Kapil Dev suffers heart attack : వెటరన్ ప్లేయర్ కపిల్ దేవ్‌కు గుండెపోటు

  • Published By: vamsi ,Published On : October 23, 2020 / 03:11 PM IST
Kapil Dev suffers heart attack : వెటరన్ ప్లేయర్ కపిల్ దేవ్‌కు గుండెపోటు

Kapil Dev suffers heart attack: లెజెండరీ భారత క్రికెటర్ కపిల్ దేవ్ గుండెపోటుకు గురయ్యారు. భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌, దిగ్గజ ఆటగాడు అయిన కపిల్‌దేవ్‌కు గుండెపోటు రావడంతో ఆయనను కుటుంబ సభ్యులు హుటాహుటిన ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి వైద్యం చేయిస్తున్నారు. అతని ఆరోగ్య పరిస్థితిపై వైద్యుల నుంచి ప్రకటన రావల్సి ఉంది. కపిల్ గురించి ఈ వార్త వచ్చిన వెంటనే, సోషల్ మీడియాలో ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు అభిమానులు. తన కెప్టెన్సీలో భారతదేశానికి తొలి వన్డే ప్రపంచ కప్ కపిల్ దేవ్ అందించారు.



కపిల్ దేవ్ పూర్తి పేరు కపిల్ దేవ్ రాంలాల్ నిఖంజ్. 1959, జనవరి 6న ఛండీగఢ్‌లో జన్మించారు. కపిల్ దేవ్ భారత క్రికెట్ జట్టుకు ఎనలేని సేవలందించి దేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యున్నత ఆల్‌రౌండర్‌లలో ఒకడిగా పేరు తెచ్చుకున్నారు. 2002లో Wisdom పత్రిక చేత 20 వ శతాబ్దపు మేటి భారతీయ క్రికెటర్‌గా గుర్తింపు పొందాడు. కపిల్ దేవ్ సారథ్యం వహించిన ఏకైక ప్రపంచకప్ (1983) లో భారత్‌ను విశ్వవిజేతగా నిలబెట్టారు కపిల్ దేవ్. అంతర్జాతీయ క్రికెట్ నుంచి నిష్క్రమించే నాటికి అత్యధిక టెస్ట్ వికెట్లు సాధించిన బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. 1999 అక్టోబర్ నుంచి 2000 ఆగస్ట్ వరకు 10నెలల పాటు భారత జట్టుకు కోచ్‌గా కూడా కపిల్ వ్యవహరించాడు.



కుడిచేతి పేస్ బౌలర్ అయిన కపిల్ దేవ్ తన క్రీడాజీవితంలో అత్యధిక భాగం భారత జట్టు ప్రధాన బౌలర్‌గా రాణించాడు. 1980లలో ఇన్‌స్వింగ్ యార్కర్ బౌలింగ్ వేసి బ్యాట్స్‌మెన్‌లను హడలెత్తించాడు. బ్యాట్స్‌మెన్‌గా కూడా పలు పర్యాయాలు జట్టుకు విజయాలు అందించాడు. జట్టు ఆపత్కాల దశలో ఉండగా.. బ్యాటింగ్‌లో విరుచుకుపడి ప్రత్యర్థులకు చమటలు పట్టించాడు. దీనికి ముఖ్య ఉదాహరణ 1983 ప్రపంచ కప్ పోటీలలో జింబాబ్వేపై జరిగిన వన్డే పోటీ. దేశవాళి పోటీలలో హర్యానా క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన కపిల్‌కు ముద్దుపేరు హర్యానా హరికేన్.



1959, జనవరి 6 న జన్మించిన కపిల్ దేవ్ తల్లిదండ్రులు రాంలాల్ నిఖంజ్, రాజ్ కుమారీలు. వారి స్వస్థలం ప్రస్తుత పాకిస్తాన్‌లోని రావల్పిండి సమీపంలోని ఒక గ్రామం. దేశ విభజన సమయంలో భారత్‌కు తరలివచ్చి చండీగర్‌లో స్థిరపడ్డారు. తండ్రి రాంలాల్ భవనాల, కలప వ్యాపారంలో ప్రసిద్ధులు.