ముఖ్యమంత్రిగా నితీష్.. ప్రశాంత్ కిషోర్ ఏమన్నాడంటే?

  • Published By: vamsi ,Published On : November 16, 2020 / 08:35 PM IST
ముఖ్యమంత్రిగా నితీష్.. ప్రశాంత్ కిషోర్ ఏమన్నాడంటే?

PK.. ప్రశాంత్ కిషోర్.. ఆయన రంగంలోకి దిగారంటే ఆ పార్టీ గెలుపు ఖాయం అనే భావన రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం ఉంది. ప్రత్యర్థి పార్టీకి పీకే వ్యూహాలు తట్టుకుని నిలబడటం చాలా కష్టం అనే విషయం ఇప్పటికే భారత రాజకీయ వర్గాల్లో ఉంది. వైఎస్ జగన్‌కు రాజకీయ వ్యూహకర్తగా పని చేసిన ప్రశాంత్ కిషోర్.. బీహార్ రాజకీయాల్లో కీలక నేతగా ఉన్నారు. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో మాత్రం ప్రశాంత్ కిషోర్ ప్రభావం, ప్రచారం రెండూ పెద్దగా కనిపించలేదు.



జనతాదళ్ యునైటెడ్ (JD(U)) నుంచి బహిష్కరించబడిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సోమవారం బీహార్ ముఖ్యమంత్రిగా ఏడవసారి ప్రమాణస్వీకారం చేసిన నితీష్ కుమార్‌ని లక్ష్యంగా చేసుకుని ట్వీట్ చేశారు. నితీష్ కుమార్‌ను సీఎంగా ఎన్నికైనందుకు అభినందిస్తూనే వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘బీజేపీ నామినేటేడ్‌ ముఖ్యమంత్రి నితీష్‌కు శుభాకాంక్షలు. సీఎంగా అలసిపోయి, రాజకీయంగా వెనుబడిన ముఖ్యమంత్రి పాలనను బీహార్‌ ప్రజలు ఇంకొంతకాలం సిద్ధంగా ఉండాలి’ అంటూ ట్వీట్‌ చేశారు.



ఒకప్పుడు నితీష్‌కు సన్నిహితుడైన ప్రశాంత్ కిషోర్‌ను జనతాదళ్ యునైటెడ్ JD(U) ఉపాధ్యక్షునిగా నియమించారు, కానీ అతని స్వతంత్ర మరియు తరచూ విరుద్ధమైన అభిప్రాయాలు నితీష్, ప్రశాంత్ మధ్య సంబంధాలను దెబ్బతీశాయి. దీంతో నితీష్‌ను పార్టీ నుండి బహిష్కరించారు నితీష్. భారతీయ రాజకీయ వ్యూహకర్త, రాజకీయవేత్త. అయిన ప్రశాంత్ కిషోర్‌.. పౌరసత్వ సవరణ చట్టం (2019)పై, నితీష్ కుమార్ అవలంబించిన అనుకూల వైఖరిని విమర్శించారు. దీంతో ఆయనను 2020 జనవరి 29 న పార్టీ నుంచి బహిష్కరించారు.



ప్రశాంత్ కిషోర్ BJP, కాంగ్రెస్ రెండు పార్టీలకు ఎన్నికల వ్యూహకర్తగా పనిచేశాడు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో 2012లో మూడవసారి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యేందుకు అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి సహాయం చేశారు కిషోర్. 2019ఎన్నికల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి కూడా ప్రశాంత్ కిషోర్ పనిచేశాడు.



తర్వాత బీహార్‌కు వెళ్లిపోగా.. అక్కడి అసెంబ్లీ ఎన్నికల సమయంలో విపక్షాలకు మద్దతుగా ప్రచారం చేస్తారని అనుకున్నారు. అయితే ఎన్నికల సమయంలో ప్రశాంత్‌.. మౌనంగా ఉన్నారు. ఎట్టకేలకు నాలుగు నెలల తర్వాత తొలిసారి నితీష్‌ గురించి ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశాడు ప్రశాంత్.