వచ్చే ఏడాది మార్చి తర్వాతే కరోనా టీకా

  • Published By: bheemraj ,Published On : November 2, 2020 / 01:34 AM IST
వచ్చే ఏడాది మార్చి తర్వాతే కరోనా టీకా

భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ వచ్చే ఏడాది మార్చి తర్వాతే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. నియంత్రణ సంస్థల నుంచి అవసరమైన అనుమతులు వచ్చాకే వ్యాక్సిన్ విడుదల చేసేందుకు సిద్ధమైనట్లు ప్రకటించింది. ప్రస్తుతం మూడో దశ క్లినికల్ ట్రయల్స్ పైనే దృష్టి సారించినట్లు భారత్ బయోటెక్ స్పష్టం చేసింది.



భారత వైద్య పరిశోధన మండలి, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ భాగస్వామ్యంతో భారత్ బయోటెక్ కోవాక్జిన్ ను అభివృద్ధి చేస్తూ ఉండగా ఈ ఏడాది జనవరిలోనే టీకా వస్తుందని అందరూ భావించారు. అయితే సమర్థత, భద్రతకు సంబంధించి తుది దశ క్లినికల్ ట్రయల్స్ లో కచ్చితమైన రుజువు లభించి నియంత్రణ సంస్థల అనుమతులు పొందిన తర్వాతే వ్యాక్సిన్ విడుదల చేస్తామని భారత్ బయోటెక్ ప్రతినిధులు వెల్లడించారు.



దీంతో వచ్చే ఏడాది రెండో త్రైమాసికంలోనే దీన్ని విడుదల చేయాలనే లక్ష్యంతో ఉన్నట్లు తెలుస్తోంది. కోవాక్జిన్ మూడో దశ ప్రయోగాల కోసం డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా నుంచి భారత్ బయోటెక్ ఈ మధ్య అనుమతి పొందింది.



వాలంటీర్ల ఎంపిక, వ్యాక్సిన్ ప్రయోగాలను ఈ నెలలోనే ప్రారంభించే ఏర్పాట్లు జరుగుతున్నాయని భారత్ బయోటెక్ పేర్కొంది. ఇందుకోసం దేశంలోని 13, 14 రాష్ట్రాల్లో దాదాపు 25 నుంచి 30 ప్రాంతాల్లో ఈ ప్రయోగాలు జరిపేందుకు ఏర్పాట్లు చేస్తోంది.