Home » మద్యం అక్రమ రవాణా కేసులో బీజేపీ నేత అరెస్టు
Published
5 months agoon
By
bheemrajమద్యం అక్రమంగా రవాణా చేస్తూ బీజేపీ నేత పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. నల్గొండ జిల్లా చిట్యాల నుంచి గుంటూరుకు అక్రమంగా మద్యం రవాణా చేస్తున్న బీజేపీ నేత గుడివాక రామాంజనేయులు సహా మరో ముగ్గురుని పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 6 లక్షల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
రామాంజనేయలు గత ఎన్నికల్లో కృష్ణా జిల్లా మచిలీపట్నం నియోజకవర్గం నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. టీడీపీ హయాంలో వైన్స్, బార్లు కూడా ఆయన నిర్వహించారు. తాజాగా అక్రమంగా మద్యం రవాణ చేస్తున్న ఆయనను పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రెండు కార్లు స్వాధీనం చేసుకున్నారు.
అయితే మద్య నియంత్రణలో భాగంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం 33 శాతం మద్యం దుకాణాలను మూసి వేయడంతో పాటు ధరలు పెంచడంతో కొందరు సరిహద్దు ప్రాంతాల నుంచి మద్యం దిగుమతి చేస్తున్నారు. దొడ్డి దారిన విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు.
దీంతో పొరుగు రాష్ట్రాల మద్యం వరదలా పారుతోంది. గుట్టు చప్పుడు కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన మద్యం విక్రయించి సొమ్ము చేసుకుంటూ అడ్డంగా దొరికిపోతున్నారు.