30రోజుల్లో 2రేప్ లు : హత్రాస్ లో ఆగని అకృత్యాలు…నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం

  • Published By: venkaiahnaidu ,Published On : October 14, 2020 / 04:31 PM IST
30రోజుల్లో 2రేప్ లు : హత్రాస్ లో ఆగని అకృత్యాలు…నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం

హత్రాస్ లో అకృత్యాలు ఆగతడం లేదు. కొన్ని రోజుల క్రితం ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్ లో 19 ఏళ్ల దళిత యువతిపై కొందరు దుండగులు గ్యాంగ్ రేప్ కు పాల్పడిన దారుణ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత యూపీ పోలీసులు వ్యవహరించిన తీరుపై సర్వత్రా నిరసనలు వ్యక్తమయ్యాయి. కాగా, హత్రాస్ గ్యాంగ్ రేప్ విషయాన్ని దేశం మరవక ముందే అక్కడ ఇప్పుడు మరో దారుణం చోటు చేసుకుంది. హత్రాస్ లోని నాలుగేళ్ల చిన్నారిపై బంధువే అత్యాచారానికి పాల్పడ్డాడు. హత్రాస్ లో 30రోజుల్లో 2రేప్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి.



మంగళవారం హత్రాస్ జిల్లాలోని సాస్ని అనే ఊరిలో ఇంటి ముందు ఆడుకుంటున్న నాలుగేళ్ల బాలికను అరవింద్ అనే వ్యక్తి తన ఇంటికి తీసుకెళ్లాడు. అనంతరం ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే, సాయంత్రం సమయంలో బాలికను గమనించిన తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది. దీంతో వారు ఆ బాలికను స్థానిక వైద్యుల వద్దకు తీసుకెళ్లారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆ చిన్నారి రేప్ కు గురైందని నిర్ధారించారు. బాలిక మావయ్య ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని గుర్తించి అరెస్టు చేశారు. నిందితుడు బాలిక బంధువేనని సమచారం.



కాగా,సెప్టెంబర్-14న హత్రస్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన దళిత యువతి.. తన పొలంలో గడ్డి కోయడానికి వెళ్లింది. ఆ యువతితో పాటు తన అమ్మ, సోదరి, సోదరుడు కూడా ఉన్నారు. అమ్మ, సోదరులకు దూరంగా ఆ యువతి పని చేస్తుండగా వెనుకనుంచి వచ్చిన నలుగురు యువకులు.. ఆమెను పక్కనే ఉన్న చేనులోకి ఎత్తుకెళ్లారు. అత్యంత కిరాతకంగా ఆ యువతిని ఒకరి తర్వాత ఒకరుగా రేప్ చేశారు. అనంతరం ఆమె నాలుక కూడా కోశారు. యువతి ఆర్తనాదాలు విన్న ఆమె తల్లి.. ముందుగా ఈ దారుణాన్ని గుర్తించింది. తనకోసం వెతుక్కుంటూ వెళ్లేసరికే రేప్ చేసిన దుండగులు అక్కడ్నుంచి పారిపోయారు.



తీవ్ర గాయాలపాలైన ఆ యువతిని మొదట అలీఘర్ హాస్పిటల్ కు ట్రీట్మెంట్ కోసం తరలించారు. అలీఘర్‌లో ట్రీట్మెంట్ అందించినా ఫలితం లేకపోవడంతో, ఢిల్లీలోని సఫ్దార్‌జంగ్‌ హాస్పిటల్ కి తరలించారు. పక్షవాతంతో పాటు శరీరంలోని కీలక అవయవాలు తీవ్రంగా దెబ్బతినడంతో రెండు వారాలు చిత్రవధ అనుభవించిన బాధితురాలు మృత్యువుతో పోరాడుతూ సెప్టెంబర్‌ 29న తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఇక అదేరోజు అర్థరాత్రి కుటుంబసభ్యులకు కూడా సమాచారం అందించకుండా పోలీసులే బాధితురాలి శవాన్ని దహనం చేయడం తీవ్రవిమర్శలకు దారితీసింది.

ఢిల్లీ నుంచి బాధితురాలి మృతదేహాన్ని హత్రాస్ తరలించిన పోలీసులు.. డెబ్‌బాడీని ఇంటికి తీసుకెళ్లలేదు.కుటుంబ సభ్యుల ఇష్టాఇష్టాలతో సంబంధం లేకుండా అర్ధరాత్రి దాటిన తర్వాత 3 గంటల సమయంలో శవాన్ని రహస్యంగా ఖననం చేశారు. బాధితురాలి అంత్యక్రియలను పోలీసులు, జిల్లా అధికారులు రహస్యంగా నిర్వహించడంతో దేశ వ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమైంది.


కాగా, హత్రాస్ ఘటనపై అన్ని వర్గాల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తడంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సెప్టెంబర్-30న ఈ కేసు విచారణకై తొలుత ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) నియమించింది. ఏడు రోజుల్లోగా నివేదిక అందించాలని ఆదేశించింది. ఆ తర్వాత మరో పది రోజుల పాటు సమయం కావాలని సిట్‌ కోరడంతో గడువును పొడిగించింది. ఇక ఈ కేసులో ఆది నుంచి పోలీసుల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో దీనిని సీబీఐకి అప్పగించాల్సిందిగా డిమాండ్లు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఈ కేసును సీబీఐకి అప్పగించారు.



దీంతో ఆదివారం ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన సీబీఐ…ఐపీసీ సెక్షన్లు 376-D(సామూహిక లైంగిక దాడి), 307(హత్యాయత్నం), 302(హత్య)తో పాటు ఎస్సీ- ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసింది. క్రైం సీన్ దగ్గర ఆధారాలు సేకరించేందుకు సోమవారం ఫోరెన్సిక్‌ నిపుణులను సీబీఐ అక్కడికి తీసుకువెళ్లింది. గతంలో షిమ్లా అత్యాచారం, హత్య కేసును విచారించిన సీమా పహుజా నేతృత్వంలో దర్యాప్తు కొనసాగుతోంది.