టిక్-టాక్ నిషేధం నిర్ణయంపై అమెజాన్ వెనకడుగు

  • Published By: vamsi ,Published On : July 11, 2020 / 02:08 PM IST
టిక్-టాక్ నిషేధం నిర్ణయంపై అమెజాన్ వెనకడుగు

అతిపెద్ద ఈ-కామర్స్ సంస్థ అమెజాన్, చైనా యాప్ టిక్-టాక్‌ను తొలగించమని తన ఉద్యోగులను కోరుతూ ఈ-మెయిల్ పంపింది. అయితే ఈ మెయిల్ పంపిన కొన్ని గంటల తర్వాత అమెజాన్ మెయిల్ పొరపాటున జరిగిందంటూ వెల్లడించింది. మా ఉద్యోగులలో కొంతమందికి పొరపాటున ఒక ఈ-మెయిల్ పంపబడిందని అమెజాన్ ప్రకటించింది.

తాము పంపే ఈ-మెయిల్స్‌లోని సమాచారం టిక్‌టాక్‌ ద్వారా తస్కరణకు గురయ్యే ప్రమాదం ఉందని, భద్రతా కారణాల దృష్ట్యా మొబైల్ ఫోన్ల నుంచి ప్రతి అమెజాన్ ఉద్యోగి ఆ యాప్‌ను తొలగించాలని ఇటీవల ఈ-మెయిల్స్ పంపింది. ఈ క్రమంలో ల్యాప్‌టాపుల్లో మాత్రమే టిక్‌టాక్‌ను వాడొచ్చని తెలిపింది.

అయితే, ఈ ఆదేశాలను ఉపసంహరించుకుంటున్నట్లు మరో ప్రకటన చేసింది. టిక్‌టాక్‌పై బ్యాన్ ప్రకటన పొరపాటున చేశామని అమెజాన్ చెప్పుకొచ్చింది. టిక్‌టాక్‌పై విధించిన బ్యాన్‌ను వెనక్కి తీసుకోవడానికి కారణాన్ని మాత్రం కంపెనీ చెప్పలేదు. ఇప్పటికే టిక్‌టాక్‌పై భారత్‌లో నిషేధం విధించిన విషయం తెలిసిందే. అమెరికాలోనూ ఈ యాప్‌పై నిషేధం విధించాలనే యోచనలో ఉన్నారు.