పురపాలికల్లో వార్డు ఆఫీసర్ల నియామకం… దేశంలోనే తొలిసారి.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

  • Published By: bheemraj ,Published On : August 21, 2020 / 11:09 PM IST
పురపాలికల్లో వార్డు ఆఫీసర్ల నియామకం… దేశంలోనే తొలిసారి.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పురపాలికల్లో వార్డు ఆఫీసర్ల నియామకం చేపట్టనుంది. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా వార్డు ఆఫీసర్లు ఉంటారని మంత్రి కేటీఆర్ అన్నారు. దేశంలోనే తొలిసారిగా వార్డుకు ఒక అధికారిని నియమించనున్నారు. పురపాలక శాఖలో ఖాళీల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

కొత్త మున్సిపల్ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. కొత్త మున్సిపల్ చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలంటే మరింత సిబ్బంది అవసరమని ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాలను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు వార్డు స్థాయిలో కూడా అధికారులను నియమించి ప్రజలకు మరింత జవాబుదారీతనంగా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి పెట్టింది.

మున్సిపల్ శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలతోపాటు వార్డు స్థాయిలో వార్డు అధికారులను నియమించే ప్రక్రియను వీలైనంత తొందరగా చేపట్టాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ జరిగిన సమీక్ష సమావేశంలో అధికారులను ఆదేశించారు.

ఉద్యోగాల భర్తీ విషయంలో మాత్రం పారదర్శకంగా వ్యవహరించాలని సూచించారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన ప్రక్రియ మొదలయ్యే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున వార్డు స్థాయిలో అధికారుల నియామకం జరుగనుండటంతో పెద్ద ఎత్తున నిరుద్యోగులకు అవకాశాలు దక్కనున్నాయి.