పబ్-జియో: ముఖేష్ అంబానీ చేతుల్లోకి PUB-G.. భారత్‌లో మళ్లీ వచ్చేస్తుందా?

  • Published By: vamsi ,Published On : September 21, 2020 / 11:10 AM IST
పబ్-జియో: ముఖేష్ అంబానీ చేతుల్లోకి PUB-G.. భారత్‌లో మళ్లీ వచ్చేస్తుందా?

PUBG Mobile: భారత ప్రభుత్వం దేశంలో ఇటీవల ఆన్‌లైన్ బ్యాటిల్ గేమ్ PUB-G ని నిషేధించింది. అప్పటి నుంచి పబ్-జీ ఆడుకునేవారికి కాస్త నిరాశ ఎదురైంది. ఇప్పుడు అటువంటివారికి శుభవార్త అందబోతుంది. PUB-G త్వరలో భారతదేశానికి మళ్లీ తిరిగి రాబోతుంది.

PUB-G ప్రాథమికంగా దక్షిణ కొరియా సంస్థ బ్లూ హోల్ స్టూడియోస్ గేమ్. భారత్‌లో నిషేధం నేపథ్యంలో బ్లూ హోల్ స్టూడియో చైనా కంపెనీ నుంచి పబ్-జీ మొబైల్ ఫ్రాంచైజీని ఉపసంహరించుకుంది. ఈ క్రమంలోనే భారత్‌లో పంపిణీపై రిలయన్స్ జియోతో చర్చలు జరుపుతోంది.



పాపులర్ మొబైల్ గేమ్ PUB-Gని భారతదేశంలో నిషేధించబడిన తరువాత, దక్షిణ కొరియాకు చెందిన PUBG గేమ్ ప్రధాన సంస్థ PUBG కార్పొరేషన్.. చైనా కంపెనీ టెన్సెంట్ గేమ్స్ నుంచి విడిపోతున్నట్లు ప్రకటించింది. దీంతో భారతదేశంలో PUBG మొబైల్ వెర్షన్‌కు సంబంధించిన అధికారాన్ని టెన్సెంట్‌ కంపెనీ కోల్పోయింది.

జియోతో ఒప్పందం:
ఈ క్రమంలోనే బ్లూ హోల్ స్టూడియోస్ నుంచి వచ్చిన బ్లాగ్‌లో.. భారతదేశంలో గేమ్ పంపిణీ కోసం రిలయన్స్ జియోతో కంపెనీ ఒప్పందం కుదుర్చుకున్నట్లు చెప్పింది. డీల్ ఇప్పుడే ప్రారంభం అయినట్లుగా తెలుస్తుంది. అయితే, దీని గురించి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.



నిషేధిత గేమ్‌గా మారిపోయిన PUB-G ఇప్పుడు రిలయన్స్ సంస్థతో చర్చలు జరుపుతోందన్నట్టుగా వార్తలు రావడంతో.. మళ్లీ భారత్‌లోకి అంబానీ చొరవతో PUB-G రీఎంట్రీ ఇస్తున్నట్లుగా తెలిసిపోతుంది. కేంద్రం నిషేధించిన వందకుపైగా యాప్‌లలో PUB-G ఒక్కటైతే.. టెక్నికల్ సెక్యురిటీ PUB-G నిషేధానికి ఓ ప్రధాన కారణం.



అయితే సామాజికంగా ఈ గేమ్‌కు బానిసలుగా మారిన ఎంతోమంది తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఈ క్రమంలో అంబానీ ఎంట్రీ ఇచ్చినంత మాత్రాన కేంద్రం PUB-Gని భారత్‌లోకి రీఎంట్రీ కానిస్తుందా? అనేది ఆసక్తికరమైన అంశమే. ఏదైతే ఏముంది పబ్-జీ, జియో రెండూ కలిసి పబ్-జియోగా వచ్చేస్తుందో? లేదో తెలియాలంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందే.