కొడుకు కోసం కొండను పిండిచేస్తున్న తండ్రి : హృదయం ద్రవించే దీనగాథ..

  • Published By: nagamani ,Published On : September 22, 2020 / 06:05 PM IST
కొడుకు కోసం కొండను పిండిచేస్తున్న తండ్రి : హృదయం ద్రవించే దీనగాథ..

కొడుకు కోసం..అతని భవిష్యత్తు కోసం తండ్రి పడే తపన అంతా ఇంతా కాదు..పిల్లలపై తల్లి ప్రేమ గురించి ఎన్నో కథలు కథలుగా చెప్పుకుంటాం..కానీ కొడుకు కోసం ఈ తండ్రి పడే కష్టం..కన్నీటి కష్టం గురించి తెలిస్తే మాత్రం గుండెలు పట్టేస్తాయి. మాటలకందని కన్నీరు కథలై..వ్యథలై పారుతుంది.


చేతికి అంది వచ్చిన కొడుకుని చూసి తండ్రి గుండె పొంగిపోతుంది. కానీ అలా తనకు చేదోడు వాదోడుగా ఉండే కొడుకుని కొండ చరియలు పొట్టన పెట్టుకుంటే ఆ తండ్రి గుండె పగిలిపోదా? కొడుకా కొడుకా అని అవిసిపోదా? వేదనతో కరిగి నీరై పోదా? కానీ ఎక్కడో చిన్న ఆశ నా కొడుకు బతికి ఉంటాడని..ఆ ఆశతోనే కొండలను పిండి చేస్తున్నాడు. కొండ చరియల కింద తన కొడుకు ఇంకా బతికే ఉండొచ్నినే ఆశతో ఆ తండ్రి నిత్యం వస్తూ ఆ మట్టిని తవ్వి పోస్తున్నాడు. అలా ఒక రోజు రెండు రోజులు కాదు గత 41 రోజుల నుంచి మట్టిని తవ్వుతూనే ఉన్నాడు. కానీ, కొడుకు ఆచూకీ మాత్రం లభించలేదు.


అంగుళం అంగుళం మట్టిని గాలిస్తూనే ఉన్నాడు. అలా గాలించి గాలించి ఇంటికి వచ్చిన భర్తకు పరుగు పరుగున ఎదురొచ్చి ఏడీ నా కొడుకు అంటూ కొండంత ఆశతో అడుగుతుందా తల్లి..కనిపించలేదని చెప్పలేడు..అలా మొదలు నరికిన చెట్టులా కుప్పకూలిపోయే భర్తను ఓదార్చాలా? తనను తాను నిబ్బరించుకోవాలో తెలిక ఆ కన్నతల్లి తల్లడిల్లిపోతోంది. కనిపించని కొడుకు కోసం కొండల్ని పిండిచేస్తున్నాడా తండ్రి..కుప్పకూలిన మట్టి కింద నుంచి తన గారాల పట్టి లేచి వస్తాడని కొండంత ఆశతో ఎదురు చూస్తున్నారా తల్లిదండ్రులు..


ఆగస్టు 6న కేరళలోని మున్నార్‌లో కొండ చరియలు విరిగిపడి 70 మంది సజీవ సమాధైపోయారు. ఈ ఘటనపై వెంటనే రంగంలోకి దిగిన రెస్క్యూ సిబ్బంది ఇప్పటివరకు 66 శవాలను వెలికితీశారు. మిగతా నలుగురి కోసం ఇంకా గాలిస్తూనే ఉన్నారు. ఆధునిక యంత్రాలతో తవ్వకాలు కొనసాగిస్తునే ఉన్నారు.


కానీ ఫలితం లేదు. అలా కనిపించని నలుగురిలో షన్ముగనాథన్ అనే వ్యక్తి కొడుకు దినేష్ కుమార్ (22) కూడా ఉన్నాడు. ఆ రోజు పిట్టిముడీ ప్రాంతంలో జరిగిన ఈ విషాద ఘటనలో షన్ముగనాథన్ తన చిన్న కొడుకు నితేష్ కుమార్‌‌(19), పెద్ద కొడుకు దినేష్ కుమార్‌తో పాటు మొత్తం 22 మంది కుటుంబ సభ్యులను కోల్పోయాడు. ఆగస్టు 4న షన్ముగ అన్న అనంత శివం మనవరాలి పుట్టినరోజు సందర్భంగా దినేష్, నితేష్‌లు పిట్టిముడికి వెళ్లారు.


రెండు రోజులు అక్కడే ఉండి వస్తామని అన్నారు. కానీ..తిరిగిరాలేదు. ఆగస్టు 6న కొండచరియలు విరిగిపడటంతో ఇద్దరూ సజీవ సమాధి అయ్యారు. తవ్వకాల్లో నితేష్ కుమార్‌తో పాటు మిగతా కుటుంబ సభ్యుల శవాలు లభించాయి. కానీ, దినేష్ ఆచూకీ మాత్రం లభించలేదు. అప్పటినుంచి షన్ముగనాథన్ రోజూ సంఘటనా స్థలానికి వెళ్లి మట్టిని తవ్వుతున్నాడు. కొడుకు బతికి ఉంటాడని అత్యాశ ఒక వైపు లేదా..కనీసం కొడుకు శవం అయినా దొరుకుతుందేమో అంత్యక్రియలు చేసి అతని ఆత్మకు విముక్తిని చేద్దామని వేదన మరోవైపుగా ఆ తండ్రి తవ్వకాలు కొనసాగుతున్నాయి.


తన ఇంటికి 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న పిట్టిముడికి వెళ్లి కొండ చరియలను తవ్వుతూ కొడుకు కోసం వెతుకుతూనే ఉన్నాడు. అయినా అతని అన్వేషణ ఫలించలేదు. ‘అతడి ఆచూకీ లభించనప్పుడు చనిపోయాడని ఎలా అనుకుంటాను? కొండ చరియల్లో నా కొడుకు ఇంకా బతికే ఉండొచ్చు. అప్పటివరకు అంత్యక్రియలు చేయను’ అని షన్ముగ వెక్కి వెక్కి ఏడుస్తూనే ఉన్నాడు.