కొత్త రెవెన్యూ చట్టం కోసం కేసీఆర్‌ ఎందుకింత పంతం పట్టారు?

  • Published By: murthy ,Published On : September 9, 2020 / 07:33 PM IST
కొత్త రెవెన్యూ చట్టం కోసం కేసీఆర్‌ ఎందుకింత పంతం పట్టారు?

Telangana Revenue act 2020: సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన కొత్త రెవెన్యూ చట్టం తహశీల్దార్లు, ఆర్డీవోల అధికారాల్లో కోత పెట్టింది. కొత్త రెవెన్యూ చట్టం అమల్లోకి వచ్చాక ప్రస్తుతమున్న ఎమ్మార్వోలంతా జాయింట్ సబ్ రిజిస్ట్రార్లుగా వ్యవహరించనున్నారు. వ్యవసాయ భూములను జాయింట్ రిజిస్ట్రార్‌లుగా పిలవబడే తహశీల్దార్లు రిజిస్ట్రేషన్ చేస్తారు.

వ్యవసాయేతర భూములను సబ్ రిజిస్ట్రార్లు, రిజిస్ట్రేషన్ చేస్తారని సీఎం కేసీఆర్ అంటున్నారు. గ్రామకంఠం, పట్టణ భూములను వ్యవసాయేతర భూములుగా పరిగణిస్తారు. రిజిస్ట్రార్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోనే.. వీటికి సంబంధించిన రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. తహశీల్దార్లకు.. వ్యవసాయ భూములు రిజిస్ట్రేషన్ చేసే అధికారం ఉంటుంది.


కొద్దిరోజుల్లో భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియకూడా మారిపోనుంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియను ముందే అలాట్ చేస్తారు. అలాట్ చేసిన వివరాలు ధరణి పోర్టల్‌లో రిజిస్టర్ చేస్తారు. రిజిస్ట్రేషన్ కోసం ప్రజలు కూడా ముందే స్లాట్ బుక్ చేసుకోవాలి. డాక్యుమెంట్లుకూడా వాళ్లే రాసుకోవచ్చు.

లేనిపక్షంలో ఫీజుకట్టి డాక్యుమెంట్ రైటర్ సాయం తీసుకోవచ్చు. క్రయ,విక్రయాలు పూర్తై రిజిస్ట్రేషన్ చేసిన వెంటనే ధరణి పోర్టల్‌లో వివరాలన్నీ అప్‌డేట్ అవుతాయి. రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ సహా అన్ని ఒకేసారి పూర్తవుతాయని చెప్పారు సీఎం కేసీఆర్.



పాసు పుస్తకాలు లేని భూములకు వాటిని జారీ చేసే అధికారం కూడా తహశీల్దార్లకే అప్పగించారు. వ్యవసాయ భూముల క్రయవిక్రయాలు పూర్తైన వెంటనే బదిలీ చేయాల్సి ఉంటుంది. రికార్డ్ పూర్తి చేసి కొన్నవారికి బదిలీ చేయాలి. తప్పు చేసిన తహశీల్దార్‌పై బర్తరఫ్‌తో పాటు క్రిమినల్ చర్యలు తీసుకుంటారు. భూములు కూడా తిరిగి స్వాధీనం చేసుకుంటారు.

తెలంగాణలో సమగ్ర భూ సర్వే తర్వాత.. అన్ని వివరాలతో ధరణి పోర్టల్ అందుబాటులోకి రానుంది. ఇందులో అగ్రికల్చర్, నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ పేరుతో రెండు విభాగాలుంటాయి. ధ‌ర‌ణి పోర్టల్‌లో పంచాయ‌తీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్, జీహెచ్ఎంసీ ఆస్తుల వివ‌రాలు ఉంటాయి. ఎవరు ఎక్కడున్నా, ఉన్నచోటు నుంచే ఆస్తుల వివరాలు చూసుకోవచ్చు. ఇకపై ఆఫీసుల చుట్టూ తిరిగే ఇబ్బందులు ఉండవు. నిషేధిత భూములు ఇకపై రిజిస్ట్రేషన్లు కావని కేసీఆర్ స్పష్టం చేశారు.

రిజిస్ట్రేషన్ అయిన వెంటనే మ్యుటేషన్ ప్రక్రియకూడా పూర్తికానుంది. మ్యుటేషన్ పవర్‌ని కూడా ఆర్డీవో నుంచి తొలగించి ఎమ్మార్వోకు అప్పగించారు. ఈ ప్రాసెస్ పూర్తికాగానే ధరణి పోర్టల్‌లో వివరాలు అప్‌లోడ్ చేసేస్తారు. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్, పాస్ బుక్, ధరణి కాపీ కూడా వెంటనే తీసుకోవచ్చు. ఉమ్మడి ఒప్పందం ఉంటేనే వారసత్వ భూ విభజన చేస్తారు. డిజిటల్ రికార్డుల ఆధారంగానే వ్యవసాయ రుణాలు ఇవ్వాలని చెప్పారు సీఎం కేసీఆర్.


క్రాప్‌లోన్ల మంజూరుకు పాసు పుస్తకాలను బ్యాంకుల్లో తనఖా పెట్టుకోవద్దన్నారు. కొత్త పట్టాదారు పుస్తకాన్ని హక్కుల రికార్డుగా పరిగణించనున్నారు. ఆ రికార్డులో పట్టాదారు పేరు, సర్వే నంబర్లు, విస్తీర్ణం అన్ని ఉండనున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ భూములకు.. కొత్త రెవెన్యూ చట్టం వర్తించదు. జాగీరు భూములను ప్రభుత్వ భూములుగా రెవెన్యూ రికార్డుల్లో రిజిస్టర్ చేయనున్నారు.

రెవెన్యూ చట్టానికి రిపేర్లలో భాగంగా సంచలన మార్పులు చేసింది తెలంగాణ ప్రభుత్వం. ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరిగేపని లేకుండా ఆన్‌లైన్ విధానాన్ని అందుబాటులోకి తెస్తున్నారు. ఇకపై క్యాస్ట్, ఇన్‌కం సర్టిఫికెట్లు ఇచ్చే అధికారం రెవెన్యూ డిపార్ట్‌మెంట్ నుంచి తొలగించింది. దీని వల్ల కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల కోసం కోసం విద్యార్థులు పడే బాధలు కూడా తొలగిపోనున్నాయి. క్యాస్ట్ సర్టిఫికెట్‌ని గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలే మంజారు చేస్తాయి.


అధికారులతో అవసరం లేకుండానే డేటాబేస్ ద్వారాన్ ఇన్‌కం సర్టిఫికెట్ జారీ చేస్తామని చెప్పారు సీఎం కేసీఆర్. క్యాస్ట్ సర్టిఫికెట్ మళ్లీ మళ్లీ తీసుకోకుండా లైఫ్‌టైమ్ క్యాస్ట్ సర్టిఫికెట్ ఇస్తామన్నారు.