చంద్రునిపై నీరు ఉందిక్కడేనంట.. తేల్చేసిన నాసా సైంటిస్టులు!

  • Published By: sreehari ,Published On : October 27, 2020 / 10:25 PM IST
చంద్రునిపై నీరు ఉందిక్కడేనంట.. తేల్చేసిన నాసా సైంటిస్టులు!

చంద్రుడిపై నీటి లభ్యతకు సంబంధించి కొందరు వ్యక్తం చేస్తున్న అనుమానాలను నాసా శాస్త్రవేత్తలు నివృత్తి చేశారు. కచ్చితంగా నీటి అణువులున్నాయని తేల్చారు.

కాకపోతే అవి దేనికది విడివిడిగా విస్తరించి ఉన్నాయంటున్నారు. అవన్నీ కలిస్తే నీరు ద్రవరూపంలోకి మారుతుందని అంటున్నారు.



చంద్రుడిపై ఉన్న నీటి అణువులు ఒకదానితో ఒకటి కలిస్తే.. నీరు ద్రవ రూపంలోకి లేదా మంచుగా మారుతుందని నాసా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇదే సమయంలో చంద్రుడిపై నీటి లభ్యతకు సంబంధించి మరో అధ్యయనం కూడా విడుదల అయ్యింది.

నేచర్ ఆస్ట్రానమీ అనే జర్నల్‌లో దీన్ని ప్రచురించారు. అది పూర్తిగా చంద్రుడిపై ఉన్న కాంతి ఛాయా ప్రాంతాలపై జరిగిన అధ్యయనం.

ఆ ప్రాంతాల్లో శాశ్వతంగా సూర్య కాంతి ప్రసరించదు. ఎప్పటికీ అవి చీకటిలోనే ఉంటాయి. అక్కడ ఉష్ణోగ్రతలు కూడా చాలా తక్కువగా ఉంటాయి.

చంద్రుడిపై ఉన్న కాంతి ఛాయా ప్రాంతాల్లో ఉష్ణోగ్రత మైనస్ 163 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది.

దానివల్ల ఆ ప్రాంతాల్లో గడ్డకట్టి ఉన్న నీరు వందల కోట్ల సంవత్సరాల వరకు భద్రంగా నిల్వ ఉంటుందని ఈ కొత్త అధ్యయనం చెబుతోంది.

కొత్త అధ్యయనంతో చంద్రుడిపై నీరుందన్న నాసా పరిశోధనలకు మరింత బలం చేకూరింది . దీనిపై మరికొన్ని అధయ్యనాలు కూడా జరిగాయి.

లూనార్ రికన్నజాన్స్‌ ఆర్బిటర్ స్పేస్ క్రాఫ్ట్ డేటా ఆధారంగా ఈ అధ్యయనాలు జరిగాయి . యూనివర్సిటీ అఫ్ కొలొరాడొ శాస్త్రవేత్తలు ఈ పరిశోధనలు నిర్వహించారు.



వీరి అధ్యయనం ప్రకారం చంద్రుడి ఉపరితలంపై చిన్న చిన్న నాణేల సైజులో నీడలు కనిపిస్తున్నాయి. చంద్రుడి ధ్రువ ప్రాంతాల్లోనే ఇవి కనిపిస్తున్నాయి.

చంద్రుడిపై ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేని కొత్త ప్రాంతాల్లో అపారమైన నీటి నిల్వలు ఉన్నాయని కొలరాడో అధ్యయనం చెబుతోంది. అంటే… చంద్రుడి ధ్రువ ప్రాంతాల్లోనే నీరు అధికంగా నిక్షిప్తమై ఉంది. ఇక దాన్ని వెలికి తీసి విశ్లేషించాల్సి ఉందని కొలరాడో యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు .



ముందుముందు నాసా శాస్త్రవేత్తలు మరిన్ని ప్రయోగాలపై దృష్టి పెట్టనున్నారు. చంద్రుడిపైకి వ్యోమగాములను మరోసారి పంపించాలని నిర్ణయించారు. చంద్రుడి ధ్రువ ప్రాంతాల్లోనే కాదు, ఇతర ప్రాంతాల్లో కూడా నీటి లభ్యత ఉందని నాసా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఇక్కడే శాస్త్రవేత్తలను కొన్ని ప్రశ్నలు వేధిస్తున్నాయి. అసలు చంద్రుడిపై నీరు ఎలా పుట్టింది? దానికి ఆధారం ఏమిటి? ముందు ఈ ప్రశ్నలకు జవాబులు వెదకాల్సి ఉందని చెబుతున్నారు.

ఇప్పుడు దీనిపైనే దృష్టి పెట్టినట్లు నాసా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చంద్రుడిపై నీరు ఎలా పుట్టింది అనే విషయంపైనే తాము అధ్యయనం చేస్తున్నామని నాసా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతానికి దీనిపై తమకు ఒక అవగాహన ఉందంటున్నారు.



తోక చుక్కలు, గ్రహ శకలాల ద్వారా చంద్రుడిపైకి నీరు చేరి ఉండవచ్చు. అంతేకాదు గ్రహాల మధ్య తిరిగే ధూళి కణాల వల్ల కూడా చంద్రుడిపైకి నీరు చేరి ఉండవచ్చు. సౌర మండలం లో వీచే గాలుల వల్ల కూడా కావచ్చు.

చంద్రుడిపై అగ్ని పర్వతాలు బద్దలైనప్పుడు కూడా నీరు పుట్టే అవకాశం ఉందని నాసా శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇక్కడే విచిత్రమైన ప్రశ్న మరొకటి పుట్టుకొస్తోంది.

భూమ్మీద ఉప్పు సముద్రాలూ, మంచి నీటి సరస్సులు, హిమనీ నదాలు ఉన్నాయి. ఇవే భూమ్మీద నీటికి ఆధారం అయ్యాయి. మరి భూమ్మీద నీరెలా పుట్టింది? ఇప్పటికీ ఇదొక మిస్టరీ. చంద్రుడిపై నీటికి ఆధారం దొరికితే భూమ్మీద నీటికి కూడా కారణం దొరుకుతుందని నాసా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.