ఆన్‌లైన్ లోన్ యాప్‌లతో జాగ్రత్త.. ఇన్‌స్టంట్ లోన్లపై ఆశపడొద్దు.. ఆ తర్వాత మీ ఇష్టం.. ఆలోచించుకోండి..

  • Published By: sreehari ,Published On : December 12, 2020 / 04:43 PM IST
ఆన్‌లైన్ లోన్ యాప్‌లతో జాగ్రత్త.. ఇన్‌స్టంట్ లోన్లపై ఆశపడొద్దు.. ఆ తర్వాత మీ ఇష్టం.. ఆలోచించుకోండి..

Beware of Loans from app-based lenders : అందరికి డబ్బులు అవసరమే.. అలా అనీ.. అప్పుగా డబ్బులు వస్తున్నాయి కదా? అని తీసేసుకుంటే అంతే మరి.. అప్పుల ఊభిలో చిక్కుకుంటారు జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు ఆర్థిక నిపుణులు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో రుణం కోసం ప్రయత్నించేవారు ఎక్కువే.. లాక్ డౌన్ కారణంగా చాలామంది తమ ఉపాధి కోల్పోయారు.

అప్పటినుంచి ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నవారంతా రుణం కోసం బ్యాంకుల గుమ్మం తొక్కుతున్నారు. అయినా బ్యాంకుల్లో కావాల్సినంత రుణం ఇచ్చే పరిస్థితి లేదు… ఒకవేళ ఇచ్చినా డాక్యుమెంట్లతో పాటు అన్ని సరిగా ఉంటేనే లోన్లు ఇస్తాయి. లేదంటే లేదు.. అందుకే ఎక్కడ తొందరగా రుణం దొరుకుతుందా అని ఎదురుచూస్తుంటారు.

ఇప్పుడు ఇదే పరిస్థితిని క్యాష్ చేసుకుంటున్నాయి చిన్నపాటి ఫైనాన్స్ సంస్థలు.. తమ ఆన్‌లైన్ యాప్‌ల ద్వారా ఇన్ స్టంట్ లోన్లతో గాలం విసురుతున్నాయి. లిమిటెడ్ డాక్యుమెంటేషన్, క్షణాల్లో బ్యాంకు అకౌంట్లోకి మనీ క్రెడిట్ చేయడం.. ఈజీగా లోన్ రావడంతో చాలామంది అవసరం ఉన్నా లేకపోయినా ఆన్ లైన్ లోన్ యాప్‌లపై ఆధారపడుతున్నారు. స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు.. గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్లి Instant Loan అని సెర్చ్ చేసేస్తున్నారు. దాదాపు 200 లోన్ యాప్స్ అందుబాటులో ఉన్నాయి. క్షణాల వ్యవధిలో మీ బ్యాంకు అకౌంట్లో మనీ క్రెడిట్ చేసేందుకు రెడీ అంటున్నాయి.

అందుకే ఈజీ లోన్ కోసం రుణదారులు ఎక్కువగా ఈ యాప్ లనే నమ్ముకుంటున్నారు. లోన్ తీసుకోవడం తప్పు కాదు.. అంతా సవ్యంగా జరిగితే ఓకే.. కానీ, తీసుకున్న రుణాన్ని చెల్లించలేకపోతేనే అసలు సమస్య.. ఎందుకంటే.. ఈ చిన్నపాటి ఫైనాన్స్ సంస్థలు ఈజీగా ఇన్ స్టంట్ లోన్లు ఇచ్చేది.. తక్కువ వడ్డీతో కాదు.. భారీ వడ్డీలు వసూలు చేస్తాయి.

గడువు తేదీలోగా చెల్లించకుంటే ఆపై భారీగా పెనాల్టీలు బనాయిస్తున్నాయి. ఇంకేముంది తీసుకున్న డబ్బు కంటే రెట్టింపు వడ్డీలు చెల్లించాల్సి వస్తుంది. అంతా చెల్లించలేక చేతులేత్తేవారు ఎంతోమంది.. రుణం చెల్లించలేకపోతే రుణదారులను ముక్కుపిండి మరి వసూలు చేస్తాయి.

అప్పు ఇచ్చే యాప్‌లతో జర భద్రం : 
మరో సమస్య ఏంటంటే.. అప్పు తిరిగి చెల్లించని రుణదారుల కాంటాక్టులను ట్యాపింగ్ చేసి మరి ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. లోన్ యాప్ ఫోన్లో ఇన్ స్టాల్ చేసేటప్పుడే కాంటాక్ట్ యాక్సస్ చేసేందుకు అనుమతి కోరుతుంది. అలా రుణదారుల కాంటాక్టులను సేకరించి అప్పు చెల్లించేదాకా వదిలిపెట్టవు. మిగతా బ్యాంకుల్లో మాదిరిగా ఈ లోన్ యాప్ ఫైనాన్స్ సంస్థలకు మారటోరియం సౌకర్యం లేదు. రుణదారులు కోరినా తిరస్కరిస్తున్నాయి. డబ్బులు చెల్లించకపోవడంతో వారిని వేధింపులకు గురిచేస్తున్నాయి.

ముంబైకి చెందిన ఓ వ్యాపారవేత్తకు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఆన్ లైన్ లెండింగ్ యాప్ నుంచి రుణాన్ని తీసుకున్నాడు. ఒక ఈఎంఐ మాత్రమే చెల్లించలేదు. తనలాంటి వాళ్లు ఎందరో ఇలా రుణం చెల్లించలేక ఇబ్బందులు పడ్డారు. చాలామందికి లెండింగ్ యాప్ సంస్థలు ఫేక్ ఎఫ్ఐఆర్, ఆర్బీఐ నుంచి వార్నింగ్ లెటర్లు, ట్రాన్స్ యూనియన్ సిబిల్ వంటివి పంపుతున్నాయి.

Loans from app-based lenders can hit you hard

రికవరీ ఏంజెట్లతో వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసి రుణదారులను వేధిస్తున్నాయి. మారటోరియం సౌకర్యాన్ని కల్పించాలని లెండర్లను కోరినప్పటికీ తిరస్కరిస్తున్నారు. పైగా వడ్డీ కట్టాల్సిందేనని తెగేసి చెప్పేస్తున్నాయి. క్రెడిట్ కార్డులపై లిమిట్ కంటే రుణాలపై చెల్లించే పెనాల్టీలే అధిక భారంగా మారినట్టు బాధితులు వాపోతున్నారు.

చాలావరకూ చిన్నపాటి రుణదారు యాప్ లకు ఎలాంటి వెబ్ సైట్ లేదు. తమ కంపెనీ గురించి ఎలా సమాచారం ఇవ్వడం లేదు. యాప్ స్టోర్ లో లెండింగ్ యాప్ మాత్రమే ఉన్నాయి. కనీసం మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్ ఉన్నా బాగుండేది.. అది కూడా ఉండదు. ఎవరికి చెప్పుకోవాలో తెలియక చాలామంది రుణదారులు సోషల్ మీడియా వేదికగా తమ గోడు వెల్లబోసుకుంటున్నారు.

ఇండియలో చాలా ఫైనాన్స్ సంస్థలు రెగ్యులేటరీ లూప్ హోల్ ను ఉల్లంఘిస్తాయి. అందులో ఎక్కువగా చైనీస్ ఫైనాన్స్ సంస్థలే ఎక్కువగా ఉన్నాయి. NBFCతో ఒప్పందం చేసుకున్నాయి. రుణాలు ఇవ్వాలంటే ఈ సంస్థలు తప్పనిసరిగా NBFC లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలి. ఈ NBFC ఆర్బీఐ నియంత్రణలో ఉంటుంది.

ఆర్బీఐ డేటా ప్రకారం.. ఫిబ్రవరి 29, 2020 నాటికి 10వేల వరకు NBFC లైసెన్స్ లు ఉన్నాయి. వారిలో 803 మాత్రమే 100 కోట్ల విలువ కలిగిన సంస్థలు ఉన్నాయి. 60 రోజుల కంటే తక్కువ కాల పరిమితి లోన్లు ఇచ్చే యాప్స్‌కు గూగుల్ ప్లే స్టోర్ అనుమతి ఇవ్వదు.

రుణదారుల ఆరోపణలపై లెండింగ్ యాప్స్ క్లారిటీ :
మరోవైపు తమ రికవరీ ఏజెంట్లపై వస్తున్న ఫిర్యాదులను లెండింగ్ యాప్ కంపెనీలు కొట్టిపారేస్తున్నాయి. తమ కంపెనీ రిప్యుటేషన్ దెబ్బతీస్తున్నారంటూ ఆరోపిస్తున్నాయి. అధిక వడ్డీ రేట్లపై కూడా కంపెనీలు క్లారిటీ ఇస్తున్నాయి. తమ కంపెనీల వడ్డీ రేట్ల విధానాలన్నీ బోర్డు డైరెక్టర్ల నిర్ణయించిన విధంగానే అమలు చేయడం జరుగుతోందని చెబుతున్నాయి. లోన్ అప్రూవల్ చేయడానికి ముందే వడ్డీలు, పెనాల్టీలకు సంబంధించి స్పష్టంగా అందరి కస్టమర్లకు తెలియజేస్తామని అంటున్నాయి.

రుణాలు తీసుకునేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటారో అలాగే తిరిగి చెల్లించే విషయంలోనూ అలానే ఉంటే ఎలాంటి పెనాల్టీలు చెల్లంచాల్సిన అవరం లేదని సూచిస్తున్నాయి. మారటోరియం విషయంలోనూ రుణదారుల ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా ఆఫర్ చేయడం జరగుతుందని చెబుతున్నాయి. ఎవరో ఒక ఇద్దరు రికవరీ ఏజెంట్లు ఇలా రుణదారుల పట్ల దురుసుగా ప్రవర్తించారని, తమ దృష్టికి రాగానే వారిని తొలగించినట్టు ఫైనాన్షియల్ అధికారి ఒకరు వెల్లడించారు.

రుణానికి ముందు చెక్ చేసుకోండి :
ఆలస్యమైన బ్యాంకుల నుంచే రుణం పొందడం మంచిది. డాక్యుమెంట్లతో కొంతసమయం పట్టొచ్చు. అదే లోన్ యాప్ లతో ఆ సమస్య ఉండొదు. వాటికి ఒకే ఆప్షన్.. ఇన్ స్టంట్ లోన్ తీసుకోవచ్చు. రుణం తీసుకునే ముందు యాప్ సంస్థ గురించి చెక్ చేయండి.. వాటి NBFC పార్టనర్ ఎవరో తెలుసుకోండి.. వడ్డీ రేట్లు, పెనాల్టీలు ఎలా ఉంటాయి. సకాలంలో చెల్లించకపోతే ఎలాంటి చర్యలు తీసుకుంటాయి వివరాలన్నీ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది.

మీ మొబైల్ నుంచి లెండింగ్ యాప్ కు ఒకసారి యాక్సస్ ఇచ్చాక మీ వ్యక్తిగత డేటా వారి చేతుల్లోకి వెళ్లిపోయినట్టే.. అక్రమంగా మీ వ్యక్తిగత డేటాను యాక్సస్ చేసుకునే అవకాశం లేకపోలేదు. తొందరగా లోన్ వస్తుందని ఈ యాప్ ల జోలికి వెళ్లొద్దు. తీసుకున్న రుణం చెల్లించకపోతే మానసిక ఒత్తిడికి గురికావాల్సి వస్తుంది. అందుకే అవసరమైతేనే అప్పు తీసుకోవడం ఉత్తమం..