రోజూ 5సార్లు హనుమాన్ చాలీసా పఠిస్తే కరోనా నుంచి విముక్తి

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి కరోనా వైరస్. ఈ మహమ్మారిని అరికట్టేందుకు ఏం చేయాలో తెలియక వైద్యశాస్త్ర నిపుణులు తలలు పట్టుకున్నారు. మరోవైపు వ్యాక్సిన్ కోసం శాస్త్రవేత్తలు రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు. కరోనాను ఎలా కట్టడి చేయాలో అర్థం కాక వైద్య నిపుణులు నానా తంటాలు పడుతుంటే, బీజేపీ ఎంపీ సాధ్వి ప్రగ్యా సింగ్ ఠాకూర్ ఓ సలహా ఇచ్చారు. హ‌నుమాన్ చాలీసా ప‌ఠిస్తే స‌రిపోతుంద‌ని, కరోనా అంతం అవుతుందని ఆమె సెల‌విచ్చారు.

జూలై 25 నుంచి ఆగస్టు 5వరకు హనుమాన్ చాలీసా పఠిస్తే:
“క‌రోనాతో పోరాడేందుకు, ప్రజలకు మంచి ఆరోగ్యం కోసం అందరూ జూలై 25 నుంచి ఆగ‌స్టు 5 వ‌ర‌కు త‌ప్ప‌నిస‌రిగా రోజుకు ఐదు సార్లు హ‌నుమాన్ చాలీసా ప‌ఠించండి. ఆఖ‌రి రోజు ఇంట్లో దీపాల‌ను వెలిగించి రాముడికి హార‌తి ప‌ట్టండి. దేశ‌వ్యాప్తంగా ఉన్న హిందువులు హ‌నుమాన్ చాలీసాను ఒకే స్వ‌రంలో ప‌ఠిస్తే దానికి క‌చ్చితంగా ఫ‌లితం ఉంటుంది. క‌రోనా నుంచి మ‌నం విముక్తి పొందుతాం.. ఇది రాముడికి చేసే ప్రార్థ‌న” అని ఓ వీడియోలో చెప్పారు భోపాల్ ఎంపీ ప్రగ్యా ఠాకూర్.

5వ తేదీన దీపావళి పండుగ చేసుకుందాం:
ప్రగ్యా ప్రాతినిధ్యం వ‌హిస్తున్న భోపాల్‌లో ఆగస్టు 4 వ‌ తేదీ వర‌కు లాక్‌డౌన్ అమ‌ల్లో ఉంది. ఈ విష‌యాన్ని ఆమె ప్ర‌స్తావిస్తూ.. “4న లాక్‌డౌన్ ముగుస్తుంది, 5న మ‌నం చేప‌ట్టిన ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మం ముగుస్తుంది. పైగా అదే రోజు అయోధ్య‌లో రామ మందిరం నిర్మాణానికి భూమిపూజ జ‌ర‌గ‌నుంది. ఆ రోజును మ‌నం దీపావళి పండ‌గ‌లా వేడుక చేసుకుందాం” అని పిలుపునిచ్చారు. హనుమాన్ చాలీసా చదివితే చాలు కరోనా అంతం అవుతుందని బీజేపీ ఎంపీ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. వివాదానికి దారి తీశాయి. ఇలాంటి మాటలతో ప్రజలను తప్పుదోవ పట్టించినట్టు అవుతుందని మండిపడుతున్నారు.

ఎంపీ వ్యాఖ్యలపై విమర్శలు:
కాగా, క‌రోనా వైర‌స్ రాకూడ‌దంటే భౌతిక ‌దూరం, ఫేస్ మాస్క్ ధ‌రించ‌డం, ఎప్ప‌టిక‌ప్పుడు చేతుల‌ను శుభ్ర‌ప‌రుచుకోవ‌డం వంటివి మస్ట్ అని నిపుణులు చెబుతున్నారు. ఇప్ప‌టికే క‌రోనా బారిన ప‌డిన‌వారు పౌష్టిక ఆహారం తీసుకుంటూ రోగ నిరోధ‌క శ‌క్తిని పెంపొందించుకుంటూ మహ‌మ్మారితో పోరాడుతున్నారు. మరోవైపు వ్యాక్సిన్ అందుబాటులోకి తెచ్చేందుకు శాస్త్రవేత్త‌లు విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వ్యాక్సిన్‌, మందులతో కాకుండా హ‌నుమాన్ చాలీసా ప‌ఠిస్తే స‌రిపోతుంద‌ని బీజేపీ ఎంపీ ప్ర‌గ్యా ఠాకూర్ సెల‌వివ్వడం పై విమర్శలు వస్తున్నాయి.

Related Posts