జియో ఎఫెక్ట్ : Airtel 3G సర్వీసులు షట్‌డౌన్.. 2G కొనసాగింపు

  • Published By: sreehari ,Published On : November 1, 2019 / 11:47 AM IST
జియో ఎఫెక్ట్ : Airtel 3G సర్వీసులు షట్‌డౌన్.. 2G కొనసాగింపు

ప్రముఖ టెలికం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ షాకింగ్ నిర్ణయాన్ని వెల్లడించింది. దేశవ్యాప్తంగా అందిస్తున్న3జీ సర్వీసులను నిలివేయనున్నట్టు ప్రకటించింది. రిలయన్స్ జియో నుంచి పోటీని తట్టుకోలేని చాలా టెలికం ఆపరేటర్ల బిజినెస్ భారీగా పడిపోయింది. జియో దెబ్బకు వారి కస్టమర్ల సంఖ్య రోజురోజుకీ తగ్గిపోతూ వస్తోంది. ఫలితంగా టెలికం ఆపరేటర్లు నష్టాల బాట పట్టాయి. ఇప్పుడు భారతీ ఎయిర్ టెల్ కూడా జియో దెబ్బకు తమ 3జీ సర్వీసులను నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంది. 

దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో 3జీ సేవలను నిలిపివేస్తున్నట్టు భారతీ ఎయిర్‌టెల్‌ సీఈఓ గోపాల్‌ విట్టల్‌ స్పష్టం చేశారు. మరోవైపు 2G సర్వీసుల విషయంలో మాత్రం ఎయిర్ టెల్ అలానే కొనసాగించనున్నట్టు తెలిపారు. ప్రస్తుతానికి ఎయిర్ టెల్ 2జీ సర్వీసుల షట్ డౌన్ విషయంలో ఎలాంటి ప్రణాళికలు లేవు. 2జీ నెట్‌వర్క్ నుంచి రెవెన్యూ వస్తున్నంతకాలం 2జీ సేవలను కొనసాగిస్తామని చెప్పారు.

మొబైల్ ఫోన్లలో హైస్పీడ్ వైర్ లెస్ కమ్యూనికేషన్ కూడిన వాయిస్ ఓవర్ లాంగ్ టెర్మ్ ఎవల్యూషన్ (VoLTE) ప్రామాణికంగా మారింది. ఒక ఇండియాలో రిలయన్స్ జియో మాత్రమే నాణ్యమైన 4G-VoLTE నెట్ వర్క్ సర్వీసులను అందిస్తోంది. రెవిన్యూపరంగా దేశీయ రెండో అతిపెద్ద టెలికం ఆపరేటర్ ఎయిర్ టెల్ జియో తర్వాతి స్థానంలో ఉంది. 

జియో నుంచి పోటీ కారణంగా ఎయిర్ టెల్ 3జీ సర్వీసులను ఎత్తేసి.. 2G, 4G నెట్ వర్క్ సర్వీసులపై ఫోకస్ పెడుతోంది. మరోవైపు వోడాఫోన్-ఐడియా 2G, 3G, 4G నెట్ వర్క్ లను ఆపరేట్ చేస్తున్నాయి. కొన్ని ఏళ్ల వరకు 2G సర్వీసులను కొనసాగించాలని నిర్ణయించామని, 3జీ సర్వీసుల నుంచే రెవిన్యూ భారీగా క్షీణించడంతో ఆయా సర్వీసులను నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నట్టు విట్టల్ చెప్పారు.

ఈ ఏడాది ఆగస్టులోనే 3జీ నెట్ వర్క్ సర్వీసులను నిలిపివేయనున్నట్టు కంపెనీ ప్రకటించినప్పటికీ.. దేశవ్యాప్తంగా 22 టెలికం సర్కిళ్లలో మార్చి 2020 నాటికి 3జీ సర్వీసులను అంచెలంచెలుగా నిలిపివేయనున్నట్టు విట్టల్ తెలిపారు. అదే సమయంలో 4G సర్వీసులపై ఫోకస్ పెంచే దిశగా అడుగులు వేయనుంది. కోల్ కతాలో జూలైలోనే 3జీ సర్వీసులను నిలిపివేసే ప్రక్రియ ప్రారంభించింది. ఆ తర్వాత హర్యాణా, పంజాబ్ సర్కిళ్లలో కూడా 3జీ సర్వీసులను నిలిపివేయనుంది. ఫీచర్ ఫోన్ల యూజర్లకు అందించే 2జీ సర్వీసులను కొనసాగిస్తామని ఎయిర్ టెల్ స్పష్టం చేసింది.