కరోనా సెకండ్‌ వేవ్‌: ఎదుర్కోడానికి సిద్ధమైన తెలంగాణ సర్కార్

  • Published By: vamsi ,Published On : November 24, 2020 / 08:00 AM IST
కరోనా సెకండ్‌ వేవ్‌: ఎదుర్కోడానికి సిద్ధమైన తెలంగాణ సర్కార్

ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా వైరస్‌.. ఏడాదిలో 13 లక్షలకు పైగా ప్రాణాలను బలి తీసుకున్న మహమ్మారి, మరోసారి ఉగ్రరూపం చూపేందుకు సిద్ధమైనట్లుగా నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం కూడా అలర్ట్ అయ్యింది. వైరస్‌ కారణంగా వచ్చే జబ్బుల ప్రభావంతో కరోనా తగ్గిన తర్వాత కూడా చనిపోతూ ఉన్నవారి సంఖ్య పెరిగిపోతుంది. సాధారణ శ్వాస సంబంధిత వైరస్‌లతో పోలిస్తే కరోనాలో తెలియని, కానరాని, బయటకు రాని, కనిపెట్టలేని మిస్టరీలు అనేకం.



ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా మరోసారి కరోనా వైరస్ సెకెండ్ వేవ్ విస్తరించే అవకాశం ఉన్న నేపధ్యంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ యంత్రాంగం సన్నాహాలు మొదలుపెట్టింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించిన అనంతరం అధికారులు ఆగమేఘాల మీద రంగంలోకి దిగారు. ఎంతటి విపత్కర పరిస్థితి తలెత్తినా ఎదుర్కొనేందుకు వీలుగా అందరూ సిద్ధంగా ఉండాలని కేసీఆర్ అధికారులకు సూచించారు. అందులో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లోని ప్రతీ బెడ్‌కు ఆక్సిజన్‌ సౌకర్యం అందుబాటులోకి తేవాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో 22 వేల పడకలు ఉండగా, వాటిల్లో 11వేల పడకలకు మాత్రమే ఆక్సిజన్‌ సౌకర్యం ఉంది. మిగిలిన 11 వేల పడకలకు కూడా ఆక్సిజన్‌ను అందుబాటులోకి తేవాలని కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం.



https://10tv.in/amit-shah-launches-covid-rt-pcr-test-at-rs-499-result-in-6-hours/
వంద పడకలకు పైగా ఉన్న ఆసుపత్రులకు లిక్విడ్‌ ఆక్సిజన్‌ను, అంతకంటే తక్కువున్న ఆసుపత్రులకు సాధారణ ఆక్సిజన్‌ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకుని రానున్నారు అధికారులు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మొదలు, గాంధీ ఆసుపత్రి వరకు మధ్య ఉన్న అన్నీ ఆసుపత్రుల్లోనూ మొదటి వేవ్‌లో కొన్ని దేశాలు తీవ్ర సంక్షోభం ఎదుర్కోగా.. ఆ అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఏర్పాట్లు చేపట్టింది ప్రభుత్వం.



ముఖ్యమంత్రి ఆదేశాలతో జిల్లాల వైద్యాధి కారులతో రాష్ట్ర అధికారులు వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహించారు. ఇప్పటికే జిల్లా, ఏరియా, సామాజిక ఆరోగ్య కేంద్రాలలో 8,874 పడకలు ఉండగా.. అందులో రెగ్యులర్‌ పడకలు 5,394, సింగిల్‌ లైన్‌ ఆక్సిజన్‌ పడకలు 2,810, వెంటిలేటర్‌ సౌకర్యం లేని మూడు లైన్ల ఆక్సిజన్‌ పడకలు 486, వెంటిలేటర్‌ సౌకర్యమున్న ఆక్సిజన్‌ పడకలు 184 ఉన్నాయి. వీటికి అదనంగా మరో 5 వేల పడకలను అందుబాటులోకి తీసుకుని వచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.