ఇండియాలో కరోనా టీకా ఎలా వేస్తారంటే? ముందు SMS.. ఆ తర్వాత QR certificate

  • Published By: sreehari ,Published On : October 25, 2020 / 03:33 PM IST
ఇండియాలో కరోనా టీకా ఎలా వేస్తారంటే? ముందు SMS.. ఆ తర్వాత QR certificate

Covid-19 vaccine drive : భారతదేశంలో కరోనా వ్యాక్సిన్ కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, ఎన్నికల ప్రక్రియ మాదిరిగానే వ్యాక్సినేషన్ కూడా నిర్వహించాలని ప్రధాని నరేంద్ర మోడీ ఇదివరకే పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో కరోనా వ్యాక్సిన్ పూర్తిగా అందుబాటులోకి రాగానే.. దేశంలో వ్యాక్సినేషన్ తొలుత డిజిటల్ ఫీచర్ల ద్వారా అందించేందుకు నిపుణుల బృందం ప్లాన్ చేస్తోంది. వ్యాక్సినేషన్‌ డెలివరీ ప్రక్రియలో భాగంగా డిజిటల్ డ్రైవ్ ఫీచర్లలో SMS, డిజిటల్ సర్టిఫికేట్ అందించనున్నట్టు నివేదిక వెల్లడించింది.



డిజిటల్ వ్యాక్సినేషన్ కోసం ప్రత్యేకించి నీతి అయోగ్ మెంబర్ అయిన వీకే పాల్ నేతృత్వంలోని వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్‌పై జాతీయ నిపుణుల కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది. ఈ కమిటీ టీకా స్టోరేజీకి సంబంధించి వివరణాత్మక ప్రణాళికను సిద్ధం చేయనుంది.

2021 ప్రారంభం నుంచి తొలి వ్యాక్సిన్ కోసం వేచిచూసే భారతీయ ప్రజలకు టీకాను విడతల వారీగా అందించనుంది. జాతీయ ఆరోగ్య మిషన్ కింద డిజిటల్ ప్లాట్ ఫాం అయిన Electronic Vaccine Intelligence Network (eVIN) టీకా పొందినవారి వివరాలను సేకరించనుంది.



ఇప్పటికే వేర్వేరు రోగనిరోధక కార్యక్రమాలను 32 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో వినియోగంలో ఉన్నాయి. ఈ eVIN ప్రొగ్రామ్ ద్వారా టీకా రియల్ టైం సమాచారంతో పాటు వ్యాక్సిన్ ఎంత స్టాక్ ఉంది.. ఎలా సాగుతుంది.. వ్యాక్సిన్ కోల్డ్ స్టోరీజీలకు సంబంధించి సమాచారాన్ని అందిస్తుంది.



ఎన్నికల పోలింగ్ మాదిరిగానే వ్యాక్సినేషన్ ప్రక్రియను కూడా అనేక దశల్లో నిర్వహించనున్నారు. స్కూళ్లలో పోలింగ్ బూత్ లో ఓటు వేసినట్టుగా టీకా అందించే అవకాశం ఉందని నివేదిక వెల్లడించింది. తొలి దశలో భాగంగా భారతదేశంలో వ్యాక్సినేషన్ ముందుగా 30 మిలియన్ల మందికి అందించనున్నారు.



అందులో హెల్త్ కేర్ స్పెషలిస్టులకు టీకా ఇవ్వనున్నారు. వీరిలో 7 మిలియన్ల మంది డాక్టర్లు, పారామిడిక్స్ ఉంటారు. మరో 20 మిలియన్ల మందిలో ఇతర ఆరోగ్య కార్యకర్తలు ఉంటారు. వ్యాక్సినేషన్ అందించడానికి ముందుగా SMS ద్వారా సమాచారం అందుతుంది.



సమయం, తేదీ, వేదికతో పాటు వ్యాక్సిన్ మోతాదు ఎంతో కూడా సమాచారం ఇస్తారు. వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత QR ఆధారిత కోడ్ డిజిటల్ సర్టిఫికేట్ ఇస్తారు. ఇది Digilockerలో భద్రపరుస్తారు.