ఆల్ టైం రికార్డు : బంగారం బంగారమాయే

  • Published By: madhu ,Published On : August 30, 2019 / 02:04 AM IST
ఆల్ టైం రికార్డు : బంగారం బంగారమాయే

దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు చుక్కలను తాకుతున్నాయి. గత కొంతకాలంగా పెరుగుతూ పోతున్న పుత్తడి.. ఇప్పుడు 40వేల మార్క్‌ను దాటింది.  ఆగస్టు 30వ తేదీ గురువారం ఒక్కరోజే 250 రూపాయలు పెరగడంతో బులియన్‌ మార్కెట్లో 10 గ్రాముల పసిడి 40 వేల 220 పలికింది. అటు వెండి ధర కూడా 50వేల మార్క్‌ను సమీపిస్తోంది. రూ. 200 పెరగడంతో కేజీ వెండి ధర 49వేల 50కి చేరింది. 

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర రూ. 40 వేల 300, వెండి కిలో రూ. 49 వేలుగా ఉంది. అమెరికా – చైనాల మధ్య వాణిజ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో..సురక్షితమని భావించి మదుపర్లు తమ పెట్టుబడులను బంగారం వైపుకు మళ్లిస్తుండడం ధరల పెరుగుదలకు కారణమంటున్నారు బిజినెస్ నిపుణులు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం భయాలతో ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడిగా గోల్డ్ వైపు మొగ్గు చూపుతున్నారు. అమెరికా-చైనా ట్రేడ్ వార్ కూడా గోల్డ్ ధరలు పెరగడానికి కారణం.

దేశంలో శుభకార్యాలు, పండగ సీజన్లు కావడం.. రూపాయి బలహీనపడి డాలర్ బలపడటం కూడా గోల్డ్ రష్ కి కారణం అని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ఉండటం, దేశీయంగా ఉన్న ఆటోమొబైల్ రంగం షేర్లు లాస్ లో ఉండటం కూడా పుత్తడి రేట్లు పెరగడానికి కారణంగా చెబుతున్నారు. ఈ పరిణామాలతో ఇన్వెస్టర్లు సేఫ్ సైడ్ గా గోల్డ్, సిల్వర్ వైపు మొగ్గు చూపుతున్నారు.

ఓ పక్క బంగారం ధరలు విపరీతంగా పెరిగిపోతుంటే మరోపక్క డైమండ్‌ పరిశ్రమ రాను రాను సంక్షోభంలో కూరుకుపోతోంది. మరోసారి మాంద్యం పరిస్థితులు, అటు పరిశ్రమను, ఇటు కార్మికులను చుట్టుముడుతున్నాయి. ప్రధానంగా సూరత్‌లోని వజ్రాల పరిశ్రమ మాంద్యం కారణంగా అత్యంత ఘోరమైన దశలను ఎదుర్కొంటోంది. డైమండ్‌ కింగ్‌, నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీ, జతిన్ మెహతాల కుంభకోణాల తరువాత బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదు. దీంతోపాటు నోట్ల రద్దు, జీఎస్‌టీ పరిశ్రమపై ప్రతికూలంగా ప్రభావితం చేశాయి.
Read More : వార్నిష్ కోటింగ్ : త్వరలో కొత్త రూ.100 నోట్లు