కేంద్రం చారిత్రాత్మక నిర్ణయం : వేల ఏళ్ల తర్వాత భారత్ లో…చేతులతో మ్యాన్ ‌హోల్స్‌ శుభ్రపరిచే విధానానికి ముగింపు

  • Published By: venkaiahnaidu ,Published On : November 20, 2020 / 08:10 PM IST
కేంద్రం చారిత్రాత్మక నిర్ణయం : వేల ఏళ్ల తర్వాత భారత్ లో…చేతులతో మ్యాన్ ‌హోల్స్‌ శుభ్రపరిచే విధానానికి ముగింపు

manual scavenging to end in India వందల ఏళ్ల నుంచి భారత్ లో మ్యాన్‌హోల్స్‌ను చేతులతోనే శుభ్రపరిచే విధానం (మాన్యువల్ స్కావెంజింగ్)కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే, ఇక ఈ అనారిక పద్దతులకు స్వస్తి పలకాలని కేంద్రం నిర్ణయించింది. ఇప్పటి నుంచి తప్పనిసరిగా సెప్టిక్ ట్యాంకులు, మురుగునీటి కాలువలను ఆటోమేటెడ్ క్లీనింగ్ పద్ధతుల ద్వారా మాత్రమే శుభ్రపరిచేలా చట్టానికి సవరణ చేయాలని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ నిర్ణయించింది.



మాన్యువల్ స్కావెంజర్ పద్ధతులను పూర్తిగా నిషేధించడనికి, చేతులతో వ్యర్థాలను తీసే కార్మికులకు ఉపాధి, పునరావాసం కల్పించడానికి ప్రస్తుతం అమల్లో ఉన్న ప్రొహిబిషన్ ఆఫ్‌ ఎంప్లాయిమెంట్ ఆఫ్ మ్యాన్యువల్ స్కావెంజర్స్ అండ్ రిహ్యాబిలిటేషన్ (PEMSR) చట్టానికి సవరణలు చేస్తున్నట్లు గురువారం(నవంబర్-19,2020)వరల్డ్ టాయిలెట్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.



సఫాయిమిత్ర సురక్షా ఛాలెంజ్
కొత్త ప్రోత్సాహకాల్లో భాగంగా పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ‘సఫాయిమిత్ర సురక్షా ఛాలెంజ్’ ను ప్రారంభించింది. మ్యాన్యువల్‌గా కాకుండా సెప్టిక్ ట్యాంక్, డ్రైనేజీలు, మ్యాన్‌హోల్స్‌ను యంత్రాల సాయంతో శుభ్రపరచాలనే నినాదంతో ఈ ఛాలెంజ్‌ ను ప్రారంభించారు. ఇందులో భాగంగా సివిక్ వర్కర్లకు శుభ్రపరిచే యంత్రాలను(cleaning machines) కొనుగోలు చేయడానికి కార్మికులకు మంత్రిత్వ శాఖ నిధులు మంజూరు చేస్తుంది. కార్మికులు ఈ యంత్రాలను సొంతం చేసుకోవాలని కోరుతున్నాం. వీటిని మున్సిపాలిటీలు అవసరమైనప్పుడు ఉపయోగించుకోవచ్చని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు.



మ్యాన్‌హోల్ నుంచి మెషిన్ హోల్ వరకు
ఇకపై “మ్యాన్‌ హోల్‌” అనే పదానికి బదులుగా”మెషిన్‌ హోల్” అనే పదాన్ని అధికారిక వాడుక భాషలో చేర్చునున్నట్లు హర్దీప్ సింగ్ పూరి తెలిపారు.



PEMSR చట్టం
ఈ చట్టం ప్రకారం నిర్ణీత పద్ధతి పాటించకుండా లెట్రిన్లను నిర్మించడం, వాటి నిర్వహణపై నిషేధం ఉంది. డ్రైనేజీలు, సెప్టిక్ ట్యాంకులను మాన్యువల్ స్కావెంజింగ్ పద్ధతిలో శుభ్రపరిచే ఉద్యోగాలను కూడా చట్టం నిషేధిస్తుంది. డ్రైనేజీలు, సెప్టిక్ ట్యాంకులను ప్రమాదకరంగా, మ్యాన్యువల్‌ గా చేతులతో శుభ్రపరచడం కోసం ఏవరైనా ఒక వ్యక్తి లేదా ఏజెన్సీ పారిశుద్ధ్య కార్మికులను తీసుకెళ్తే కఠినమైన శిక్షలు విధిస్తారు. ఈ చట్టం కింద ఐదు సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా రూ.5 లక్షల వరకు జరిమానా, లేదా రెండు శిక్షలూ కలిపి విధించే అవకాశం ఉంది. అదేవిధంగా, ఈ చట్టం ప్రకారం బాధితుడు నేరాన్ని అది జరిగిన తేదీ నుంచి ఖచ్చితంగా మూడు నెలల్లోపే దాన్ని అధికారులకు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.