భట్టి విక్రమార్క తన కోటను పదిలంగా కాపాడుకుంటారా?

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Mallu Bhatti Vikramarka: ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం అంటే సీపీఎంకు కంచుకోట. ఈ నియోజకవర్గం నుంచి బోడేపూడి వెంకటేశ్వరరావు పలుమార్లు విజయం సాధించటంతో పాటు సీపీఎం శాసనసభా పక్ష నేతగా వ్యవహరించారు. ఆ తర్వాత కట్టా వెంకట నర్సయ్య కూడా పలుమార్లు సీపీఎం నుంచి విజయం సాధించారు. అలాంటి నియోజకవర్గంలో సీపీఎం అభ్యర్ధిగా 2009, 2014లో లింగాల కమల్‌రాజ్ పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తన ఓటమికి పార్టీలోని కొంతమంది వ్యక్తులే కారణమంటూ నాటి వైసీపీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెంట వైసీపీలో చేరిపోయారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో పొంగులేటి కారెక్కారు. కమల్‌రాజ్ కూడా గులాబీ గూటికి చేరారు.

మధిర నియోజకవర్గాన్ని కాంగ్రెస్ కంచుకోటగా మార్చిన భట్టి:
సీపీఎం కంచుకోటగా ఉన్న మధిర నియోజకవర్గం నుంచి 2009, 2014, 2018 ఎన్నికల్లో వరుసగా కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన మల్లు భట్టి విక్రమార్క విజయం సాధించారు. నాడు వైఎస్ఆర్ హయాంలో డిప్యూటీ స్పీకర్‌గా పని చేశారు. సీపీఎం శ్రేణులను, నాయకులను కాంగ్రెస్‌లో చేర్చుకున్నారు. ఆ నియోజకవర్గాన్ని కాంగ్రెస్ కంచుకోటగా మార్చారు. 2009 నుంచి 2018 వరకు జరిగిన స్ధానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది.

ఎకానమీ నాశనం…కరోనా కేసులని పెంచడం : కేంద్రంపై రాహుల్ వ్యంగ్యాస్త్రాలు


సొంత నియోజకవర్గంతో పాటు జిల్లా పార్టీలో లుకలుకలు:
2018లో మూడోసారి మల్లుభట్టి విక్రమార్క విజయం సాధించటంతో పాటు ఉమ్మడి జిల్లాలో ఆరు స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్ధులు గెలుపొందారు. భట్టి సీఎల్పీ నేతగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో భట్టి, భద్రాచలం ఎమ్మెల్యే పోదెం వీరయ్య మినహా మిగిలిన నలుగురు ఎమ్మెల్యేలు కారెక్కేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీని బలోపేతం చేసేందుకు భట్టి విక్రమార్క ప్రయత్నాలు మొదలుపెట్టారు. సీఎల్పీ లీడర్‌గా ఉన్న ఆయన… ప్రభుత్వ వైఫల్యాలపై విమర్శలు చేస్తూ.. దూసుకెళ్తున్నారు. కానీ, సొంత నియోజకవర్గంతో పాటు జిల్లాలో మాత్రం పార్టీలో లుకలుకలు బయటపడుతున్నాయంటున్నారు.

సొంత జిల్లాతో పాటు నియోజకవర్గంలో పట్టు కోల్పోతున్న భట్టి:
ఉమ్మడి జిల్లాలో రాజకీయాలు మారిపోయాయి. కాంగ్రెస్‌లో ఉన్న నాయకులు, కార్యకర్తలు చాలా మంది టీఆర్ఎస్‌లో చేరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మధిరతో పాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కారు జోరు పెరిగింది. కనీసం పోటీ చేయాడానికి కూడా కాంగ్రెస్‌కి అభ్యర్థులు లేని పరిస్థితి నెలకొందంటే రాజకీయంగా ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంపై దృష్టి సారించిన భట్టి.. తన సొంత జిల్లాతో పాటు నియోజకవర్గంలో మాత్రం పట్టు కోల్పోతున్నారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

మధిరలో కీలకంగా మారిన కమల్ రాజ్:
సీఎల్పీ నేత మల్లుభట్టి విక్రమార్కకు చిరకాల ప్రత్యర్థి, మూడు సార్లు పోటీ చేసి ఓటమి పాలైన కమల్ రాజ్ మధిర జడ్పీటీసీగా పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత జిల్లా పరిషత్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి అసలు రాజకీయం షురూ అయ్యిందంటున్నారు. మధిరపై దృష్టి కేంద్రీకరించడంతో పాటు సంక్షేమ పథకాలతో ప్రజల్లోకి దూసుకెళ్తున్నారు. భట్టి రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారితే మధిరలో మాత్రం కమల్‌రాజ్ ఇప్పుడు కీలకంగా మారిపోయారని చెబుతున్నారు. అధికార కార్యక్రమాలు, శంకుస్థాపనలు, అభివృద్ధి పనుల్లో కూడా కమల్ రాజ్ పాల్గొంటున్నారు.

అనధికార ఎమ్మెల్యేగా కమల్ రాజ్:
మధిరలో అనధికార ఎమ్మెల్యేగా కమల్ రాజ్ నియోజకవర్గంలో వ్యవహరిస్తున్నారనే వాదన వినిపిస్తోంది. ఇక అసెంబ్లీ ఎన్నికలు వస్తే ఎమ్మెల్యే కావాలన్న తన కోరిక నెరవేరడం ఖాయమనే ధీమాలో ఉన్నారట కమల్‌రాజ్‌. రాష్ట్రంపై భట్టి పట్టు సంపాదిస్తున్న సమయంలో తన సొంత ప్రాంతమైన మధిర, ఎర్రుపాలెం, బోనకల్లు, చింతకానిలో కమల్ రాజ్ చొచ్చుకొస్తున్నారని అంటున్నారు. ప్రభుత్వ అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ కాంగ్రెస్‌కి చెందిన సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, సహకార సొసైటీ అధ్యక్షులను గులాబీ కండువాలు కప్పి స్వాగతిస్తున్నారు.

చాప కింద నీరులా బలం పెంచుకుంటున్న ప్రత్యర్థి‌:
అధికారులు సైతం జడ్పీ చైర్మన్ హోదాలో కమల్ రాజ్‌కే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని టాక్‌. సీఎల్పీ నేత భట్టిని పట్టించుకోవడం లేదనే చర్చ జరుగుతోంది. భట్టి కోటపై గులాబీ జెండా ఎగురుతుందనే అభిప్రాయంలో ఆ పార్టీ నాయకులున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారిన భట్టి.. ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతుండగా.. చాప కింద నీరుగా కమల్‌రాజ్‌ బలం పెంచుకుంటున్నారట. ఈ విషయాన్ని గ్రహించిన మల్లు భట్టి విక్రమార్క తన సతీమణి నందిని ద్వారా నియోజకర్గంలోని కాంగ్రెస్ కార్యకర్తలకు భరోసా ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు.

భట్టి తన కోటను పదిలంగా కాపాడుకుంటారా?
నియోజకవర్గంలోని ప్రధాన కమిటీలు, కార్యక్రమాలన్నింటినీ నందిని దగ్గరుండి చూస్తున్నారని కాంగ్రెస్‌ పార్టీ నేతలు చెబుతున్నారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా భట్టికి ఉన్న ఆదరణను ఏమీ చేయలేరంటున్నారు. తాము ముందుకు దూసుకెళ్తూనే ఉంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి భట్టి కోటపై పాగా వేయాలనుకుంటున్న కమల్‌రాజ్‌ ఆశలు నెరవేరతాయా? భట్టి తన కోటను పదిలంగా కాపాడుకుంటారా.. ఇప్పుడు ఇదే చర్చ అక్కడ సాగుతోంది.

Related Tags :

Related Posts :