హైదరాబాద్‌లో బీజేపీ పాగా.. గ్రేటర్ పీఠాన్ని చేజిక్కించుకోనేందుకేనా?

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే దూకుడుగా వ్యవహరించే బండి సంజయ్‌ను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించింది. సంజయ్ అధ్యక్షుడు బాధ్యతలు చేపట్టిన తర్వాత హైదరాబాద్‌పై బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టింది. ముందుగా నగరంలో పార్టీ సంస్థాగత మార్పులపై దృష్టి సారించింది.కోటి జనాభా ఉన్న హైదరాబాద్‌లో పాగా వేస్తే ఆ ప్రభావం తెలంగాణ మొత్తం మీద ఉంటుందని బీజేపీ భావిస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా వ్యూహాన్ని ఖరారు చేసుకుని కచ్చితమైన ప్రణాళికతో ముందుకు వెళ్లేందుకు సిద్ధమవుతోంది. హైదరాబాద్‌లో పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేస్తే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలుపు సులువు అవుతుందని భావిస్తోంది.

నగరానికి నలుగురు అధ్యక్షులు :
ముంబై లాంటి నగరాల్లో బీజేపీకి ఆరుగురు అధ్యక్షులు కూడా ఉన్నారు. ఇదే తరహాలో జాతీయ నాయకత్వం సూచన మేరకు గ్రేటర్ హైదరాబాద్‌ను నాలుగు భాగాలుగా విభజించి, నలుగురు అధ్యక్షులను నియమించాలని అధ్యక్షుడు సంజయ్ సమాలోచనలు చేస్తున్నారట. విభజన అనంతరం ఎంపిక చేసే అధ్యక్షుడికి ఆ జిల్లా అధ్యక్షుడి స్థాయి హోదాను కల్పించనున్నారు. సంస్థాగతంగా నాలుగు భాగాలు చేయడం ద్వారా గ్రేటర్‌లో పార్టీ బలోపేతం అవుతుందని జాతీయ నాయకత్వం భావిస్తోంది.150 స్థానాలు 4 డివిజన్లుగా :
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లోని 150 స్థానాలను నాలుగు డివిజన్లుగా ఏర్పాటు చేయనున్నారు. అందులో హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలోని కార్పొరేషన్ స్థానాలను రెండుగా విభజించి మలక్‌పేట్‌ డివిజన్‌కు ఒక అధ్యక్షుడు, గోల్కొండ డివిజన్‌కు మరో అధ్యక్షుడిని యమించనున్నారట. అదేవిధంగా సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలోని కార్పొరేషన్ స్థానాలు మరో రెండు డివిజన్లుగా విభజించి ఒకటి మహంకాళి డివిజన్‌గా, మరొకటి అంబర్ పేట డివిజన్‌గా ఏర్పాటు చేయనున్నారు. ఈ వ్యూహనికి హైదరాబాద్ చెందిన నేతలు అందులో పార్టీ సీనియర్ నేతలైన కిషన్ రెడ్డి, లక్ష్మణ్, ఎమ్మెల్సీ రాంచందర్ రావు, రాజసింగ్ సైతం ఆమోద ముద్ర వేశారని చెబుతున్నారు.

జీహెచ్ఎంసీ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించిన బీజేపీ… హైదరాబాద్‌లో పార్టీని మరింత విస్తరించాలని భావిస్తోంది. దానిలో భాగంగానే బలమైన వ్యక్తులను గ్రేటర్ పరిధిలో అధ్యక్ష పదవి కట్టబెట్టాలని కాషాయ పార్టీ భావిస్తోంది. దీనివల్ల పార్టీ బలాన్ని పుంజుకోవడమే కాదు.. గ్రేటర్‌ పీఠాన్ని కూడా చేజిక్కించుకొనే అవకాశాలు మెరుగు పడతాయని అంచనా వేస్తోంది. మరి బీజేపీ అంచనాలు ఏ మేరకు నెరవేరతాయో వేచి చూడాల్సిందే.

Related Posts