నాగార్జునసాగర్ నుంచి శ్రీశైలం వరకు లాంచీ ప్రయాణం…నల్లమల అందాలు తిలకిస్తూ ఆరుగంటల పాటు ప్రయాణం

  • Published By: bheemraj ,Published On : November 22, 2020 / 08:08 AM IST
నాగార్జునసాగర్ నుంచి శ్రీశైలం వరకు లాంచీ ప్రయాణం…నల్లమల అందాలు తిలకిస్తూ ఆరుగంటల పాటు ప్రయాణం

Luncheon journey : ప్రకృతి ప్రేమికులకు తెలంగాణ టూరిజం శాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. ఊగే అలలపై నీటి ప్రయాణాన్ని మళ్లీ అందుబాటులోకి తెచ్చింది. నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం వరకు… లాంచీ ప్రయాణాన్ని ప్రారంభించింది.

6 గంటల పాటు నదిపై సాగే ప్రయాణం అద్భుతమైన అనుభవాన్నిస్తోందని అంటున్నారు టూరిస్టులు. ఎత్తయిన కొండలు, చుట్టూరా పరుచుకున్న పచ్చదనం…కృష్ణమ్మ పరవళ్లు…నల్లమల అడవుల అందాలు నాగార్జునసాగర్… నుంచి శ్రీశైలం వెళ్లే ప్రయాణికులను ఈ ప్రకృతి కమనీయ దృశ్యాలు కట్టిపడేయనున్నాయి.



పర్యాటక ప్రియులు ఎంతగానే ఎదురుచూస్తున్న లాంచీయాత్ర మొదలయింది. నాగార్జున సాగర్ రిజర్వాయర్ నుంచి పర్యాటకులతో లాంచీ శ్రీశైలానికి వెళ్లింది. ఆదివారం ఉదయం శ్రీశైలం నుంచి తిరుగు ప్రయాణమవుతుంది.

నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు నీటిమట్టం 565 అడుగుల కన్నా ఎక్కువ ఉంటే రెండు రాష్ట్రాలు లాంచీల రాకపోకలకు అనుమతిస్తాయి. ఈ ఏడాది సాగర్ చాలా రోజల క్రితమే నిండుకుండలా మారినప్పటికీ..కరోనా దృష్ట్యా లాంచీయాత్రకు ప్రభుత్వాలు మొగ్గుచూపలేదు.

ఇకపై ప్రతి వారం లాంచీ అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు. లాంచీ యాత్రపై పర్యాటకులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు.



కృష్ణమ్మ గలగలలు వింటూ, నల్లమల అందాలు తిలకిస్తూ ఆరుగంటలపాటు లాంచీలో ప్రయాణిస్తారు పర్యాటకులు. లాంచీ ప్రయాణానికి తెలంగాణ పర్యాటక శాఖ ప్రత్యేక ప్యాకేజీలు అమలుచేస్తోంది.

హైదరాబాద్ పర్యాటకులను టూరిజం బస్సులో సాగర్‌ వరకు తీసుకొచ్చి.. అక్కడి లాంచీ ఎక్కిస్తారు. శ్రీశైలం నుంచి టూరిజం బస్సులో హైదరాబాద్ వెళ్లాల్సి ఉంటుంది. లాంచీ యాత్ర చేయాలనుకునే పర్యాటకులు తెలంగాణ పర్యాటక శాఖ వెబ్‌సైట్‌ల రిజర్వేషన్ చేసుకోవాలని అధికారులు చెబుతున్నారు.



హైదరాబాద్‌ నుంచి నాగార్జున సాగర్‌ వరకు బస్సులో.. అక్కడి నుంచి బోటులో శ్రీశైలం చేరుకునేలా రెండు రోజుల టూర్‌ ప్యాకేజీని తెలంగాణ టూరిజం శాఖ అందిస్తోంది.

ఈ టూర్‌లో దేవాలయ దర్శనం, భోజన సదుపాయం, ఈగలపెంటలోని టూరిజం హోటల్‌లో బసకు ఏర్పాట్లు చేస్తారు. తిరుగు ప్రయాణంతో కలిపి పెద్దలకు 3వేల 499, పిల్లలకు 2వేల 800 చార్జీని వసూలు చేస్తున్నారు.