ఆ Jiomart వెబ్ సైట్లతో జాగ్రత్త, కస్టమర్లకు రిలియన్స్ రిటైల్ హెచ్చరిక

  • Published By: naveen ,Published On : August 28, 2020 / 03:20 PM IST
ఆ Jiomart వెబ్ సైట్లతో జాగ్రత్త, కస్టమర్లకు రిలియన్స్ రిటైల్ హెచ్చరిక

కొన్ని నెలల క్రితమే రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ తన రిటైల్ ప్లాట్ ఫామ్ జియో మార్ట్(JioMart) లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ బ్రాండ్ కింద ఆన్ లైన్ గ్రోసరీ సేవలు అందిస్తోంది. కరోనావైరస్ సంక్షోభం సమయంలో ఇంట్లో కూర్చునే కస్టమర్లు తక్కువ ధరకే గ్రోసరీస్ కొనుగోలు చేసేలా జియో మార్ట్ ను తీసుకొచ్చింది. ఇది లోకల్ రిటైల్ షాపులకు కూడా ఉపయోగకరంగా ఉంటుందని రిలయన్స్ తెలిపింది.



జియో మార్ట్ పై హ్యాకర్ల కన్ను:
కాగా, ఇంటర్నెట్ కేంద్రంగా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ప్రముఖ వెబ్ సైట్లను అడ్డం పెట్టుకుని సైబర్ క్రైమ్స్ కు పాల్పడుతున్నారు. ప్రముఖ కంపెనీల పేర్లతో కస్టమర్లను మోసం చేసి డబ్బు దండుకుంటున్నారు. తాజాగా రిలయన్స్ జియో మార్ట్ కి కూడా అలాంటి అనుభవమే ఎదురైంది. హ్యాకర్ల కన్ను జియో మార్ట్ పై పడింది. హ్యాకర్లు ఫేక్ జియో మార్ట్ వెబ్ సైట్లు క్రియేట్ చేసి షాపర్ల నుంచి డబ్బు దోచుకుంటున్నారు.

హ్యాకర్లు అచ్చం జియో మార్ట్ వెబ్ సైట్ లా కనిపించే నకిలీ వెబ్ సైట్ ని క్రియేట్ చేశారు. జియో మార్ట్‌ పేరుతో ఫ్రాంఛైజీలను ఆహ్వానిస్తున్నట్టు అందులో ఉంది. ఈ విషయం తెలుసుకున్న రిలయన్స్ రిటైల్ అలర్ట్ అయ్యింది. కస్టమర్లను హెచ్చరిస్తూ సందేశం ఇచ్చింది.

ఎటువంటి డీలర్‌షిప్‌, ఫ్రాంఛైజీ విధానాన్ని నిర్వహించడం లేదన్న రిలయన్స్:
నకిలీ వెబ్‌సైట్‌ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని రిలయన్స్‌ రిటైల్‌ హెచ్చరించింది. ప్రస్తుతానికి ఎటువంటి డీలర్‌షిప్‌, ఫ్రాంఛైజీ విధానాన్ని తాము నిర్వహించడం లేదని స్పష్టం చేసింది. ‘కొందరు మోసగాళ్లు నకిలీ వెబ్‌సైట్లను సృష్టించి, జియోమార్ట్‌ సేవల పేరుతో ఫ్రాంఛైజీలను ఇస్తూ మోసగిస్తున్న ఉదంతాలు మా దృష్టికి వచ్చాయి. ప్రస్తుతం మేము ఎటువంటి డీలర్‌షిప్‌ లేదా ఫ్రాంఛైజీ విధానాన్ని అమలు చేయడం లేదు. ఏజెంట్లను సైతం నియమించలేదు. ఫ్రాంఛైజీకి వ్యక్తుల నియామకానికి మేం ఎటువంటి రుసుములు విధించం. ఇటువంటి మోసాల విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. బ్రాండ్‌ పేరు దెబ్బతీసేవారి మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాం’ అని రిలయన్స్‌ రిటైల్‌ వెల్లడించింది.