హ్యాపీ ల్యాండింగ్… అంబాల విమానాశ్రయంలో ల్యాండ్ అయిన రాఫెల్ యుద్దవిమానాలు

హ్యాపీ ల్యాండింగ్… అంబాల విమానాశ్రయంలో ల్యాండ్ అయిన రాఫెల్ యుద్దవిమానాలు

అంబాల స్థానికులంతా ఆకాశానికే చూపులు అప్పగించేశారు. రాఫెల్ యుద్ధ విమానాలు ల్యాండింగ్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన సమయం రానే వచ్చింది. ఐదు విమానాలు అంబాలా కంటోన్మెంట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్(ఐఏఎఫ్) వద్ద బుధవారం మధ్యాహ్నం ల్యాండ్ అయ్యాయి. అంబాలా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అండ్ పోలీస్ డిప్యూటెడ్ సెక్యూరిటీ మధ్య ఐఏఎఫ్ ఎయిర్ బేస్ లో రోడ్లకు ఇరువైపులా బారికేడ్లు కవర్ అయి ఉండగా రాఫెల్ విమానాలు ల్యాండ్ అయ్యాయి.

చారిత్రకమైన ఈ మూమెంట్ ను చిత్రీకరించేందుకు మీడియాకు అవకాశం దొరకలేదు. అంబాలా కంటోన్మెంట్ ప్రాంతం వద్దే జనరల్ పబ్లిక్ తో పాటు మీడియాను కూడా నిలిపేశారు. అందిన సమచారం ప్రకారం.. యుద్ధ విమానాల రాక సందర్భంగా స్థానికులంతా స్వీట్లు పంచుకుని సెలబ్రేట్ చేసుకున్నారు. డ్రమ్ బీట్స్ తో డ్యాన్సులు చేస్తూ.. గాల్లోకి బెలూన్లు వదిలి జోష్ తో గడిపారు. సాయంత్రం 7నుంచి 7గంటల 30నిమిషాల మధ్యలో అందరి ఇళ్లలోనూ లైట్లు ఆపేయనున్నారు.



దేశంలో హాట్ టాపిక్‌గా మారిన ఈ జెట్ ఫైటర్స్‌ను రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, వైమానిక దళాధినేత రాకేష్ కుమార్ భడౌరియా సహా పలువురు ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. వైమానిక దళ అమ్ముల పొదిలో చేరి బ్రహ్మాస్త్రంగా గుర్తింపు పొందాయి రాఫెల్ జెట్స్. సోమవారం ఫ్రాన్స్‌లో టేకాఫ్ తీసుకున్న ఈ యుద్ధ విమానాలు మధ్యాహ్నానికి భారత్‌కు చేరుకున్నాయి.

మొత్తం 36 రాఫెల్ యుద్ధ విమానాలను తయారు చేయడానికి రక్షణ మంత్రిత్వ శాఖ ఫ్రాన్స్‌కు చెందిన డసాల్ట్ ఏవియేషన్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకున్న విషయం తెలిసిందే. తొలి బ్యాచ్‌లో అయిదు రాఫెల్ యుద్ధ విమానాలను అందించింది ఫ్రాన్స్. ఏడు వేలకు పైగా కిలోమీటర్ల దూర ప్రయాణంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నాయి. మళ్లీ తమ ప్రయాణాన్ని ఆరంభించి బుధవారం మధ్యాహ్నానికి హర్యానాలోని అంబాలాకు చేరుకున్నాయి.