భారత్ దుఃఖిస్తుంది : ప్రణబ్ మృతిపై ప్రముఖుల విచారం

  • Published By: venkaiahnaidu ,Published On : August 31, 2020 / 07:36 PM IST
భారత్ దుఃఖిస్తుంది : ప్రణబ్ మృతిపై ప్రముఖుల విచారం

ఇవాళ(ఆగస్టు-31,2020) మధ్యాహ్నం భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ(84) కన్నుమూశారు. ఈ విషయాన్ని అయన కుమారుడు అభిజిత్ ముఖర్జీ ట్వీట్ ద్వారా తెలిపారు. ప్రణబ్ ముఖర్జీ మృతి పట్ల వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు,ప్రముఖులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్
ప్రణబ్ ముఖర్జీ దివంగతులు కావడం పట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ప్రణబ్ ముఖర్జీని ఓ రుషితో పోల్చారు. ప్రణబ్ ముఖర్జీ ఇక లేరనే వార్త విని తాను చాలా శోకసంతప్తుడినయ్యానన్నారు. ఆయన కన్నుమూయడంతో ఓ శకం ముగిసిందన్నారు. ప్రజా జీవితంలో మహోన్నత నేత అని, ఆయన భరత మాతకు ఓ రుషి మాదిరిగా సేవ చేశారని కొనియాడారు. అత్యంత విలువైన బిడ్డల్లో ఒకరిని కోల్పోయినందుకు దేశం శోకిస్తోందని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, ప్రజలందరికీ సంతాపం తెలిపారు.

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
భారత్ మరో అత్యున్నత నాయకుడిని కోల్పోయిందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. దేశ రాజకీయ యవనికపై తనదైన ముద్రవేసిన ప్రణబ్ మృతితో భారతదేశం మరో అత్యున్నత నాయకుణ్ని కోల్పోయింది. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, వారికి ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నానని తెలిపారు.

ప్రణబ్ గొప్ప రాజనీతిజ్ఞుడని, క్రమశిక్షణ, కఠోర శ్రమ, అంకిత భావంతో దేశ రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగి, అత్యున్నత రాజ్యాంగ పదవిని అధిరోహించిన ఆదర్శనీయులని ప్రణబ్ సేవలను కొనియాడారు. సుదీర్ఘమైన, విశిష్టమైన ప్రజాజీవితంలో చేపట్టిన ప్రతి పదవికి ప్రణబ్ ముఖర్జీ వన్నె తీసుకువచ్చారని వెంకయ్య నాయుడు చెప్పారు.

పరిపాలనా చతురతలోనూ, సమస్యల పరిష్కర్తగానూ పేరు సంపాదించుకున్న ఆయనకు భారత పార్లమెంటరీ వ్యవస్థ మీద లోతైన అవగాహన ఉన్నదన్నారు. పార్లమెంటరీ ప్రక్రియలు, సమాకాలీన రాజకీయాలే కాకుండా అనేక విషయాలకు సంబంధించిన ఎన్ సైక్లోపీడియాగా ప్రణబ్ నిలిచారని గుర్తుచేశారు. మంచి పార్లమెంట్ సభ్యుడిగా, నైపుణ్యం కలిగిన వక్తగా అందరినీ ఆకర్షించేవారని, అసాధారణ జ్ఞాపకశక్తి, సమస్యను లోతుగా, భిన్న కోణాల్లో విశ్లేషించగల నేర్పుతో భారతీయ ప్రజాస్వామ్యం, సంస్థాగత వ్యవస్థలను బలోపేతం చేసే దిశగా కృషి చేశారని ప్రశంసించారు.

ప్రధాని మోడీ

దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడంలో ప్రణబ్ ముఖర్జీ చెరగని ముద్ర వేశారని, భారత రత్న ప్రణబ్ ముఖర్జీని కోల్పోయిన భారత్ దుఖిస్తున్నదని ప్రధాని అన్నారు. మాజీ రాష్ట్రపతి మరణం పట్ల తన సంతాపాన్ని తెలిపారు. పండితుడితో సమాన శ్రేష్ఠమైన ప్రణబ్ ముఖర్జీ అత్యున్నత రాజనీతిజ్ఞుడని ప్రశంసించారు.

రాజకీయాలకు అతీతంగా సమాజంలోని అన్ని వర్గాలకు ప్రణబ్ ముఖర్జీ ఆరాధనీయుడయ్యారని మోడీ తెలిపారు. ప్రణబ్ ముఖర్జీ‌తో తన అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. 2014‌లో ప్రధానిగా ఢిల్లీకి కొత్తగా వచ్చిన తనకు నాటి రాష్ట్రపతి అయిన ప్రణబ్ ముఖర్జీ తొలి రోజు నుంచి మార్గదర్శకత్వంగా నిలిచి అన్నింటా మద్దతిచ్చి ఆశీర్వాదించాలని మోడీ తెలిపారు. ఆయనతో అనుబంధాన్ని తాను ఎల్లప్పుడూ ఆదరిస్తానని అన్నారు. ప్రణబ్ కుటుంబ సభ్యులకు మోడీ సంతాపం తెలిపారు.

మధ్యప్రదేశ్ సీఎం చౌహన్

ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జి మృతివార్త తెలియ‌గానే మ‌ధ్య‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి శివ‌రాజ్‌సింగ్ తీవ్ర విచారం వ్య‌క్తంచేశారు. ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జి మ‌ర‌ణంతో భార‌త రాజ‌కీయాల్లో ఒక అధ్యాయం ముగిసిన‌ట్లేన‌ని మ‌ధ్య‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి శివ‌రాజ్‌సింగ్ చౌహన్ అభిప్రాయ‌ప‌డ్డారు. ప్ర‌ణ‌బ్‌ముఖర్జి ఎప్పుడూ పార్టీ పాలిటిక్స్ కంటే దేశ ఉన్న‌తికే ఎక్కువ ప్రాముఖ్యం ఇచ్చేవార‌ని శివ‌రాజ్‌సింగ్ గుర్తు చేసుకున్నారు. త‌న త‌ర‌ఫున, మ‌ధ్య‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌లు అంద‌రి త‌ర‌ఫున ప్ర‌ణ‌బ్ మృతికి సంతాపం తెలుపుతున్నాన‌ని ఆయ‌న చెప్పారు.

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ

‘మన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ దురదృష్టవశాత్తూ మరణించిన వార్త అందుకుని దేశం విచారంలో మునిగిపోయింది. ఈ వార్త తెలిసీ నేను మనోవేధనకు గురయ్యాను. ఆయనకు దేశ ప్రజలందరితో పాటు శోకాతప్త నివాళులు అర్పిస్తున్నాను. ప్రణబ్ కుటుంబానికి, సన్నిహుతులకు తన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నాను అని రాహుల్ గాంధీ అన్నారు.

కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా

దేశం గొప్ప నేతను కోల్పోయిందని హోంమంత్రి అమిత్‌ షా ప్రణబ్‌ ముఖర్జీ మృతి పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. భారత్‌ గొప్ప రాజనీతిజ్ఞుడిని కోల్పోయిందని, ఆయన మాతృభూమికి ఎనలేని సేవ చేశారని ప్రస్తుతించారు