భూమికి దగ్గరగా నియోవైస్ తోకచుక్క…మళ్లీ 6,800 సంవత్సరాల తర్వాత కనిపిస్తుంది

  • Published By: bheemraj ,Published On : July 17, 2020 / 08:39 PM IST
భూమికి దగ్గరగా నియోవైస్ తోకచుక్క…మళ్లీ 6,800 సంవత్సరాల తర్వాత కనిపిస్తుంది

ఆకాశంలో ఓ అద్భుతం ఆవిష్కృతం కానుంది. సూర్యుడు అస్తమించే సమయంలో ఆకాశంలో ఒక భారీ తోక చుక్క కనువిందు చేయనుంది. దీనిపేరు నియోవైస్ అని నాసా వెల్లడించింది. ఇది కొన్ని నిమిషాలపాటు ఆకాశంలో కనిపిస్తుందని నాసాకు చెందిన ఖగోళ శాస్త్రవేత్తలు చెప్పారు. ఈ తోక చుక్క పేరు నియోవైస్ గా నాసా నామకరణం చేసింది.

ఈ తోక చుక్కను మామూలుగానే ఎలాంటి కళ్ల జోడు లేకుండా చూడొచ్చని నాసా స్పష్టం చేసింది. ఇప్పటినుంచి మూడు వారాలపాటు ఈ తోక చుక్క కనువిందు చేయనుందని నాసా వెల్లడించింది. సూర్యుడు అస్తమించాక అరగంటపాటు ఈ తోకచుక్క వాయివ్య దిశలో ఉన్న ప్రాంతాల నుంచి కనిపిస్తుందని శాస్త్రవేత్తలు చెప్పారు. ప్రస్తుతం ఈ తోక చుక్క భూమికి దగ్గర పయనిస్తుందని చెప్పిన శాస్త్రవేత్తలు రోజులు గడిచే కొద్ది ఇది చాలా స్పష్టంగా కనిపిస్తోందన్నారు.

జులై 23 నాటికల్ల ఈ తోక చుక్క భూమికి 103.6 మిలియన్ కిలో మీటర్ల దూరంలో ఉంటుందని చెప్పారు. ఆ రోజు 35 డిగ్రీల ఎలివేషన్ తో కనిపిస్తుందన్నారు. ఈ తోకచుక్కను స్పష్టంగా చూడాలంటే కాలుష్యం లేని ప్రాంతాల్లో ఉండాలని వెల్లడించారు. బైనాక్యులర్ ఉంటే మరింత స్పష్టంగా, దగ్గరగా కనిపిస్తుందని చెప్పారు.

సూర్యస్తమయం తర్వాత ఇది ఆకాశంలో పెద్ద ఎత్తులో కనిపిస్తుందని, ఆదివారం సూర్యస్తమయం సమయానికి ఇది 20 డిగ్రీల యాంగిల్ లో దర్శనం ఇస్తుందని తెలిపారు. ఈ తోకచుక్క ఐదు కిలో మీటర్ల పొడవు ఉంటుందని నాసా శాస్త్రవేత్తలు చెప్పారు. చాలా వరకు తోకచుక్కలు సగం దుమ్ముతో మరో సగం నిండి ఉంటే మరో సగం నీటితో నిండి ఉంటాయి.

నియోవైస్ తోకచుక్క గంటకు 40 వేల మైళ్ల వేగంతో పయనిస్తోంది. ఈ తోకచుక్క వల్ల భూమికి ఎలాంటి హాని జరుగదని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. ఈ నియోవైస్ తోకచుక్క మళ్లీ 6,800 సంవత్సరాల తర్వాత కనిపిస్తుందని చెప్పారు.