హైదరాబాద్‌లో మిట్ట మధ్యాహ్నమే చీకట్లు, నగరాన్ని కమ్మేసిన నల్లని మబ్బులు, మళ్లీ భారీ వర్షం

  • Published By: naveen ,Published On : October 20, 2020 / 01:03 PM IST
హైదరాబాద్‌లో మిట్ట మధ్యాహ్నమే చీకట్లు, నగరాన్ని కమ్మేసిన నల్లని మబ్బులు, మళ్లీ భారీ వర్షం

again heavy rain in hyderabad: హైదరాబాద్ ని వరుణుడు వెంటాడుతున్నాడు. మళ్లీ కుండపోత వర్షం కురుస్తోంది. నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉదయం కాస్త ఎండ కాచింది. సడెన్ గా వాతావరణం మారిపోయింది. మిట్ట మధ్యాహ్నమే చీకట్లు అలుముకున్నాయి. నగరాన్ని నల్లని మబ్బులు కమ్మేశాయి. ఎటుచూసినా చీకటి వాతావరణం కనిపిస్తోంది. మధ్యాహ్నం 12.30 గంటలకు ఉరుములు, మెరుపులతో కూడిన జడివాన మొదలైంది. భారీ వర్షం నగరాన్ని ముంచెత్తింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రహదారులపై నీరు నిలవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.

హైదరాబాద్ పై పగబట్టిన వరుణుడు:
వరుణుడు హైదరాబాద్ పై పగబట్టాడేమో అనిపిస్తోంది. వరుసగా కురుస్తున్న వానలతో నగరవాసులు వణికిపోతున్నారు. ఇప్పటికే పలు కాలనీలు, లోతట్టు ప్రాంతాలు నీళ్లలో నానుతున్నాయి. ఇప్పుడు మళ్లీ కుండపోత వాన కురుస్తుండటంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మరో మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయనే వాతావరణ శాఖ హెచ్చరికలతో జీహెచ్ఎంసీ సిబ్బంది అలర్ట్ అయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను రిలీఫ్ సెంటర్లకు తరలించారు. 53 బోట్లను అధికారులు సిద్ధం చేశారు.

తెలుగు రాష్ట్రాలను వరుణుడు బెంబేలెత్తిస్తున్నాడు. గ్యాప్ ఇవ్వకుండా వరదలతో ముంచెత్తుతున్నాడు. ఒకవైపు భారీ వర్షాలు.. వరదలు కుమ్మేస్తుంటే.. మరో మూడు రోజులు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి కొనసాగుతోందని… మరికొన్ని గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం అవకాశముందని అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వార్నింగ్ ఇస్తోంది వాతావరణశాఖ. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దని అధికారులు సూచిస్తున్నారు.

భారీ నుంచి అతి భారీ వర్షాలు:
వాతావరణశాఖ హెచ్చరికలతో తెలుగు రాష్ట్రాల ప్రజలు వణికిపోతున్నారు. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముందని చెప్పడంతో… బెంబేలెత్తిపోతున్నారు. దక్షిణ తీరానికి దగ్గరలో మధ్య బంగాళాఖాతంలో 1.5 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. అది మరికొన్ని గంటల్లో తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఆ తర్వాత అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉందని, దీని ప్రభావంతో మూడు రోజుల పాటు.. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలతోపాటు.. అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

వణికిపోతున్న హైదరాబాద్ ప్రజలు:
ఇప్పటికే తెలంగాణలో చాలా ప్రాంతాల్లో వర్షం పడుతూనే ఉంది. సోమవారం(అక్టోబర్ 19,2020) ఉదయం ఎండగా ఉన్నా ఒక్కసారిగా కమ్మేసిన మబ్బు చాలా ప్రాంతాల్లో వర్షాన్ని కురిపించింది. మధ్య బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారితే… అక్టోబర్ 22వ తేదీ వరకు భారీగా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చెబుతోంది. వెదర్ అలర్ట్‌తో హైదరాబాద్‍‌లోని చాలా ప్రాంతాల ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ఇప్పటికే 10 రోజులుగా చాలా కాలనీలు వర్షంలో నానుతున్నాయి. కనీసం నిత్యవసర వస్తువులు కూడా తెచ్చుకునే పరిస్థితి లేదు. దీంతో చాలా మంది ప్రజలు పస్తులుంటున్నారు.

కోస్తాంధ్రకు భారీ నుంచి అతి భారీ వర్ష సూచన:
అటు ఏపీలోనూ కోస్తాంధ్రలో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు, నదీ పరివాహక ప్రాంతాల్లోని వారు అప్రమత్తంగా వుండాలని సూచించారు. సముద్రం కూడా అల్లకల్లోలంగా వుంటుంది కాబట్టి రెండు రోజులపాటు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. మరీ ముఖ్యంగా కృష్ణా నదికి వరద పోటెత్తే అవకాశం వుంది కాబట్టి పరివాహక ప్రజలను అప్రమత్తంగా వుండాలని అధికారులు సూచించారు. మరోవైపు… ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

బురదమయంగా ముసారాంబాగ్‌ రహదారి:
హైదరాబాద్‌లోని ముసారాంబాగ్‌ రహదారి బురదమయంగా మారింది. మూసీ నది నుంచి వరద ఉధృతి ఎక్కువగా రావడంతో ముసారాంబాగ్‌ రహదారిని మూసివేశారు అధికారులు. అయితే వరద ఉధృతి తగ్గినా రోడ్డంతా బురద మయంగా మారింది. అయితే మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో.. ముందు జాగ్రత్త చర్యగా రహదారిపై వాహనాలకు అనుమతివ్వడం లేదు. దీంతో అంబర్‌పేట, మలక్‌పేట్‌, దిల్‌షుక్‌నగర్‌, చాదర్‌ఘాట్‌కు వెళ్లాల్సిన వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు.

* హైదరాబాద్ లో మళ్లీ భారీ వర్షం
* పొంగిపొర్లుతున్న నాలాలు, మ్యాన్ హోల్స్
* నగరంలో భారీ వర్షాలతో అలర్ట్ అయిన ప్రభుత్వం
* నగరంలో 53 బోట్లు సిద్ధం చేసిన ప్రభుత్వం
* హైదరాబాద్ లో వరదల సాయం కోసం 15మంది సీనియర్ అధికారుల నియామకం
* ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని హెచ్చరిక