ఆ నాలుగు వ్యాక్సిన్‌ల‌పైనే ప్రపంచం ఆశలు, పకడ్బందీగా వస్తున్న భారత్ వ్యాక్సిన్

  • Published By: sreehari ,Published On : August 17, 2020 / 09:47 PM IST
ఆ నాలుగు వ్యాక్సిన్‌ల‌పైనే ప్రపంచం ఆశలు, పకడ్బందీగా వస్తున్న భారత్ వ్యాక్సిన్

కరోనా వ్యాక్సిన్ కోసం వరల్డ్‌ వైడ్‌గా వందకు పైగా సంస్థలు ట్రయల్స్ జరుపుతున్నా.. వాటిలో కొన్నింట మాత్రమే మంచి ఫలితాలు వస్తున్నాయి. మరికొన్ని సైడ్ ఫెక్ట్ లతో సైడ్ అయిపోతున్నాయి. ఇమ్యూనిటి పెంచడమే టార్గెట్ గా రూపొందుతున్న టీకాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయన్నదే అసలు ప్రశ్న. చైనా, యూకే, అమెరికాలో ప్రయోగాలు జరుగుతున్నా భారత్ వైపు అందరూ చూస్తున్నారు.



ఎక్కడ కరోనా కాటేస్తుందోనని టెన్షన్ :
తప్పనిసరి పరిస్థితుల్లో జనాలు బయటకు వస్తున్నా కరోనా భయాలు మాత్రం అలానే ఉన్నాయి. ఎక్కడ తమను కాటేస్తుందోనని టెన్షన్‌తో వణికిపోతున్నారు. జనాల్లో గూడుకట్టుకున్న భయాలు పోవాలంటే కరోనాకి వ్యాక్సిన్ రావాల్సిందే. దాని కోసమే ప్రయోగాలు ముమ్మరం చేసింది హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్. ఆ కంపెనీ నుంచి వస్తున్న కో వ్యాక్సిన్ మన దేశంలో తయారవుతున్న తొలి కరోనా టీకా. వ్యాక్సిన్ ట్రయల్స్ గత నెలలోనే మొదలయ్యాయి.

మన దేశానికే చెందిన జైడస్ క్యాడిలా రెడీ చేస్తున్న డీఎన్ఏ టైప్ వ్యాక్సిన్ రెండో దశలో ఉంది. మరోవైపు డిసెంబర్ నాటికి ఆక్స్ ఫర్డ్ తయారుచేస్తున్న వ్యాక్సిన్లు రెడీ చేస్తామని సీరమ్ ఇనిస్టిట్యూట్ ప్రకటించింది. ఎర్రకోట సాక్షిగా మోదీ కూడా త్వరలోనే కరోనా వ్యాక్సిన్ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేయడంతో ఆశలు మరింత రెట్టింపయ్యాయి. అంతకుముదు కరోనా వైరస్ కు టీకా వస్తుందని అది కూడా తెలంగాణ నుంచేనని ధీమా వ్యక్తం చేశారు మంత్రి కేటీఆర్.



వాలంటీర్లకు ఇంజెక్షన్ రూపంలో రెండు డోసులు
చైనాకు చెందిన సైనోవాక్ కంపెనీ కూడా వ్యాక్సిన్ రేసులో ఉంది. కరోనా వైరస్‌ను ఇనాక్టివేటెడ్ అంటే చచ్చిపోయిన వైరస్ కణాల రూపంలో తయారు చేస్తున్న వ్యాక్సిన్ ఇది. ఇప్పటికే థర్డ్ ఫేజ్ క్లినికల్ ట్రయల్స్ కూడా పూర్తయ్యాయి. మంచి ఫలితాలు వచ్చాయి కూడా. బుటాంటన్ ఇనిస్టిట్యూట్ తో కలిసి సైనోవాక్ ఈ వ్యాక్సిన్‌ను తయారు చేసింది.

థర్డ్ ఫేజ్‌లో 14 రోజుల తేడాతో రెండు డోసులను వాలంటీర్లకు ఇంజెక్షన్ రూపంలో ఇచ్చి పరీక్షించింది. 8,870 మందిపై ర్యాండమైజ్డ్‌గా ట్రయల్ చేసింది. వాళ్లందర్నీ ఏడాదిపాటు అబ్జర్వేషన్‌లో పెట్టారు. రెగ్యులేటరీ ఫైలింగ్ చేసినా.. ఫేజ్-3 ట్రయల్స్ ఫలితాలను వచ్చే ఏడాది సెప్టెంబర్ నాటికి ప్రకటించే అవకాశం ఉంది. దీంతో ఇప్పట్లో ఈ వ్యాక్సిన్ రాదని క్లియర్ కట్ గా తెలుస్తోంది.



మూడో దశలోకి చేడాక్స్ వ్యాక్సిన్ :
నిజానికి సైనో వాక్ వ్యాక్సిన్ ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నా.. ముందు నుంచీ అందరి దృష్టిని ఆకర్షించింది ఆక్స్ ఫర్డ్ వ్యాక్సినే. ఈ ఏడాది అక్టోబర్ నాటికి వ్యాక్సిన్‌ తెస్తామని 4 నెలల క్రితమే ప్రకటించింది. అంత త్వరగా వ్యాక్సిన్ ఎలా సాధ్యమని చాలామంది అనుమానాలు వ్యక్తం చేశారు. వారి డౌట్స్‌ని కొట్టిపడేస్తూ థర్డ్‌ ఫేజ్‌ ట్రయల్స్‌లోకి ఎంటరైంది చేడాక్స్ 1N COV-19 వ్యాక్సిన్.

బ్రిటన్ కు చెందిన ఆస్ట్రాజెనికా ఈ వ్యాక్సిన్‌ను కమర్శియల్‌గా మార్కెట్లోకి తీసుకురానుంది. ఇండియా నుంచి సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా వ్యాక్సిన్ తయారీకి పార్టనర్ గా ఉంది. ఈ ఏడాది డిసెంబర్ నాటికి వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది.



30వేల మంది వాలంటీర్లపై టెస్ట్‌లు :
అమెరికాకు చెందిన మోడర్నా కంపెనీ వైరస్‌ ఆర్‌ఎన్‌ఏని బేస్ చేసుకుని వ్యాక్సిన్ సిద్ధం చేస్తోంది. ఫేజ్-1, 2 ట్రయల్స్‌లో ఆ వ్యాక్సిన్ మంచి ఫలితాలిచ్చింది. ఈ మధ్యే థర్డ్ ఫేజ్‌లోకి ఎంటరైంది. 30 వేల మంది వాలంటీర్లపై టెస్టులు మొదలెట్టింది. రెండు డోసులు వేసుకుంటే రెండేళ్ల పాటు ప్రొటెక్షన్‌ ఉంటుందని కంపెనీ చెబుతోంది. అయితే వ్యాక్సిన్ ఎప్పుడు మార్కెట్లోకి వస్తుందనే దానిపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.

అడినోవైరస్ టైప్ 5 ప్రొటిన్ తో వ్యాక్సిన్ :
మరికొన్ని వ్యాక్సిన్లు ఫేజ్ 2 ట్రయల్స్ దశలో ఉన్నాయి. చైనాకు చెందిన కాన్సినో బయోలాజికల్ ఐఎన్సీ అనే సంస్థ బీజింగ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బయోటెక్నాలజీతో కలిసి అడినోవైరస్ టైప్ 5 ప్రొటిన్‌తో వ్యాక్సిన్ తయారు చేస్తోంది.



ఆ దేశానికే చెందిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ మైక్రోబయాలజీ, చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌తో కలిసి అన్హూయి జైఫీ లాంగ్‌కామ్‌ బయో ఫార్మాస్యుటికల్.. మెర్స్ వైరస్‌లోని ప్రొటీన్‌ను బేస్ చేసుకుని వ్యాక్సిన్ రెడీ చేస్తోంది. ఇలా చాలా కంపెనీలు వ్యాక్సిన్ వేటలో నిమగ్నమయ్యాయి. కానీ భారత్ కంపెనీల వైపే ప్రపంచం చూస్తోంది. కరోనాను ఖతం చేసే వ్యాక్సిన్ మన దగ్గర నుంచే వస్తుందని ఆశలు పెట్టుకుంది.