Big boss 4 గ్రాండ్ ఫినాలె కన్నుల పండగే.. వరాల జల్లు కురిపించిన చిరు.. నాగ్‌లు

Big boss 4 గ్రాండ్ ఫినాలె కన్నుల పండగే.. వరాల జల్లు కురిపించిన చిరు.. నాగ్‌లు

big boss-4: అంగరంగ వైభవంగా మొదలైన బిగ్ బాస్.. ఏ మాత్రం తీసిపోకుండా చివరి వరకూ అదే అంచనాలతో ఉత్కంఠభరితంగా సాగింది. హోస్ట్ గా నాగార్జున సక్సెస్‌ఫుల్‌గా మరో సీజన్ ముగించగా ప్రైజ్ మనీ, ట్రోఫీని అందించడానికి మెగాస్టార్ చిరంజీవి బిగ్ బాస్ 4 స్టేజి మీదకు వచ్చారు.

బిగ్ బాస్ విన్నర్ గా అభిజిత్ ఎట్టకేలకు విజేతగా నిలిచాడు. కుటుంబ సభ్యుల సమక్షంలో కోట్లాది మంది అభిమానుల కోరిక మేరకు విజేత అయ్యాడు. వారంతంలో ముగిసే ఎలిమినేషన్ల తర్వాత చివరికి అఖిల్, అభిజిత్, సొహైల్ లో.. తనకు తానుగా గేమ్ నుంచి రూ.25లక్షల ప్రైజ్ మనీతో తప్పుకున్నాడు సొహైల్.

చిరు-నాగ్ ఒకరిపై ఒకరు పొగడ్తలు:
చిరంజీవి.. నాగర్జున ఒకరిపై ఒకరు పొగడ్తలు కురిపించుకున్నారు. ఇద్దరూ ఒకరినొకరు స్లిమ్ గా ఉన్నావంటూ కాంప్లిమెంట్లు ఇచ్చుకున్నారు. ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్3 నుంచి బిగ్ బాస్ సీజన్ 4కు చాలా ఇంప్రూవ్‌మెంట్ కనబరిచాడని చిరంజీవి ప్రశంసించారు. ఈ షోను విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్ చెబుతున్నానని చిరు అన్నారు.

ఆ తర్వాత మెగాస్టార్ చేసిన ప్రత్యేక రిక్వెస్ట్ మేరకు నాగార్జున జర్నీని చూపించాడు బిగ్ బాస్. సీజన్ మొత్తం నాగర్జున వేసిన సెటైర్లు ఒకటి తర్వాత ఒకటి పేలుస్తూ.. గ్రాండ్ ఫినెలె పటాకులు పేల్చారు. పాజిటివ్ యాంగిల్ తో పాటు సీరియస్ యాంగిల్ కూడా చూపించారు.

ఈ గ్రాండ్ ఫినాలె జరుగుతున్న సమయంలో మధ్యలో.. ప్రణీత, లక్ష్మీరాయ్, తమన్ లాంటి సెలబ్రిటీలు స్పెషల్ పర్‌ఫార్మెన్స్‌తో అలరించారు. చివర్లో నాగార్జున అందరికీ థ్యాంక్స్ చెప్పి సీజన్ ముగించారు.

సొహైల్ పై వరాల జల్లు కురిపించిన చిరంజీవి
నేను ఫ్యూచర్ లో సినిమా తీస్తే ఆ ఈవెంట్ మీరు రావాలని చిరంజీవిని అడిగితే దగ్గరుండి తానే జరిపిస్తానని మాటిచ్చారు. అంతేకాకుండా నీ సినిమాలో నాకూ ఓ రోల్ ఇస్తావా అని అడిగేసరికి సొహైల్ ఉబ్బితబ్బిబ్యయ్యాడు. ఆ తర్వాత సీజన్ లో బిర్యానీ గురించి సొహైల్ పడిన ఆరాటాన్ని చూపించిన చిరు నీతో పాటు అందరి కోసం నా భార్య చేతులతో వండిన బిర్యానీ పట్టుకొచ్చాను. నీకు నా ఫ్యామిలీ బాగా కనెక్ట్ అయిపోయిందని చెప్పారు.

మిగిలిన వారి గురించి చిరు మాట్లాడారిలా:
* గంగవ్వను నీ సంకల్పం చాలా గొప్పది కాబట్టి బిగ్ బాస్ టీంతో పాటు నాగార్జున చేతుల మీదుగా నీకు ఇల్లు వచ్చిందని చెప్పారు.
* లాస్య నిన్ను చూస్తే మా ఆడబడుచుని చూసినట్లే ఉందని.. చెప్పి దాంతో పాటు లాస్యక్కా అని ఆటపట్టించారు.
* దేత్తడి హారిక ఇచ్చిన ముద్దులను జేబులో పెట్టుకుని దాచేసుకుని నవ్వులు పూయించారు. కొంచెం నాగార్జునకు కూడా ఇస్తాలే అని సరదా నింపారు.
* దివికి నా సినిమాలో పోలీస్ రోల్ తో పాటు మరో యాంగిల్ తో కూడా చూపించమని చెప్పానని మరో 8,9నెలల్లో మనిద్దరం ఒకే సెట్ లో ఉంటాం అని మాటిచ్చారు.
* మెహబూబ్ ను చూస్తుంటే తనను తాను చూసుకుంటున్నట్లుగా ఉందని చెప్పారు. ఆ డ్యాన్స్ , ఆ గ్రేస్ మరెవ్వరి దగ్గర చూడలేదు. నీలో చాలా స్టామినా ఉందని చెప్పారు. తన తరపున పది లక్షలు తీసుకొమ్మంటూ చెక్ అందజేశారు.

ఇది చాలు నాకు: అఖిల్
అఖిల్ ఇక్కడ వరకూ రావడమే సంతోషం అని.. మెగాస్టార్ లాంటి వ్యక్తి పక్కన నిల్చోవడమే గెలుపు అని తనకు తానుగా ఓదార్పు చెప్పుకున్నాడు.

అభిజిత్ మాటల్లో:
ఇక విన్నర్ అభిజిత్ తనకు మాటలు రావడం లేదంటూ.. తెలుగులో మాట్లాడటానికి ప్రయత్నించాడు. సక్సెస్ ఫుల్ గా సాగిన ఈ బిగ్ బాస్ హౌజ్ లో తనకు ఓ క్యారెక్టర్ ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీలవుతున్నానని చెప్పాడు. ఎప్పుడూ మెగాస్టార్ పక్కన నిల్చొంటానని అనుకోలేదని అది ఓ కలగానే ఉండేదని అది సాకారం అయిందని.. ఈ అనుభూతి నా జీవితాంతం గుర్తుండిపోతుందని చెప్పాడు.

సూపర్ ట్విస్ట్ ఇచ్చిన సొహైల్:
అట్టహాసంగా ప్రారంభమై భారీ అంచనాలతో కొనసాగిన బిగ్ బాస్ సీజన్ 4 ఆదివారం పూర్తయిపోయింది. ఇందులో దాదాపు విన్నింగ్ పొజిషన్ చేరుకున్న తర్వాత ముగ్గురు మాత్రమే మిగిలారు. అప్పుడే కింగ్ నాగార్జున ఇచ్చిన ఆఫర్‌ ను ఎంచుకుని బయటికొచ్చేశాడు సొహైల్. కుటుంబ సభ్యులను కూడా అడిగి తీసుకున్న నిర్ణయంతో రూ.25లక్షల సూట్ కేస్‌తో బయటికొచ్చాడు.

ఆ తర్వాత సొహైల్ తన తమ్ముడు అడిగినట్లు రూ.10లక్షలు అనాథాశ్రమానికి ఇస్తా అని చెప్పాడు. బయటికొచ్చిన తర్వాత నాగర్జున ముందు నిల్చొని ఓ ఐదు లక్షలు అనాథాశ్రమానికి మరో ఐదు లక్షలు మెహబూబ్ ఇల్లు కట్టుకోవడానికి ఇస్తా అని చెప్పాడు. మెహబూబ్ పైకి లేచి నేను సంపాదించుకోగలను నా తరపున కూడా అనాథాశ్రమానికి ఇచ్చేయమని చెప్పాడు. ఇదంతా చూస్తున్న నాగర్జున మరో బంపర్ ఆఫర్ ఇచ్చాడు.

సొహైల్ నువ్వు ఇంటికి రూ.25లక్షలు పట్టుకెళ్లాల్సిందే.. మీ ఇద్దరి తరపున నేను అనాథాశ్రమానికి రూ.10లక్షలు ఇస్తా అని చెప్పేశాడు. అంతే సొహైల్, మెహబూల్ థ్యాంక్స్ చెప్పుకుంటూ ఆనందంలో వచ్చి నాగర్జున కాళ్ల మీద పడిపోయారు. మిమ్మల్ని చూసి నాకు కూడా ఇన్‌స్పిరేషన్ వచ్చిందని చెప్పి నాగర్జున వాళ్లను పైకి లేపి హగ్ చేసుకున్నారు.

మొత్తం రూ.35లక్షలు గెలుచుకున్న సొహైల్ టాప్ 3కాదు టాప్ 2అని చెప్పి పొగిడేశాడు నోయెల్. బయటకు తీసుకొచ్చిన ప్రైజ్ మనీతో అందరినీ కలిసిన సొహైల్.. 105రోజులు తనపై చూపించిన అభిమానానికి ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పాడు.

అంతకంటే ముందు బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ అరియానా గ్లోరీ ఎలిమినేట్ అయింది. రెండో ఎలిమినేషన్ కోసం బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లిన ఐటమ్ భామ లక్ష్మీరాయ్ తన వెంట అరియానాను వెంటబెట్టుకుని వచ్చింది. దాంతో బిగ్ బాస్-4 ఫైనలిస్టుల్లో ఇద్దరు ఎలిమినేట్ కాగా, ముగ్గురు టైటిల్ రేసులో మిగిలారు.