అలర్ట్ : 2 రోజులు బ్యాంకులు బంద్

  • Published By: chvmurthy ,Published On : January 30, 2020 / 03:57 PM IST
అలర్ట్ : 2 రోజులు బ్యాంకులు బంద్

వేతన సవరణ డిమాండ్ తో బ్యాంకు ఉద్యోగులు రేపటి నుంచి (జనవరి 31) రెండు రోజులపాటు సమ్మె చేస్తున్నారు. దీంతో  బ్యాంకింగ్‌ కార్యకలాపాలకు ఆటంకం కలగనుంది. బ్యాంకు ఉద్యోగ సంఘాలు తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెలో పెద్ద ఎత్తున ఉద్యోగులు పాల్గొనున్నారు. 9బ్యాంక్ యూనియన్ల ఐక్య వేదిక యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్(UFBI) ఇచ్చిన పిలుపుతో ఉద్యోగులు ఈ సమ్మెకు సిద్ధమవుతున్నారు. 

ఈ ఐక్య వేదికలో అఖిల భారత బ్యాంక్ ఆఫీసర్ల సమాఖ్య(AIBOC), అఖిల భారత బ్యాంక్ ఉద్యోగుల సంఘం(AIBEA) బ్యాంక్ కార్మికుల జాతీయ సంఘం(NOBW) వంటివి ఉన్నాయి. సమస్యల పరిష్కార దిశలో చీఫ్ లేబర్ కమిషనర్ ముందు జరిగిన చర్చల్లో ఎటువంటి పురోగతి కనిపించలేదని, దీనితో యూనియన్లు సమ్మె నోటీసును వెనక్కు తీసుకోలేదని AIBOC ప్రెసిడెంట్ సునీల్ కుమార్ తెలిపారు. యూనియన్ల డిమాండ్లపై ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్(IBA) నుంచి కూడా ఎటువంటి హామీ రాలేదని AIBEA జనరల్ సెక్రటరీ సీహెచ్ వెంకటాచలం తెలిపారు.

ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోని సుమారు 10 లక్షల మంది  ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గోనున్నారు. జనవరి31, శుక్రవారం – ఫిబ్రవరి1, శనివారం నాడు వివిధ బ్యాంకు సేవలు ప్రభావితం కానున్నాయి. మరోవైపు జనవరి 31 న ఆర్థిక సర్వేను సమర్పించనున్నారు.  అలాగే ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంటులో యూనియన్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల దేశవ్యాప్త సమ్మెకు పిలుపునివ్వడం గమనార్హం.  

ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబిఎ) తో చర్చలు విఫలమైన అనంతరం  రెండు రోజుల సమ్మెకు వెళ్లాలని నిర్ణయించామని అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి సిహెచ్ వెంకటాచలం చెప్పారు. సమ్మెకాలంలో 80వేల బ్యాంక్ శాఖల్లో ఎక్కువ భాగం మూత పడతాయని తెలిపారు. అలాగే మార్చి 11 నుండి మూడు రోజుల పాటు మరోసారి సమ్మెను చేపట్టనున్నామని తెలిపారు. తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఏప్రిల్ 1 నుండి నిరవధిక సమ్మె జరుగుతుందని యుఎఫ్‌బియు ఇంతకుముందే ప్రకటించిన సంగతి విదితమే.