బుల్లెట్ ట్రైన్ వచ్చేస్తోంది : ముంబై – హైదరాబాద్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Bullet train is coming, Mumbai – Hyderabad : హైదరాబాద్ వాసులకు బుల్లెట్‌ ట్రైన్‌లో ప్రయాణించే అదృష్టం త్వరలోనే రాబోతోందా…? ప్రపంచంలోని వివిధ దేశాల్లో పరుగులు పెడుతున్న బుల్లెట్‌ ట్రైన్‌లు…హైదరాబాద్‌లో కూడా పరుగులు పెట్టబోతున్నాయా..? అంటే అవుననే సమాధానం విన్పిస్తోంది. మరి రయ్‌ రయ్‌ మంటూ నగరంలో బుల్లెట్‌ ట్రైన్స్‌ దూసుకెళ్లేందుకు ఇంకెంత కాలం పట్టబోతుంది..?



మారుతున్న కాలంతో పాటు రవాణాలోనూ అనేక మార్పులు శరవేగంగా చోటు చేసుకుంటున్నాయి. ప్రపంచంలో ప్రస్తుతం జెట్ స్పీడ్‌తో నడిచే రైళ్ల ట్రెండ్ నడుస్తోంది. అయితే అభివృద్ధి చెందుతున్న దేశాల సరసన చేరేందుకు ఇండియా కూడా పోటీ పడుతోంది. భారతీయుల ప్రయాణ వేగాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే దేశంలో ముంబై టూ అహ్మదాబాద్ మధ్య 540 కిలోమీటర్ల బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు పట్టాలెకిచ్చేందుకు లక్ష కోట్లు కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేస్తోంది.



ఇప్పుడు…ముంబై నుంచి హైదరాబాద్‌కు బుల్లెట్ ట్రైన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తుంది. ముంబై – పూణే – హైదరాబాద్ బుల్లెట్ ట్రైన్ కోసం డీపీఆర్‌పై చర్చలు కొనసాగుతున్నాయి. అన్నీ అనుకూలిస్తే వచ్చే ఏడాది చివరికి పనులు ప్రారంభం కావొచ్చు. ముంబై – పుణె – హైదరాబాద్​ బుల్లెట్​ ట్రైన్​ కారిడార్ ​పరిధి 711 కి.మీ గా నిర్ణయించారు..ఈ మార్గంలో బుల్లెట్ రైల్ పనులకు నవంబర్‌లో టెండర్లను కేంద్ర ప్రభుత్వం పిలవబోతుంది.


ఆ రెండు దేశాల్లో మళ్లీ లాక్‌డౌన్..!


2021లో ఈ బుల్లెట్‌ ట్రైన్‌ పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ బుల్లెట్ ట్రైన్‌తో జర్నీ టైం తగ్గడమే కాకుండా వాణిజ్య పరంగానూ ఎంతో ఉపయోగపడుతోందని భావిస్తున్నారు. ప్రస్తుతం భారత రైల్వే ట్రాక్‌లు 80 నుంచి 160 కిలోమీటర్ల స్పీడ్‌ను మాత్రమే తట్టుకుంటాయి కాబట్టి బుల్లెట్​ ట్రైన్స్​కోసం కొత్త ట్రాక్‌లు నిర్మించాల్సి ఉంటుంది. అందులో భాగంగానే టెండర్ల ప్రక్రియ తెర మీదకు తీసుకువచ్చారని తెలుస్తోంది.



దేశం మొత్తం 7 రూట్లలో బుల్లెట్​ ట్రైన్​కారిడార్లను అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో ముంబై టు హైదరాబాద్​రూట్​ ఒకటి. ఈ రూట్‌తో పాటు మరికొన్ని రూట్ల నిర్మాణం కోసం నేషనల్​ హై స్పీడ్ ​రైల్​ కార్పొరేషన్​ లిమిటెడ్​ సన్నాహాలు మొదలు పెట్టింది. డీపీఆర్‌పై చర్చించేందుకు నవంబర్ ​5న ప్రీ బిడ్ ​సమావేశాన్ని కూడా నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.



కారిడార్‌పై సర్వేతో పాటు అండర్​గ్రౌండ్​ వసతులు, సబ్​స్టేషన్లకు కరెంట్​ సరఫరా వంటి విషయాలపై చర్చించబోతున్నారు. నవంబర్​ 11న టెండర్లను పిలవనున్నారు. 18న టెండర్లను ఓపెన్ చేస్తారు. వచ్చే ఏడాది పనులను ప్రారంభించి..మూడు, నాలుగేళ్లలో బుల్లెట్​ ట్రైన్​ కారిడార్ ​పనులను పూర్తి చేసేందుకు కసరత్తులు చేస్తున్నారు. ప్రస్తుతానికి దేశంలో అహ్మదాబాద్ ​- ముంబై రూట్‌లో బుల్లెట్ ​ట్రెయిన్ ​కారిడార్​పనులు నడుస్తున్నాయి.



అయితే ఈ బుల్లెట్‌ ట్రైన్స్‌పై ప్రపంచవ్యాప్తంగా గతంలో ఉన్న ఆదరణ రోజురోజుకు పడిపోతుంది. దీనికి కారణం నిర్మాణ ఖర్చు తడిసి మోపెడవుతుండటంతో చాలా దేశాలు వెనకడుగు వేస్తున్నాయి. అలాంటి తరుణంలో ఇండియా ముందుకు రావడంపై…ఈ బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్ట్‌ దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర పరిణామాలు చూపుతుందని విశ్లేషకుల మాట. ఆ డబ్బులో పావు వంతైనా ప్రస్తుత రైల్వేను ఆధునికరించేందుకు పెడితే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. అయితే హైదరాబాదీల మనసులో మాత్రం ఈ బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్ట్‌ ఎన్నో ఆశలను నింపుతోంది.

Related Tags :

Related Posts :