అలా పుట్టడం నా తప్పా? ‘800’ వివాదంపై మురళీధరన్ స్పందన.. విజయ్ సేతుపతికి రాధిక మద్దతు..

  • Published By: sekhar ,Published On : October 17, 2020 / 05:26 PM IST
అలా పుట్టడం నా తప్పా? ‘800’ వివాదంపై మురళీధరన్ స్పందన.. విజయ్ సేతుపతికి రాధిక మద్దతు..

Muthiah Muralidaran Biopic 800: శ్రీలంక క్రికెటర్, స్పిన్ మాంత్రికుడు ముత్తయ్య మురళీధరన్ జీవిత కథ సినిమాగా తెరకెక్కబోతోంది. ప్రముఖ తమిళ నటుడు, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి మురళీధరన్ పాత్రలో నటిస్తున్నారు. ‘800’ పేరు ఖరారు చేశారు. ఈ సందర్భంగా విజయ్ సేతుపతి ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు.

అయితే ‘800’ సినిమాపై తమిళ సంఘాలు, సినీ పెద్దలు విమర్శలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో #ShameOnVijaySethupathi హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు. తన జీవిత కథను సినిమాగా తీస్తుంటే పలువురు నిరసనలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మురళీధరన్ స్పందించారు. ఈ మేరకు ఒక లేఖ విడుదల చేశారాయన.


‘‘నాకు వివాదాలు కొత్త కాదు. ‘800’ సినిమా ఉద్దేశాన్ని కొన్ని వర్గాలు ప్రజలు అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటున్నా. నా జీవితం యుద్ధ భూమిలో మొదలైంది. నాకు ఏడేళ్ల వయసులో ఉన్నప్పుడు నా తండ్రి చనిపోయారు. యుద్ధ ప్రాబల్య ప్రాంతంలో ఉంటూ మనుగడ సాగించడానికి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాం. చిన్నప్పటి నుంచి నేను ఎదుర్కొన్న కష్టాలతో పాటు క్రికెట్‌లో నేను ఎలా సక్సెస్ అయ్యాను అనే అంశాలు ఈ సినిమాలో చూపిస్తున్నారు.

శ్రీలంక తమిళుడిగా పుట్టడం నా తప్పా? ఒకవేళ భారత్‌లో పుట్టి ఉంటే టీమిండియాలో ఆడేవాడిని. నేను తమిళులకు వ్యతిరేకం అంటూ వివాదం రేకెత్తించారు. రాజకీయ రంగు పులిమారు. శ్రీలంకలో తమిళుల నరమేధానికి నేను మద్దతు పలికానని ఆరోపించారు. 2009లో పరిస్థితులను తప్పుగా అర్థం చేసుకుని ఆ వ్యాఖ్యలు చేశాను. జీవితమంతా యుద్ధ భూమిలో గడిపిన వాడికి యుద్ధం ముగియడమనేది గొప్ప విషయం. రెండు వైపులా ఇకపై ప్రాణాలు కోల్పోవడం ఉండదని సంతోషపడ్డాను. తమిళుల అందరిలోనూ ఆత్మవిశ్వాసాన్ని నింపేందుకే నా కథను వెండితెరపై చెప్పాలనుకున్నాను’’ అని మురళీధరన్ లేఖలో పేర్కొన్నారు.


కాగా ‘800’ విషయంలో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్న విజయ్ సేతుపతికి సీనియర్ నటి రాధిక మద్దతుగా నిలిచారు. సినిమాను సినిమాలాగానే చూడాలంటూ వరుస ట్వీట్లు చేశారామె. ‘‘మురళీధరన్ బయోపిక్‌లో నటించొద్దని విజయ్ సేతుపతికి చెబుతున్నారు. వీళ్లకి ఇంకేం పని లేదా? తమిళ రాజకీయాలతో సంబంధం కలిగిన వ్యక్తికి చెందిన సన్‌రైజర్స్ టీమ్‌కు మురళీధరన్ బౌలింగ్ కోచ్‌గా ఎందుకు ఉన్నాడు? విజయ్ సేతుపతి ఒక నటుడు. అతడిని వివాదాల్లోకి లాగకండి.

సన్‌రైజర్స్, సన్ నెట్‌వర్క్ యాజమాన్యాలకు రాజకీయాలతో సంబంధం ఉన్నప్పటికీ వారు దశాబ్దాలుగా రాజకీయాలను, క్రీడలను, ఎంటర్‌టైన్మెంట్‌ను విడివిడిగానే చూస్తున్నారు. మన సినీ పరిశ్రమ మాత్రం సినిమాలను, రాజకీయాలను ఎందుకు వేరుగా చూడడం లేదు. నా ఈ స్పందనలో ఎలాంటి వివాదమూ లేదు. సినిమా ఇండస్ట్రీకి, దానితో సంబంధం ఉన్న నటులకు మద్దతుగా నిలిచేందుకే ఆ ట్వీట్ చేశాను. తటస్థంగా, నిబద్ధతో వ్యవహరిస్తున్నందుకే సన్‌రైజర్స్‌ను ఉదాహరణగా తీసుకున్నాను’’ అంటూ రాధిక తన ట్వీట్లలో పేర్కొన్నారు.