అన్‌లాక్‌ 3.0 మార్గదర్శకాలు విడుదల.. నైట్ కర్ఫ్యూ ఎత్తివేత, జిమ్ లకు అనుమతి

  • Published By: venkaiahnaidu ,Published On : July 29, 2020 / 07:46 PM IST
అన్‌లాక్‌ 3.0 మార్గదర్శకాలు విడుదల.. నైట్ కర్ఫ్యూ ఎత్తివేత, జిమ్ లకు అనుమతి

కరోనా లాక్‌డౌన్‌ను అన్‌లాక్‌తో కేంద్రం సడలిస్తోంది. ఈ నెల 31వ తేదీతో ప్రస్తుత అన్‌లాక్ 2.0 ముగిసిపోనుంది. ఈ నేపథ్యంలో ఇవాళ(జులై-29,2020) కేంద్ర హోం శాఖ అన్ లాక్ 3.0 మార్గదర్శకాలను విడుదల చేసింది.



కేంద్రం జారీ చేసిన గైడ్ లైన్స్ ప్రకారం… అన్‌లాక్‌ 3.0 లో భాగంగా అగస్ట్-1 నుంచి రాత్రి పూట కర్ఫ్యూను ఎత్తివేసింది. ప్రజలు రాత్రి పూట బయట తిరగవచ్చు. అయితే, కరోనా నిబంధనలు పాటించాలి.

ఆగస్టు 5 నుంచి నాన్ కంటైన్మెంట్ జోన్లలో జిమ్స్‌, యోగా సెంటర్లు తిరిగి తెరుచుకునేందుకు అనుమతి ఇచ్చింది. విద్యా సంస్థలు, కోచింగ్ సెంటర్లు ఆగస్టు 31 వరకు మూసివేసి ఉంచాలని స్పష్టం చేసింది.


మెట్రో సర్వీసులు, స్కూళ్లు, కాలేజీలు, కోచింగ్ సెంటర్లపై నిషేధం కొనసాగుతుందని వెల్లడించింది. సినిమా హాళ్లు, స్విమ్మింగ్ పూల్స్, బార్లు సహా ప్రజలు గుమిగూడే ఆస్కారం ఉన్న ఇతర అన్ని కార్యకలాపాలపై నిషేధం కొనసాగుతుందని కేంద్రం స్పష్టం చేసింది(అయితే పరిస్థితులను అంచనా వేసి వీటి అనుమతులపై నిర్ణయం తీసుకోనున్నట్టు కేంద్రం తెలిపింది). కంటెయిన్‌మెంట్ జోన్లలో ఆగస్టు 31 వరకు లాక్‌డౌన్ కొనసాగుతుందని తెలిపింది.



కేంద్రం జారీ చేసిన నిబంధనలకు అనుగుణంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకోవచ్చు. వందే భారత్ మిషన్ కింద మాత్రమే అంతర్జాతీయ ప్రయాణాలు ఉంటాయి.

భారతదేశంలో 15 లక్షలకు పైగా కరోనావైరస్ కేసులను నమోదు, మరియు రోజువారీ కేసుల సంఖ్య 50,000 కి దగ్గరగా పెరిగిన నేపథ్యంలో కేంద్రం ఈ గైడ్ లైన్స్ విడుదల చేసింది.