అనిల్ అంబానీకి కొత్త తలనొప్పి…1200 కోట్లు వసూలు చేసేందుకు సిద్దమైన SBI

  • Published By: venkaiahnaidu ,Published On : June 15, 2020 / 02:46 PM IST
అనిల్ అంబానీకి కొత్త తలనొప్పి…1200 కోట్లు వసూలు చేసేందుకు సిద్దమైన SBI

మాజీ బిలియనీర్ అనిల్ అంబానీకి మళ్ళీ కష్టాల్లో చిక్కుకున్నాడు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో ఒకరైన రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ తమ్ముడైన ‌ అనిల్ అంబానీకి రుణ చిక్కులు వచ్చాయి. అనిల్ అంబానీ  వ్యక్తిగత హామీగా ఉన్న కార్పొరేట్‌ రుణాలు వసూలు కాకపోవడంతో ఎస్‌బీఐ తదుపరి చర్యలను ప్రారంభించింది. వీటికి హామీదారు అయిన అనిల్‌ అంబానీ నుంచి వాటిని వసూలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది.

ఆ రుణాల మొత్తం విలువ రూ.1200 కోట్ల వరకు ఉండొచ్చని సమాచారం. వాటి చెల్లింపులకు సంబంధించి గతంలో బ్యాంకుకు అనిల్ వ్యక్తిగత హామీ ఇచ్చారు.కార్పొరేట్‌ రుణాల చెల్లింపుల ప్రక్రియకు ఒక రిజల్యూషన్‌ ప్రొఫెషనల్‌ను నియమించాలని కోరుతూ నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ)ని ఎస్‌బీఐ ఆశ్రయించింది. దీనిపై సమాధానం ఇచ్చేందుకు ఎన్‌సీఎల్‌టీ… అనిల్‌ అంబానీకి గురువారం వరకు సమయం ఇచ్చినట్టు తెలుస్తోంది.

అడాగ్ గ్రూప్‌నకు చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్ లిమిటెడ్, రిలయన్స్ ఇన్ఫ్రాటెల్ లిమిటెడ్ కంపెనీలు తీసుకున్న కార్పొరేట్ రుణాలకు అనిల్ వ్యక్తిగత హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో దివాలా చట్టం ప్రకారం.. ఆయన నుంచి రూ.1200 కోట్లను వసూలు చేసేందుకు ఎస్‌బీఐ సిద్ధమైంది. 

అయితే ఈ విషయం కార్పొరేట్ రుణానికి సంబంధించినదని, వ్యక్తిగత రుణానికి చెందినది కాదని అడాగ్‌ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. ఈ ఏడాది మార్చిలోనే రుణ పరిష్కార ప్రణాళికలకు రుణదాతలు అంగీకరించారని, ట్రైబ్యునల్‌ ఆమోదం కోసం వేచి చూస్తున్నట్టు ఆయన వెల్లడించారు. అలాగే, వాటికి అనుగుణంగా అంబానీ సమాధానం ఇస్తారని తెలిపారు.