లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

తెలంగాణలో ఉద్యోగులకు పీఆర్సీ ఫిట్ మెంట్ ఎంతంటే..?!

Published

on

Bishwal Committee Report on PRC : పీఆర్సీ అమలుపై తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన బిశ్వాల్ కమిటీ రిపోర్టు విడుదలయింది. 7.5శాతం పీఆర్‌సీ ఫిట్‌మెంట్‌ అమలు చేయాలని బిశ్వాల్ కమిటీ రిపోర్టు ఇచ్చింది. 2018 జులై ఒకటి నుంచి వేతన సవరణ అమలు చేయాలని కమిటీ సూచించింది. ఉద్యోగి కనీస వేతనం 19వేలు ఉండాలని వేతన సంఘం సిఫార్సు చేసింది. ఉద్యోగుల పదవీ విరమణ వయసు 60 ఏళ్లకు పెంచాలని సూచించింది. హెచ్‌ఆర్‌ఏ తగ్గించాలని తెలిపింది. గ్రాట్యుటీ పరిమితి 12లక్షల నుంచి 16 లక్షలకు పెంచాలని సూచించింది.

ఉద్యోగుల వేతన సవరణ , పదోన్నతులు, ఇతర సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ బిశ్వాల్ కమిటీ రిపోర్టును ఉద్యోగసంఘాలకు అందజేయనుంది. ఈ మధ్యాహ్నం త్రిసభ్య కమిటీ వారితో సమావేశం కానుంది. ఇవాళ, రేపు ఉద్యోగుల అభిప్రాయాలను త్రిసభ్య కమిటీ సేకరిస్తుంది. మరోవైపు పీఆర్సీ కమిటీ రిపోర్టుపై ఉద్యోగ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. గతంలో 62శాతం ఫిట్‌మెంట్ కోరిన ఉద్యోగ సంఘాలు…ఇప్పుడు కాస్త పట్టువీడాయి. కనీసం 43శాతం ఫిట్‌మెంట్ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.

ఉద్యోగ సంఘాల నాయకులతో చర్చలు ప్రారంభించాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. వారం, పది రోజుల్లో ఈ చర్చల ప్రక్రియను పూర్తి చేసి నివేదిక సమర్పించాలన్నారు. సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ ఆధ్వర్యంలోని ఈ కమిటీలో ముఖ్య కార్యదర్శులు కె. రామకృష్ణారావు, రజత్‌కుమార్‌లు ఉన్నారు.

గత నెలలో ఉద్యోగుల సమస్యలపై సీఎం కేసీఆర్‌ త్రిసభ్య కమిటీని నియమించారు. కమిటీని నియమించి 20 రోజులు దాటినా ఇంత వరకు చర్చలు ప్రారంభం కాలేదు. దీంతో ఉద్యోగ సంఘాల నేతలు సీఎం కేసీఆర్‌ను కలిసి.. తమ సమస్యలను గుర్తు చేశారు. దీంతో సీఎం కేసీఆర్‌ స్పందించడంతో పీఆర్సీ ప్రక్రియలో మళ్లీ కదలిక వచ్చింది. సీఎం ఆదేశాలతో త్రిసభ్య కమిటీ ఒకటి రెండు రోజుల్లో ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపే అవకాశం ఉంది.

ఈ నెలాఖరులోగా ఈ చర్చల ప్రక్రియ పూర్తి చేస్తే… ఫిబ్రవరి తొలి వారంలో ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించే అవకాశాలున్నాయి. మరోవైపు రాష్ట్రలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో మహిళా ఉద్యోగుల భద్రత, సౌకర్యాల విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు సీఎం కేసీఆర్‌. శాఖల వారీగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో మహిళా ఉద్యోగులు సౌకర్యవంతంగా విధులు నిర్వహించేలా చూస్తామని హామీ ఇచ్చారు.