PV Sindhu Retirement: సోషల్ మీడియాలో పోస్ట్.. ట్విస్ట్ ఇదే!

  • Published By: vamsi ,Published On : November 2, 2020 / 03:24 PM IST
PV Sindhu Retirement: సోషల్ మీడియాలో పోస్ట్.. ట్విస్ట్ ఇదే!

ప్రముఖ బ్యాట్మింటన్ క్రీడాకారిణి, ఒలంపిక్స్ విజేత పి.వి. సింధు రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ మేరకు ఆమె ఇన్‌స్టాగ్రమ్ అకౌంట్ ద్వారా ఓ లేఖను విడుదల చేశారు. కరోనా వైరస్‌ కారణంగా తాను ఈ నిర్ణయాన్ని తీసుకుంటున్నట్లుగా ఆమె వెల్లడించారు. ‘నేను రిటైర్‌ అయ్యాను. డెన్మార్క్‌ ఓపెన్‌ నా చివరి ఆట’ అని పీవీ సింధు ఈ సంధర్భంగా తెలిపారు. అయితే ఆమె ప్రకటన భావోద్వేగ పూరితంగా ఉంది. ఆ ప్రకటనలో ‘కరోనా మహమ్మారి నాకు కనువిప్పుగా మారింది. నా ప్రత్యర్థితో పోరాడటానికి కఠోరమైన శిక్షణ తీసుకునేదాన్ని. చివరి వరకు పోరాడేదాన్ని. ఇంతకు ముందు చేశాను, ఇకపై కూడా చేయగలను.

కానీ, కంటికి కనిపించని వైరస్‌ను ఎలా ఓడించగలను. నెలలు గడుస్తున్నాయి. బయటకు వెళ్లాలనుకునే ప్రతీసారి ఆలోచిస్తున్నాం. విశ్రాంతి లేని ఆటకు స్వప్తి పలకాలని నిర్ణయించుకున్నా.. నెగిటివిటీ, భయం, అనిశ్చితి నుంచి రిటైర్‌ అవ్వబోతున్నా.. ప్రతీరోజు సోషల్‌ మీడియాలో చదువుతున్న కథనాలు నన్ను నేను ప్రశ్నించుకునేలా చేశాయి. మనం మరింత సంసిద్ధంగా ఉండాలి. కలిసికట్టుగా వైరస్‌ను ఓడించాలి. ఇప్పుడు మనం వేసే అడుగు, తీసుకునే నిర్ణయం మన, మన భావితరాల భవిష్యత్తును నిర్ణయిస్తుంది. వారిని ఓడిపోనివ్వకుండా చూడాలి’ అంటూ తన లేఖలో రాసుకొచ్చారు. అయితే రిటైర్మెంట్ అనగానే ప్రతి ఒక్కరు ఆమె ఇక పూర్తిగా ఆటకు దూరం అవుతున్నారని భావించారు అయితే లేఖలో ఆమె క్లారిటీ ఇచ్చారు.

25ఏళ్ల పూసర్ల వెంకట సింధు 2016 లో జరిగిన రియో ఒలంపిక్స్‌లో రజత పతకం సాధించి ఒలంపిక్ పోటీల్లో రజత పతకం సాధించిన తొలి మహిళగా రికార్డు సృష్టించింది.

సెప్టెంబరు 21, 2012 న అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సమాఖ్య ప్రకటించిన ర్యాంకింగ్స్ లో టాప్ 20 జాబితాలో చోటు దక్కించుకోవడం ద్వారా సింధుకు మొదటి సారిగా అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది. ఆగస్టు 10, 2013 న చైనాలో అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సమాఖ్య నిర్వహించిన ప్రపంచ చాంపియన్ షిప్‌లో పతకం సాధించి అలా గెలిచిన మొట్టమొదటి భారతీయురాలిగా రికార్డు సృష్టించింది.



మార్చి 30, 2015న సింధుకు భారత ప్రభుత్వం పద్మశ్రీని ప్రధానం చేసింది. ఆగస్టు 18, 2016 న రియో ఒలంపిక్స్‌లో జరిగిన సెమీఫైనల్లో జపాన్ కు చెందిన నోజోమీ ఒకుహరాను ఓడించడం ద్వారా ఒలంపిక్స్ లో బ్యాడ్మింటన్ విభాగంలో ఫైనల్ చేరిన తొలి భారతీయ మహిళగా నిలిచింది. తరువాత జరిగిన ఫైనల్లో రజత పతకం సాధించి ఒలంపిక్స్ లో రజతం సాధించిన మొట్టమొదటి భారతీయ క్రీడాకారిణిగా, అత్యంత పిన్న వయస్కురాలైన భారతీయురాలిగా నిలిచింది. సైనా నెహ్వాల్ 2012 ఒలంపిక్స్ లో కాంస్యపతకం సాధించిన తరువాత బ్యాడ్మింటన్ లో పతకం సాధించిన రెండో క్రీడాకారిణి సింధు.

సింధు. జూలై 5, 1995 న పి. వి. రమణ, పి. విజయ దంపతులకు హైదరాబాదులో జన్మించింది. ప్రస్తుతం ఆమె లండన్‌లో ఉండగా.. ఆమె సడెన్‌గా రిటైర్మెంట్ ప్రకటించడం ఆశ్చర్యకరం. సింధుకి కేంద్ర ప్రభుత్వం రాజీవ్ ఖేల్ రత్న అవార్డు, జాతీయ అత్యుత్తమ క్రీడా పురస్కారం 2016 ఇచ్చింది. అలాగే పద్మశ్రీ అవార్డు (2015),అర్జున అవార్డు (2014) ఆమె బ్యాట్మెంటన్‌లో రాణించినందుకు ఇచ్చారు.

 

View this post on Instagram

 

?

A post shared by sindhu pv (@pvsindhu1) on