బీజేపీది రాష్ట్రానికో సిద్ధాంతం.. నేతను బట్టి నిర్ణయం

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

బీజేపీ అంటే ఒక జాతీయ పార్టీ. సహజంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఒకటే సిద్ధాంతం ఉంటుంది. కర్ణాటకలో ఒకలా, తెలంగాణలో మరోలా, ఆంధ్రాలో ఇంకోలా ఉండదు. కానీ, విచిత్రంగా వినాయక విగ్రహాల విషయంలో.. బీజేపీ రెండు తెలుగు రాష్ట్రాల అధ్యక్షులు భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేయటం, ఆ పార్టీ శ్రేణులను విస్మయపరుస్తోంది. ఈ విషయంలో తెలంగాణ బీజేపీ దళపతి బండి సంజయ్‌ అయితే కేసీఆర్ సర్కారుపై ఒంటికాలితో లేస్తుండగా.. ఏపీ కమళ దళపతి మాత్రం జగన్మోహన్‌రెడ్డి సర్కారు ఇబ్బందులు పడకుండా రాసిన లేఖ, ఆ పార్టీ సైద్ధాంతిక వాదనను వేలెత్తిచూపేలా మారిందంటున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా రాజధాని హైదరాబాద్‌లో గణపతి నవరాత్రులు ఏ స్థాయిలో చేస్తారో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఈ విషయంలో ప్రభుత్వాలే, గణేశ్‌ ఉత్సవ కమిటీతో సంప్రదింపులు చేస్తుంటాయి. ఈసారి కరోనా కారణంగా ప్రభుత్వం వినాయక మండపాలపై ఆంక్షలు విధించింది. దీనిపై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్… కేసీఆర్ సర్కారు తీరుపై విరుచుకుపడుతున్నారు. రంజాన్ సమయంలో మినహాయింపులు ఇచ్చినట్టే గణపతి నవరాత్రులకూ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

కేసీఆర్ ప్రభుత్వం, పోలీసుల ద్వారా మండప నిర్వహకులపై బెదిరింపులకు పాల్పడుతోందని దుయ్యబట్టారు. తొమ్మిది రోజులు భక్తులు, సామాజికదూరం పాటిస్తూ వినాయకచవితి చేసుకోవాలని, పోలీసుల ఒత్తిళ్లకు భయపడవద్దని పిలుపునివ్వడం చర్చనీయాంశమైంది. ఇదే వినాయకచవితి నిర్వహణ అంశంలో, ఏపీ బీజేపీ దళపతి సోము వీర్రాజు ప్రభుత్వానికి చేసిన విజ్ఞప్తి… కమలనాథులను కంగుతినింపించిందని అంటున్నారు.

పండుగకు ఒక్క రోజు అవకాశం ఇవ్వాలని, అదే రోజు నిమజ్జనం కూడా చేసుకోవాలంటూ రాసిన లేఖ.. అటు హిందువులనూ విస్మయపరిచింది. ఇలాంటి లేఖలు కమ్యూనిస్టు పార్టీలు రాస్తే.. పెద్దగా పట్టించుకోవలసిన అవసరం ఉండదు. కానీ, హిందుత్వంపై పేటెంట్ హక్కులున్నట్లు భావించే బీజేపీనే అలా లేఖ రాయడం హిందువులను విస్తుపోయేలా చేసింది. కొద్ది రోజుల క్రితమే ఏపీ హోం మంత్రులకు ఎస్‌ఐలను బదిలీ చేసే అధికారం లేదని ఎద్దేవా చేసిన సోము.. అదే హోంమంత్రికి లేఖ రాయడమే విడ్డూరం అంటున్నారు.

అంతకు ముందు బీజేపీ సీనియర్ నేత విష్ణువర్దన్‌రెడ్డి.. తమ పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు లేఖ రాసినప్పటికీ స్పందించని తీరుపై జగన్మోహన్‌రెడ్డి సర్కారును ఘాటుగా విమర్శించారు. మొహర్రం పండుగకు 40 మంది వరకూ మత పెద్దలను అనుమతించిన ప్రభుత్వం, వినాయకచవితి నిర్వహణపై ఎందుకు ఆంక్షలు విధిస్తోందని విరుచుకుపడ్డారు. జగన్ సర్కారు ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు.

ముస్లింల విషయంలో మాదిరిగా హిందు మత పెద్దలతో సమావేశం నిర్వహించాలని డిమాండ్ చేశారు. వీరికంటే ముందే.. వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు కూడా, మండపాల విషయంలో జగన్ సర్కారు హిందువుల మనోభావాలు గౌరవించాలని సీఎంకు లేఖ రాశారు. అధికార పార్టీ ఎంపీనే చవితిని తొమ్మిది రోజులు నిర్వహించుకునేందుకు అవకాశం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తే.. హిందుత్వంపై పేటెంట్ ఉందని భావించే, బీజేపీనే అధికారికంగా ఒక్కరోజు చాలంటూ లేఖ రాయడం విడ్డూరంగానే ఉందంటున్నారు.

బీజేపీలో సహజంగానే ఇది గందరగోళానికి దారితీసింది. సంప్రదాయం ప్రకారం.. గణపతి నవరాత్రోత్సవాలను 9 రోజులు నిర్వహించుకునేందుకు, ప్రభుత్వం ఎలాంటి ఆంక్షలు విధించవద్దని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా లేఖ రాయాల్సిన వీర్రాజు.. ఒక్క రోజుతో సరిపెట్టాలంటూ లేఖ రాయడం, పార్టీ శ్రేణులను విస్మయపరిచిందట. బహుశా వినాయకచవితి విషయంలో.. జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఎదుర్కొంటున్న ఇబ్బందులను గమనించి, పెద్దమనసుతో వీర్రాజు అలా లేఖ రాసి ఉండవచ్చన్న వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఇలాంటి పెద్దమనసు తెలంగాణ అధ్యక్షుడు సంజయ్‌కు లేకపోవడం కేసీఆర్ ప్రభుత్వ దురదృష్టమంటున్నారు.

ఇలాంటి భిన్న సిద్ధాంతం ఒక్క వినాయకచవితి విషయంలోనే కాదు. ఫోన్ ట్యాపింగ్ అంశంలోనూ కనిపించింది. ఆంధ్రాలో న్యాయమూర్తుల ఫోన్లపై జగన్ సర్కారు నిఘా పెట్టిందన్న ఆరోపణలపై హైకోర్టు విచారిస్తోంది. నిఘాపై జోక్యం చేసుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రధానికి లేఖ రాశారు. దానిని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆక్షేపించారు. రాష్ట్ర బీజేపీ నేతలు సైతం, దాంతో కేంద్రానికి ఏం సంబంధమని ఎదురుదాడి చేశారు.

చంద్రబాబుకు కష్టం వచ్చినప్పుడు కేంద్రం గుర్తుకు వస్తుందని, అధికారంలో ఉన్నప్పుడు మాత్రం సీబీఐ అవసరం లేదంటారని బీజేపీ నేతలు విరుచుకుపడ్డారు. కానీ, రాజస్థాన్‌లో కాంగ్రెస్ సర్కారు తమ ఫోన్లపై నిఘా పెట్టిందని, అక్కడి బీజేపీ నేతలు కేంద్రానికే ఫిర్యాదు చేశారు. దానిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అంతకు ముందు కర్నాటకలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు, తమ ఫోన్లను ట్యాపింగ్ చేస్తోందని, బీజేపీ నేతలు కేంద్రానికి ఫిర్యాదు చేశారు.

రాష్ట్రంలో వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు కూడా ఇదే తరహా ఫిర్యాదు చేశారు. సరే.. ఇతర రాష్ట్రాల్లోని బీజేపీ నేతల ఆరోపణలు పక్కనపెడితే.. స్వయంగా అధికార పార్టీ వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు కూడా తన ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందని ఫిర్యాదు చేయడాన్ని.. జీవీఎల్ గ్రహించకుండా అడ్డంగా వాదించడమే విడ్డూరంగా ఉందంటున్నారు. ఆ ప్రకారంగా.. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో బీజేపీ నాయకుల ఫోన్లు ట్యాపింగ్ జరిగితే, అక్కడ కేంద్రం జోక్యం చేసుకోవచ్చు. తమ మిత్రపక్షాలున్న రాష్ట్రాల్లో అదే ట్యాపింగ్ జరిగితే మాత్రం.. ఆ వ్యవహారంలో కేంద్రానికి ఎలాంటి సంబంధం ఉండదన్న మాట. మొత్తం మీద వివిధ అంశాలపై బీజేపీ తీరు ఒకే విధంగా లేకపోవడంతో కార్యకర్తల్లో భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి.

Related Tags :

Related Posts :