నరికించింది, స్మగ్లింగ్ చేయించింది, వెంబడించింది అన్నీ ఒక్కడే.. పోలీసుల అదుపులో రెడ్ స్మగ్లర్ బాషా భాయ్

  • Published By: naveen ,Published On : November 9, 2020 / 12:31 PM IST
నరికించింది, స్మగ్లింగ్ చేయించింది, వెంబడించింది అన్నీ ఒక్కడే.. పోలీసుల అదుపులో రెడ్ స్మగ్లర్ బాషా భాయ్

red sandalwood smuggler basha bhai: ఎర్రచందనం స్మగ్లింగ్ వెనకున్నది బాషా భాయేనా..? తమిళ కూలీలతో ఎర్రచందనం దుంగలను నరికించి.. వాళ్లతోనే స్మగ్లింగ్ చేయించాడా..? కూలీల కారును హైజాక్ గ్యాంగ్‌ వెంబడించేలా చేసింది కూడా అతడేనా..? ఈ ప్రశ్నలన్నీంటికి సమాధానం దొరికింది. ఈ మొత్తం కేసులో…బాషా భాయే కీలకంగా చక్రం తిప్పాడని తేలింది. ఫోన్‌ కాల్స్‌ ఆధారంగా కీలక సమాచారాన్ని రాబట్టారు పోలీసులు.

గోటూరు రోడ్డు ప్రమాదంలో కీలక మలుపు.. బాషా భాయే(41) ప్రధాన సూత్రధారిగా గుర్తింపు.. కూలీలు, హైజాక్‌ ముఠాతోనూ టచ్‌లో బాషా భాయ్‌.. ఫోన్‌కాల్స్‌ ఆధారంగా నిర్ధారించిన పోలీసులు

గోటూరు యాక్సిడెంట్ కేసులో ప్రధాన సూత్రధారి బాషా భాయ్:
ఏపీలో సంచలనం రేపిన కడప జిల్లా గోటూరు యాక్సిడెంట్ కేసులో ప్రధాన సూత్రధారి ఎవరో తేలిపోయింది. రోజుకో ట్విస్ట్‌తో క్రైమ్ థ్రిల్లర్‌ను తలపించిన ఈ కేసు వెనుక..అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ బాషా భాయ్ ఉన్నట్లు పోలీసులు తేల్చారు. ఇప్పటికే అతన్ని అరెస్ట్‌ చేసిన పోలీసులు…రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు. ఎర్రచందనం చెట్లను నరికించి..దుంగలను స్మగ్లింగ్ చేయించింది బాషా భాయేనని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఫోన్‌కాల్స్‌ ఆధారంగా కీలక సమాచారం రాబట్టిన పోలీసులు…తమిళ కూలీల కారును వెంబడించిన గ్యాంగ్‌…అలాగే హైజాక్ గ్యాంగ్‌కు కూడా అతనే సూత్రధారిగా గుర్తించారు.

స్మగ్లింగ్, యాక్సిడెంట్ వెనక బాషా భాయ్ హస్తం:
వల్లూరు మండలం గోటూరు దగ్గర జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో..నలుగురు తమిళ కూలీలు సజీవదహనమయ్యారు. మరొకరు..ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ కేసును చేధించేందుకు..5 ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో..ఈ ఐదు టీమ్‌లు పర్యటించాయి. ముమ్మరంగా దర్యాప్తు చేసి కీలక సమాచారం సేకరించాయి. పూర్తి స్థాయి దర్యాప్తు అనంతరం…ఈ స్మగ్లింగ్, యాక్సిడెంట్ వెనక..బాషా భాయ్ హస్తం ఉన్నట్లు నిర్ధారించారు.

ఆ ముగ్గురు ఇచ్చిన సమాచారంతోనే బాషా భాయ్ అరెస్ట్:
స్కార్పియోలో ఎర్రచందనం దుంగలతో వెళ్తున్న తమిళ కూలీలు.. ఇటియోస్ కారులో వారిని వెంబడించిన హైజాక్ గ్యాంగ్ సభ్యులు ఎవరెవరితో ఫోన్ కాల్స్ మాట్లాడారన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఈ రెండు గ్యాంగ్‌లతో మాట్లాడింది ఒక్కరేనని పోలీసుల ఇన్వెస్టిగేషన్‌లో తేలింది. ఫోన్ కాల్స్ ఆధారంగా టవర్ లొకేషన్‌ గుర్తించిన స్పెషల్ టీమ్.. బాషా భాయ్‌ని అదుపులోకి తీసుకుంది. అయితే..తమిళ కూలీలను వెంబడించిన ఇటియోస్ కారులో కడప జిల్లాకు చెందిన ముగ్గురు వ్యక్తులు ఉన్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. కడప, రాయచోటి, పెండ్లిమర్రి మండలాలకు చెందిన ముగ్గురు వ్యక్తులను..అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వాళ్లిచ్చిన ఇన్ఫర్మేషన్‌తోనే..బాషా భాయ్‌ని పోలీసులు బెంగళూరులో అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఎర్రచందనాన్ని కాజేసే ప్రయత్నంలో ప్రమాదం:
ఇక…కడప స్మగ్లర్ల నుంచి ఎర్రచందనం కొనుగోలు చేస్తున్న బాషా..వాటిని కొచ్చిన్‌ పోర్టు నుంచి విదేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. ఇదే కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన షరీఫ్‌ అనే స్మగ్లర్‌..బాషాకు బినామీగా గుర్తించారు. షరీఫ్‌..బెంగళూరు కేంద్రంగా ఎర్రచందనం స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నట్లు తేల్చారు. ఎర్రచందనాన్ని వీరు కాజేసే ప్రయత్నంలో ప్రమాదం జరిగినట్లు పోలీసులు తేల్చారు.

వ్యాపారంలో నష్టాలు రావడంతో స్మగ్లింగ్‌ బాట:
వ్యాపారంలో నష్టాలు రావడంతో ఎర్రచందనం స్మగ్లింగ్‌ వైపు మళ్లిన బాషా…ఏడేళ్ల క్రితం కడప నుంచి బెంగళూరుకు మకాం మార్చినట్లు పోలీసులకు తెలిసింది. అక్కడ స్మగ్లర్లతో మంచి సంబంధాలు పెట్టుకున్న బాషా…తమిళనాడులోని కోయంబత్తూరుకు వెళ్లి…అక్కడ్నుంచి దందా నడిపిస్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు.