చనిపోయే ముందు ఫోన్ లో రికార్డైన ఏఈ సుందర్ మాటలు..కంటతడి పెట్టిస్తున్నాయి…

  • Published By: bheemraj ,Published On : August 23, 2020 / 08:59 PM IST
చనిపోయే ముందు ఫోన్ లో రికార్డైన ఏఈ సుందర్ మాటలు..కంటతడి పెట్టిస్తున్నాయి…

‘మనం లోపల ఉంటే అయిపోతాం..మోహన్ వెళ్లలేమా?..కష్టం మన పని అయిపోయింది’.. చనిపోయే ముందు ఏఈ సుందర్ మాట్లాడిన మాటలు ఇవి. అందరినీ కంట పెట్టిస్తున్నాయి. గురువారం అర్ధరాత్రి శ్రీశైలం పవర్ హౌజ్ లో జరిగిన అగ్నిప్రమాదంలో 9 మంది ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఏఈ సుందర్ చివరి సారిగా మాట్లాడిన మాటలు అతని ఫోన్ లో రికార్డు అయ్యాయ. అందులో వారికి చనిపోతామని ముందే అర్థమైనట్లు తెలుస్తోంది.



మంటలు చుట్టుముట్టడంతో బయటకు వెళ్లడం కష్టమని తోటి ఉద్యోగులతో సుందర్ చెప్పారు. ఇంకా ఆలస్యం చేస్తే మనం వెళ్లలేమని అన్నారు. తమ పని అయిపోయిందని సుందర్ అన్న చివరి మాటలు ఇప్పుడు అందరినీ కంటతడి పెట్టిస్తున్నాయి. మంటల్లో చిక్కుకున్న తొమ్మిది మంది కొన్ని గంటలపాటు నరకయాతన పడినట్లు మృతుల కుటుంబీకులు బోరున విలపిస్తున్నారు.

నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంటలోని శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో గురువారం రాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అర్ధరాత్రి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మొదటి యూనిట్ లో పెద్ద శబ్దాలతో పేలుడు సంభవించింది. తొలుత ప్యానెల్ బోర్డులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి జల విద్యుత్ కేంద్రం మొత్తం వ్యాపించాయి.



భారీగా మంటలు చెలరేగడం, దట్టంగా పొగలు అలుముకోవడంతో పని చేస్తున్న ఉద్యోగులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ప్రాణాలు రక్షించుకోవడానికి బయటకు పరుగులు తీశారు. ప్రమాద సమయంలో 17 మంది సిబ్బంది ఉన్నారు.

సొరంగమార్గం ద్వారా 8 మంది సురక్షితంగా బయటకు వచ్చారు. లోపలే చిక్కుకుపోయిన మిగిలిన 9 మంది చనిపోయారు. మొదటగా ఏఈ సుందర్ నాయక్ మృతదేహాన్ని రెస్క్యూ టీమ్ గుర్తించారు. ఆ తర్వాత మరో ఎనిమిది మృతదేహాలను గుర్తించింది.