కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్… హైదరాబాద్‌కు 60 మంది విదేశీ రాయబారులు..

  • Published By: sreehari ,Published On : December 8, 2020 / 09:20 PM IST
కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్… హైదరాబాద్‌కు 60 మంది విదేశీ రాయబారులు..

60 foreign envoys to Hyderabad for Covid vaccine briefing: భారత్ బయోటెక్, బయోలాజికల్ E అభివృద్ధి చేస్తోన్న కరోనా వ్యాక్సిన్లకు సంబంధించి ట్రయల్స్, ఫలితాల గురించి తెలుసుకునేందుకు విదేశీ రాయబారులు, హైకమిషనర్ల బృందం హైదరాబాద్‌కు రానుంది. ఈ సందర్భంగా 60మంది రాయబారుల బృందం భారత్ బయోటెక్‌ను సందర్శించనుంది.

దేశంలో కోవిడ్‌పై జరుగుతున్న పరిశోధనలను విదేశీయులకు పరిచయం చేసే లక్ష్యంతో విదేశాంగ మంత్రిత్వశాఖ ఈ దిశగా నిర్ణయం తీసుకుంది. బుధవారం ఉదయం 10 గంటలకు 80 దేశాలకు చెందిన రాయబారులు, హైకమిషనర్లతో కూడిన బృందం ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కి చేరుకోనుంది. జీఎంఆర్‌ ఎయిర్‌ పోర్టు నుంచి నేరుగా భారత్‌ బయోటెక్‌కి వెళ్లనుంది. అక్కడ కోవాగ్జిన్‌‌ పనితీరు, జరుగుతున్న ట్రయల్స్, వాటి ఫలితాలను అడిగి తెలుసుకోనున్నారు.



విదేశీ రాయబారులు, హైకమిషనర్ల బృందానికి భారత్ బయోటెక్ లో కోవాగ్జిన్ ప్రయోగాల్లో పనిచేస్తున్న సైంటిస్టులు వివరణ ఇవ్వనున్నారు. భారత్ బయెటెక్ సహా ఫైజర్ ఇండియా, సీరమ్ ఇన్సిస్ట్యూట్ ఆఫ్ ఇండియా మూడు కంపెనీలు కోవిడ్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి ప్రభుత్వం నుంచి అనుమతి కోరాయి. భారతీయ కరోనా వ్యాక్సిన్‌ను ప్రభుత్వ నేషనల్ ఇన్సిస్ట్యూట్ ఆఫ్ వైరాలజీ భాగస్వామ్యంతో భారత్ బయెటెక్ అభివృద్ధి చేసింది.

ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ మూడో దశ ట్రయల్స్ జరుగుతున్నాయి. ఇందులో 25వేల మంది వాలంటీర్లు పాల్గొన్నారు. వ్యాక్సిన్ వేయించుకున్నవారిలో వైరస్‌ను నివారించి శరీరంలో వ్యాధినిరోధకతను పెరిగేలా పనిచేస్తుంది. ఇదివరకే పూణె ఆధారిత సీరమ్ ఇన్సిస్ట్యూట్ ఆఫ్ ఇండియాను కూడా సందర్శించాలని ప్రతిపాదించింది. కానీ, చివరిలో ఈ ఆలోచనను విరమించుకుంది. గత నెలలో 190 దేశాలు, అంతర్జాతీయ సంస్థలకు నుంచి వచ్చిన రాయబారులకు విదేశీ మంత్రిత్వ శాఖ వ్యాక్సిన్ పనితీరుపై వివరణ ఇచ్చింది.



అలాగే కరోనా నియంత్రణలో భారత్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో తెలియజేసింది. ఈ సందర్భంగానే దేశంలో కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి, ట్రయల్స్ కు సంబంధించి కార్యకలాపాలను తెలుసుకునేందుకు ఆయా సంస్థలను సందర్శిస్తామని హామీ ఇచ్చింది. భారతదేశంలోని ఈ మూడు కరోనా వ్యాక్సిన్లకు సంబంధించి ఆమోదంపై కొన్నివారాల్లో నిర్ణయం తీసుకోనున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ తెలిపారు. భారతదేశంలో బయోలాజికల్ Eతో కలిపి మొత్తం ఆరు కరోనా వ్యాక్సిన్లు ట్రయల్స్ దశలో కొనసాగుతున్నాయి. మూడు కంపెనీల్లో ఈ కంపెనీ కూడా విదేశీ రాయబారులతో సంభాషించనుంది. ఇటీవలే బయోలాజికల్ E వ్యాక్సిన్ కోసం తొలి దశ, రెండో దశ హ్యుమన్ ట్రయల్స్ ప్రారంభమయ్యాయి.



దేశంలో వ్యాక్సిన్‌ ఎమర్జెన్సీ మార్కెటింగ్‌కు దరఖాస్తు చేసిన 3 సంస్థల్లో భారత్‌ బయోటెక్ ఒకటి. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ఐసోలేట్ చేసిన స్ట్రెయిన్ నుంచి వ్యాక్సిన్ అభివృద్ధి చేస్తోంది. భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్‌ మూడోదశ ట్రయల్స్‌లో ఉంది. భారత్‌ బయోటెక్‌కు వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడంతో పాటు ఉత్పత్తి చేసే సామర్ధ్యం కూడా లభించింది. హైదరాబాద్‌ భారత్‌ బయోటెక్‌ ఫెసిలిటీలో బయో సేఫ్టీ లెవల్‌-3 యూనిట్ ఉంది. ఈ యూనిట్‌లోనే కోవాగ్జిన్ ఉత్పత్తి చేస్తోంది.



ఈ కోవాగ్జిన్ పనితీరుకు సంబంధించి ఇతర దేశాల ప్రతినిధులకు ప్రత్యక్షంగా కేంద్రం చూపించనుంది. ప్రత్యక్షంగా చూపించడం ద్వారా ఆయా దేశాలకు ఎగుమతి చేసే అవకాశాల పరిశీలించనుంది. ఇటీవలే భారత్‌ బయోటెక్‌ను ప్రధాని నరేంద్రమోదీ సందర్శించిన సంగతి తెలిసిందే. భారత్‌ బయోటెక్‌ సామర్ధ్యంపై ప్రధాని మోడీ సైతం సంతృప్తి చెందారు. ఇతర దేశాల ప్రతినిధులకు చూపించడం ద్వారా వ్యాక్సిన్ డిప్లమసీకి శ్రీకారం చుట్టాలని భావించారు. ఇతర దేశాలకు వ్యాక్సిన్ సరఫరా చేసి సంబంధాలు మెరుగుపరచుకునే వ్యూహంలో ఇదొక భాగమని చెప్పవచ్చు.