వ్యాక్సిన్ టూరిజం ప్యాకేజీ : డబ్బుంటే.. కరోనా టీకా ఎక్కడైనా వేయించుకోవచ్చు!

  • Published By: sreehari ,Published On : November 24, 2020 / 08:49 PM IST
వ్యాక్సిన్ టూరిజం ప్యాకేజీ : డబ్బుంటే.. కరోనా టీకా ఎక్కడైనా వేయించుకోవచ్చు!

Gem Tours & Travel covid vaccine tourism package: ప్రపంచమంతా కరోనా వ్యాక్సిన్ కోసం ఆశగా ఎదురుచూస్తోంది. కరోనా వ్యాక్సిన్ అందుబాుటలోకి వస్తే చాలు.. ఎంత ఖర్చు అయినా పెట్టి వ్యాక్సిన్ వేయించు కునేందుకు ఆరాటపడతారనడంలో సందేహం అక్కర్లేదు. అదే.. డబ్బునోళ్లు అయితే వ్యాక్సిన్ కోసం లక్షలు ఖర్చు చేయడానికి కూడా వెనకాడరు.



భారతదేశంలో ఇప్పట్లో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేలా లేదు. అమెరికాలో కరోనా వ్యాక్సిన్ అధికారికంగా విక్రయించనున్నారు. ఫైజర్ వ్యాక్సిన్ డిసెంబర్ 11 నుంచి వ్యాక్సినేషన్ విక్రయించబోతోంది. అమెరికా వెళ్లి కరోనా వ్యాక్సిన్ షాట్ కావాలంటే ఎవరైనా వెళ్లి వేయించుకోవచ్చు. హాలీడేస్ ట్రిప్ కోసం ఎవరైనా అమెరికా వెళ్తే.. పనిలో పనిగా కరోనా వ్యాక్సిన్ కూడా వేయించుకుని రావొచ్చు.

అమెరికాలో వ్యాక్సిన్ కోసం వెళ్లాలనుకునే వారికి ముంబై ఆధారిత జెమ్ టూర్స్ అండ్ ట్రావెల్ కరోనా వైరస్ వ్యాక్సిన్ టూరిజం ప్యాకేజీని ఆఫర్ చేస్తోంది. ప్రత్యేకించి బాగా డబ్బు ఉన్నోళ్ల కోసమే (హై నెట్ వర్త్ క్లయింట్స్ -HNI) ఈ వ్యాక్సిన్ టూరిజం ఆఫర్ తీసుకొచ్చింది.



అమెరికాలో వ్యాక్సిన్ కోసం వెళ్లే కొంతమంది VVIP క్లయింట్లను ఎంపిక చేస్తోంది. అలాగే ప్యాకేజీ వివరాలను వాట్సాప్ మెసేజ్‌ల ‌ద్వారా తెలియజేస్తోంది. ముంబై టూ న్యూయార్క్, న్యూయార్క్ నుంచి ముంబై ఎయిర్ ఫేర్ ధర రూ.1 లక్ష 74వేల 999 వరకు ప్యాకేజీతో ఆఫర్ చేస్తోంది. ఈ ప్యాకేజీ కింద వ్యాక్సిన్ షాట్‌తో కలిపి మూడు రాత్రులు మొత్తం నాలుగు రోజులు స్టే చేయొచ్చు.

ఎవరు ముందుగా వస్తారో వారికే అవకాశం.. ఈ ప్యాకేజీలను బుకింగ్ చేసుకోవచ్చు. ఎలాంటి అడ్వాన్స్ పేమెంట్లు లేదా డిపాజిట్లు ఉండవు. వ్యాక్సిన్ టూరిజం ప్యాకేజీని బుకింగ్ చేసుకోవాలంటే మీ పేరు, ఈమెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్, వయస్సు, ఫిజికల్ కాంప్లికేషన్స్, ఒక పాస్ పోర్టు కాపీలతో నమోదు చేసుకోవచ్చు.



అయితే వాట్సాప్‌లో వైరల్ అవుతున్న నెంబర్‌పై ముంబై ట్రావెల్ కంపెనీ స్పందించడం లేదు. ఎక్కువ సంఖ్యలో కాల్స్ చేస్తుండటంతో స్పందించలేకపోతున్నామని కంపెనీ తెలిపింది.

ముంబైకి చెందిన టూర్ ఆపరేటర్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ Jyotin Doshi 1983లో Gem Tours & Travel కంపెనీని స్థాపించారు. ఢిల్లీ, గుజరాత్, చెన్నై, పూణె, బెంగళూరు నగరాల్లో టూర్ ఆపరేటర్ సర్వీసులు నడుపుతోంది. ఆరు ఖండాల్లో మొత్తం 45 దేశాల్లో విమాన సర్వీసులు నడుపుతోంది.



ఫార్మా దిగ్గజం ఫైజర్ ఇంక్, జర్మనీ పార్టనర్ బయోంటెక్ ఎస్ఈ కరోనా వ్యాక్సిన్.. 95శాతం ప్రభావంతంగా వైరస్ ను అడ్డుకోగలదని ట్రయల్స్ ఫలితాల్లో వెల్లడైంది.

వ్యాక్సిన్ వేయించుకున్నవారిలో ఎలాంటి దుష్ర్పభావాలు లేవని, సురక్షితమేనని కంపెనీ వెల్లడించింది. ఇప్పటికే ఫైజర్ వ్యాక్సిన్ ఆమోదం కోసం అమెరికా హెల్త్ రెగ్యులేటరీకి దరఖాస్తు చేసింది.