Adani Group : డిఫెన్స్​, ఏరోస్పేస్​ రంగాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్న ‘అదానీ గ్రూప్‘.. ​బ్రిటన్​ ప్రధాన మంత్రి బోరిస్​ జాన్సన్​తో చర్చలు

రెండుసార్లు చావునుంచి తప్పించుకున్న వ్యక్తి. కాలేజీ డ్రాప్ అవుట్ అయిన వ్యక్తి. భారతదేశ ఆర్థిక వ్యవస్థలో కీలకంగా మారారు గౌతమ్ అదానీ. ఇప్పుడు డిఫెన్స్​, ఏరోస్పేస్​ రంగాల్లోకి ఎంట్రీ ఇవ్వనుంది ‘అదానీ గ్రూప్‘.

Adani Group : డిఫెన్స్​, ఏరోస్పేస్​ రంగాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్న ‘అదానీ గ్రూప్‘.. ​బ్రిటన్​ ప్రధాన మంత్రి బోరిస్​ జాన్సన్​తో చర్చలు

Adani Group To Enter Defense And Aerospace Sector

Gautam Shantilal Adani : రెండుసార్లు చావునుంచి తప్పించుకున్న వ్యక్తి. కాలేజీ డ్రాప్ అవుట్ అయిన వ్యక్తి. భారతదేశ ఆర్థిక వ్యవస్థలో కీలకంగా మారారు. ఎవ్వరు టచ్ చేయలేనంత స్థాయిలో వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించే అత్యున్నత స్థాయికి చేరుకుంటారని బహుశా ఎవ్వరూ ఊహించి ఉండరు. కానీ అదానీ విషయంలో అదే జరిగింది.

అదాని అనేది ఒక పేరు మాత్రమే కాదు.. బ్రాండ్ ఇప్పుడు. దీని వెనక ఎన్నో ఏళ్ల కృషి.. అవకాశాన్ని అందుపుచ్చుకునే నైపుణ్యం.. ప్రపంచాన్ని పదేళ్లు ముందుగానే చూసే తత్వం ఉంది. అదే ఇప్పుడు అదానీని అగ్ర స్థానంలో నిలబెట్టింది. ఇప్పటికే సోలార్​ ఎనర్జీ, ఎయిర్​పోర్టులు, పోర్టులు లాంటి రంగాల్లో దూసుకుపోతున్న అదానీ గ్రూప్​.. ఇప్పుడు డిఫెన్స్​, ఏరోస్పేస్​ రంగాలలో ఎంట్రీ ఇవ్వనుంది. 2030 నాటికి డిఫెన్స్​ మోడర్నైజేషన్​ కోసం 300 బిలియన్​ డాలర్లను ఖర్చు పెట్టాలనేది కేంద్ర ప్రభుత్వం ఆలోచన. ఈ ఈ క్రమంలోనే బ్రిటన్​లోని కంపెనీలతో కలిసి ఈ రంగంలో పనిచేయాలనే డిసైడయ్యారు గౌతమ్‌ అదానీ. భారత్‌ పర్యటనలో ఉన్న ​బ్రిటన్​ ప్రధాన మంత్రి బోరిస్​ జాన్సన్​తో చర్చలు కూడా జరిపారు.

Also read : ADANI : కాలేజీ డ్రాప్ అవుట్ అయి..భారత వ్యాపారవేత్తల్లో రాఖీభాయ్‌ అనిపించుకుంటున్న ‘గౌతమ్‌ అదానీ’..

సంపద వృద్ధిలో మస్క్ లాంటి వాళ్లనే వెనక్కి నెట్టారంటే.. అదానీ వ్యాపార చతురత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 16.2 బిలియన్‌ డాలర్లుగా ఉన్న అదానీ నికర ఆస్తి విలువ 2021లో 50 బిలియన్‌ డాలర్లకు చేరింది. ముకేశ్‌ అంబానీ సంపాదన ఇదే సమయంలో 8.1 బిలియన్ల డాలర్లు పెరిగింది. అంబానీతో పోలిస్తే అదానీ సంపద రెట్టింపు పెరిగింది. అంబానీ సైతం చిన్నబోయేలా అదానీ ఎదుగుతున్నారు. అయితే ముఖేష్ తండ్రి వారసత్వాన్ని కొనసాగించగా.. అదానీ మాత్రం ఎవరి అండ లేకుండా ఇప్పుడు ఈ స్థాయికి చేరుకున్నారు. టెక్స్‌టైల్ బిజినెస్ ఓనర్ కుమారుడైన గౌతమ్ అదానీ.. కాలేజీ చదువు మధ్యలోనే మానేశారు. డైమండ్ బిజినెస్ కోసం 1980ల్లో ముంబై వెళ్లారు. కానీ కొంత కాలానికే గుజరాత్ తిరిగి వెళ్లి ప్లాస్టిక్ దిగుమతుల వ్యాపారంలో అన్నయ్యకు తోడుగా ఉన్నారు. 1988లో అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్‌ను స్థాపించారు. 1990ల్లో ముంద్రా పోర్టు నిర్వహణ బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత ఎలక్ట్రిసిటీ, గ్యాస్, రియల్ ఎస్టేట్ రంగాల్లోకి అదానీ ప్రవేశించారు. దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ పవర్ ప్రొడ్యూసర్‌గా ఎదిగారు. బొగ్గు తవ్వకాల్లోకి సైతం అడుగుపెట్టిన అదానీ.. విదేశాలకు సైతం ఈ వ్యాపారాన్ని విస్తరించారు. వెలుగులు నింపే విద్యుత్ నుంచి వంట నూనె వరకు.. పోర్టుల నుంచి వంట గ్యాసు వరకు.. ప్రతీ రంగంలో తనదైన ముద్ర వేస్తూ అదానీ గ్రూప్ ముందుకు దూసుకెళ్తోంది. పట్టిందల్లా బంగారం అయినట్లు.. ప్రతీ రంగంలోనూ విజయమే వరించింది. ప్రతీ వ్యాపారం లాభాల బాటే పట్టింది.

Also read :  Electric Scooters : పేలుతున్న ఎలక్ట్రిక్ స్కూటర్లు.. ఈ జాగ్రత్తలు పాటించండి

వ్యాపారంలో ప్రత్యర్థులు, పొలిటికల్‌ లీడర్ల నుంచి ఎలాంటి విమర్శలు ఎదురైనా అదానీ మాత్రం పక్కా వ్యాపారవేత్త. ఒకదానితో ఇంకోదానికి సంబంధం లేని రంగాల్లో పెట్టుబడులు పెట్టడం. లాభాలు ఆర్జించడం చేస్తున్నారు. నిజానికి జియోను ప్రారంభించాక.. దానిపైనే ముఖేష్ అంబానీ ఎక్కువగా శ్రద్ధ పెట్టారు. షేర్ల విక్రయం నుంచి తీసుకున్న చర్యల వరకు.. జియో చుట్టూనే ఆలోచనలు, వ్యాపార వ్యూహాలు కనిపించాయ్ కూడా. అదానీ గ్రూప్ విషయంలో అలా కాదు. బొగ్గు, ఎయిర్‌పోర్టులు, పోర్టులు, సోలార్ ప్రాజెక్టులు.. ఇలా ఒక రంగానికి ఇంకో రంగంతో సంబంధం లేకుండా తన వ్యాపారాన్ని విస్తరించుకుకుంటూ వెళ్లారు. లాభాల బాటలో నడిచారు. తూర్పు తీరంపై దృష్టిసారించిన అదానీ గ్రూప్.. ఒక్కో పోర్టును తన గూటికి చేర్చుకుంటోంది. కృష్ణపట్నంతో పాటు గంగవరంలోనూ మెజారిటీ వాటాలు దక్కించుకుంది. తూర్పు తీరంలో పాగా వేసేందుకు మరిన్ని లక్ష్యాలతో ముందుకు అడుగులు వేస్తోంది. దేశంలోనే అతిపెద్ద పోర్టుగా గుర్తింపు ఉన్న ముంద్రా పోర్టు కూడా ఈ సంస్థదే. గనులు, పోర్టులు, సోలార్ ప్రాజెక్టులు, డేటా సెంటర్లు మాత్రమే కాదు.. ఎయిర్‌పోర్టులపై కూడా దృష్టిసారించిన అదానీ గ్రూప్.. అందులోనూ తమ వ్యాపార సామ్రాజాన్ని విస్తరించేందుకు వ్యూహాలు రచిస్తోంది.

Also read : Admissions : మిలటరీ కాలేజ్ లో 8వ తరగతి ప్రవేశాలకు ఏప్రిల్ 25తో ముగియనున్న తుదిగడువు

2019లో ఆరు విమానాశ్రయాలకు కేంద్రం వేలం నిర్వహించగా.. అన్నింటిని అదానీ గ్రూపే దక్కించుకుంది. ముంబై విమానాశ్రయంలోనూ 76శాతం వాటా అదానీ గ్రూప్ సొంతం. మార్కెట్‌ అప్ అండ్ డౌన్స్ ప్రభావం పెద్దగా కనిపించని రంగాల పైనే అదానీ ఎక్కువగా దృష్టిసారిస్తున్నారు. అదే ఆయన సక్సెస్ సీక్రెట్ అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్. అయితే అదానీ పెద్దఎత్తున అప్పులు చేసి వ్యాపారాన్ని విస్తరిస్తున్నట్లు నిపుణులు చెప్తున్నారు. అది ఎంతకాలం వర్కవుట్‌ అవుతుందో చూడాలి. అలాగే కేంద్రంలో, గుజరాత్‌లో బీజేపీ అధికారంలో ఉండటం కూడా ఆయనకు కలిసొచ్చింది. ప్రభుత్వ పెద్దల అండదండలతోనే అదానీ గ్రూప్‌ అత్యంత వేగంగా అభివృద్ధి చెందిందన్న విమర్శలున్నాయి. భవిష్యత్‌లో అధికారం వేరే పార్టీల చేతుల్లోకి వెళ్తే.. అదానీ దూకుడు ఇదే రీతిన కొనసాగుతుందో, లేదో చూడాలి.