ఇన్‌స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తూనే టీవీ చూస్తున్నారా? మల్టీ టాస్కింగ్‌తో మతిమరుపు రావొచ్చు!

  • Published By: sreehari ,Published On : November 1, 2020 / 09:58 PM IST
ఇన్‌స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తూనే టీవీ చూస్తున్నారా? మల్టీ టాస్కింగ్‌తో మతిమరుపు రావొచ్చు!

ఒకే పని చేసేటప్పుడు ఏకాగ్రత పెట్టొచ్చు.. కానీ, ఆ పనితో పాటు మరో పని కూడా చేసేస్తుంటారు. అదే అన్ని పనులు ఒకే సమయంలో చేస్తే మాత్రం ఏకాగ్రత సరిగా ఉండదు.. ఇలా పదేపదే చేస్తూ పోతే.. మతిమరుపుకు దారితీయొచ్చునని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.



కార్టిసాల్ అనే ఒత్తిడి హార్మోన్‌లో వచ్చే మార్పుల కారణంగా ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని చెబుతున్నారు. ఇన్‌స్టాగ్రామ్ స్క్రోలింగ్ చేస్తున్న సమయంలో కొందరు టీవీ చూడటం చేస్తుంటారు. ఒకవైపు ట్యాబ్ లేదా ఫోన్‌లో రీల్స్‌తో పాటు టీవీలో నెట్ ఫ్లిక్స్ చూసే వారిలో మెమెరీ పరంగా అనేక సమస్యలు తలెత్తుతాయని అంటున్నారు. ఒకే సమయంలో బ్రౌజర్‌లో ఓపెన్ చేసినా 25 లేదా అంతకంటే ఎక్కువ ట్యాబ్‌లను చూడటం కూడా అనేక సమస్యలకు దారితీస్తుందని అంటున్నారు.

ఒక కొత్త అధ్యయనం ప్రకారం.. మీడియా మల్టీ టాస్కింగ్.. మల్టీ డివైజ్‌లు లేదా ఒక యాప్ చూస్తూనే మరో యాప్ ఓపెన్ చేయడం వంటి పలు రకాల డిజిటల్ మాధ్యమాలను కలిపి ఒకేసారి ఉపయోగించడం మెమరీ వైఫల్యానికి దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు.



ఈ అధ్యయనాన్ని Stanford Memory Lab కెవిన్ మడోర్ నిర్వహించారు. మల్టీ డిజిటల్ మీడియా వినియోగించే వ్యక్తులు ఏకాగ్రత కోల్పోతున్నారని గుర్తించామన్నారు. కొన్ని సంఘటనలను గుర్తుకు తెచ్చుకోలేకపోవడానికి కారణం ఇదేనని తేల్చేశారు.

ఈ పరిశోధక బృందం 18ఏళ్ల నుంచి 26 ఏళ్ల మధ్య వయస్సు గల 80 మంది వ్యక్తులపై అధ్యయనం నిర్వహించింది. electroencephalography (ECG) pupillometry వంటి పద్ధతులతో వరుసగా మెదడు కార్యకలాపాలను జ్ఞాపకశక్తిని కొలవడానికి ఉపయోగిస్తారు. ఇందులో పాల్గొనేవారిని వరుస ఫొటోలతో కూడిన స్క్రీన్‌ను చూడమని సూచించారు.



వారు ఆ ఫొటోలను ఎంతగా ఇష్టపడ్డారో రేటింగ్ చేయమన్నారు. ఆ తర్వాత 10 నిముషాల పాటు విశ్రాంతి తీసుకోమని చెప్పారు. ఆపై వారికి మరిన్ని ఫొటోలు చూపించారు. ఇప్పటికే వాటిని చూశారా అని గుర్తించమని అడిగారు. ఒక ప్రశ్నపత్రం ఇచ్చి.. అందులో రోజువారీగా ఎంతసేపు చూస్తున్నారో లెక్కించమని అడిగారు. మీడియా మల్టీ టాస్కింగ్‌ చేయని వారికంటే చేసేవారే ఎక్కువగా శ్రద్ధ కోల్పోతారని కనుగొన్నారు.



ఏదైనా చూసిన ఫొటోలను గుర్తుకు తెచ్చుకునే ముందు వారిలో శ్రద్ధ కోల్పోవడం వంటి లోపాలను గుర్తించారు. మీడియా మల్టీ టాస్కింగ్ మతిమరుపునకు దారితీస్తుందా లేదో నిర్ధారించడానికి అనేక అధ్యయనాలు చేయాల్సిన అవసరం ఉందని పరిశోధకులు తెలిపారు.