా మారిపోయారో తెలిసిపోతోంది.

వర్షాల ధాటిలో నిరాశ్రయులైన వారి ఆగ్రహాన్ని చాలా చోట్ల ప్రజాప్రతినిధులు ఎదుర్కొంటున్నారు కూడా వరద ముప్పు తప్పినా.. హైదరాబాద్, సిటి శివార్లలో పోలీసు బృందాలు, ఎన్‌డిఆర్‌ఎఫ్, ఆర్మీ, డిఆర్‌ఎఫ్ ఇంకా శ్రమిస్తూనే ఉన్నారు. లోతట్టు ప్రాంతాల్లో చిక్కుకున్న ప్రజల పునారావాసానికి తరలించడంలోనూ అడ్డంకులు ఏర్పడ్డాయంటే సిటిలో సిచ్యుయేషన్ ఎంత వరస్ట్‌గా మారిపోయిందో తెలుస్తోంది..



అంతే కాదు ఓ వైపు హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తేయగా..మూసీ ముప్పు ప్రజలను వెంటాడుతోంది. వరదల ప్రభావం నగరం అంతా ఉన్నా కూడా పాతబస్తీ మాత్రం ఆగమాగం అయిపోయింది.. చాంద్రాయణగుట్ట, గాజమిల్లత్, మొఘల్‌పురా, హాషమాబాద్, బార్కాస్,పురానాపూల్ ఏరియాల్లో మూసీ ఉప్పొంగడంతో..బైపాస్ రోడ్లు కూడా క్లోజ్ చేయాల్సిన పరిస్థితి తలెత్తింది.