యుద్ధానికి సిద్దంగా ఉండండి : భారత్ తో సరిహద్దు వివాదం సమయంలో చైనా అధ్యక్షుడు కీలక వ్యాఖ్యలు

  • Published By: venkaiahnaidu ,Published On : October 14, 2020 / 08:20 PM IST
యుద్ధానికి సిద్దంగా ఉండండి : భారత్ తో సరిహద్దు వివాదం సమయంలో చైనా అధ్యక్షుడు కీలక వ్యాఖ్యలు

Xi Jinping asks PLA troops to prepare for war యుద్ధానికి సిద్ధంగా ఉండాలని, హై అలర్ట్ లో ఉండాలని పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ మెరైన్‌ కార్ప్స్ (నావికా దళం)ని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ ఆదేశించారు. మంగళవారం గ్యాంగ్‌డాంగ్‌ రాష్ట్రంలోని మిలిటరీ బేస్‌ ను జిన్ పింగ్ సందర్శించారు. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ నేవీలో భాగమైన మెరైన్‌ కార్ప్స్ ని జిన్ పింగ్ కలవడం ఇదే మొదటిసారి. 2015లో మిలటరీ సంస్కరణలో భాగంగా అధ్యక్షుడి ద్వారా ప్రారంభించబడిన మెరైన్ కార్ప్స్..2017లో సంస్కరించబడింది. తన పర్యటన సందర్భంగా మెరైన్ కార్ప్స్ కమాండర్ల రిపోర్స్ ను జిన్ పింగ్ విన్నారు. యూనిట్ యొక్క అభివృధ్ధిపై ఓ డాక్యుమెంటరీని తిలకించారు.



2017లో సంస్కరించబడినప్పటి నుంచి అభివృద్ధిలో,ఆపరేషన్స్ లో మెరైన్ కార్ప్స్ సాధించిన విజయాల పట్ల జిన్ పింగ్ సంతోషం వ్యక్తం చేశారు. మెరైన్ కార్ప్ అనేది..నేలపై,నీటిపై అత్యంత శక్తి సామర్థ్యాలు కలిగిన ఫైటింగ్ ఫోర్స్ అని జిన్ పింగ్ నొక్కి చెప్పారు. చైనా దేశ సార్వభౌమత్వాన్ని,భౌగోళిక సమగ్రతను అదేవిధంగా చైనా సముద్రపు హక్కులను మరియు దేశపు అంతర్జాతీయ ఆశయాలను కాపాడే బాధ్యత మెరైన్ కార్ప్ భుజాలపై ఉందని ఆయన అన్నారు.

కమాండర్లు మరియు అధికారులు అందరూ తమ దళాల పోరాట సంసిద్ధతను పెంపొందించడంపై దృష్టి పెట్టాలని మరియు హై అలర్ట్‌లో ఉండాలని జి చెప్పారు. నైపుణ్యాలను పెంపొందించడానికి మరింత వాస్తవిక యుద్ధ శిక్షణ తప్పనిసరిగా జరగాలి అని ఆయన అన్నారు. పోరాట సిద్ధాంతాలు, శిక్షణా పద్ధతులు మరియు టాస్క్ ప్లానింగ్ పరంగా కొత్తదనం కోసం మరిన్ని ప్రయత్నాలు చేయాలన్నారు. దక్షిణ చైనా సముద్రం మీద డ్రాగన్‌ పెత్తనంపై దిగ్గజ దేశాలు భగ్గుమంటున్న వేళ.. యుద్ధానికి సిద్ధంగా ఉండాలని, విశ్వసనీయత కలిగి ఉండాలని జిన్ పింగ్ పిలుపునిచ్చారు.



కాగా, వాస్తవాధీన రేఖ వెంబడి దుందుడుకు వైఖరి, దక్షిణ చైనా సముద్రం, ఇండో- పసిఫిక్‌ జలాలపై ఆధిపత్యం ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తున్న చైనా తీరు పట్ల అగ్రరాజ్యం అమెరికా సహా భారత్‌, ఆస్ట్రేలియా, జపాన్‌ తదితర క్వాడ్‌ దేశాలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ నాలుగు దేశాల విదేశాంగ మంత్రులు ఇటీవల టోక్యోలో సమావేశమై డ్రాగన్‌ దేశమే లక్ష్యంగా కీలక ప్రకటన విడుదల చేశారు. ఇండో- పసిఫిక్‌ ప్రాంతంలో సమ్మిళిత, స్వేచ్ఛాయుత వాతావరణమే లక్ష్యంగా కలిసి పనిచేస్తామని పునరుద్ఘాటించారు.

ఈ సమావేశం అనంతరం స్వదేశానికి చేరుకున్న అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో చైనాపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘భారత ఉత్తర సరిహద్దులో చైనా 60 వేల మంది సైనికులను మోహరించింది. వుహాన్‌లో ఉద్భవించిన ప్రాణాంతక కరోనా వైరస్‌ గురించి ప్రశ్నించినందుకు ఆస్ట్రేలియాపై వేధింపులకు పాల్పడింది. చైనీస్‌ కమ్యూనిస్టు పార్టీ పాలన వల్ల ప్రపంచానికి ముప్పు పొంచి ఉంది’’ అంటూ డ్రాగన్‌ వైఖరిని ఎండగట్టారు. దీంతో మరోసారి అమెరికా- చైనాల మధ్య తలెత్తిన విభేదాలు మరోసారి తారస్థాయికి చేరుకున్నాయి. అమెరికా.. తైవాన్‌కు అన్ని రకాలుగా అండగా నిలవడం పట్ల చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. అగ్రరాజ్యం అండతో తమతో సవాలు చేస్తే యుద్ధం తప్పదంటూ తైవాన్‌ను కూడా హెచ్చరించింది.



మరోవైపు, భారత్‌తోనూ సరిహద్దుల్లో పదే పదే కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న డ్రాగన్‌, మంగళవారం నాటి మిలిటరీ చర్చల్లో సానుకూల చర్చ జరిగిందని మంగళవారం ప్రకటన విడుదల చేయడం గమనార్హం. అయితే అదే సమయంలో భారత్‌కు వ్యూహాత్మకంగా కీలకమైన లడఖ్, కశ్మీర్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌ తదితర ప్రాంతాల్లో నూతనంగా నిర్మించిన వంతెనల గురించి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసింది. సరిహద్దుల్లో భారత్ చేపట్టిన నిర్మాణాలే వివాదాలకు కారణమని డ్రాగన్ వ్యాఖ్యానించింది. లడఖ్ ను తాము కేంద్రపాలితప్రాంతగా గుర్తించమని చెప్పింది. భారత్ అక్రమంగా లడఖ్ ను కేంద్రపాలితప్రాంతగా ప్రకటించిందని నంగనాచి కబుర్లు చెప్పింది.