ఉద్యోగులకు ఊరట: ఐటీ బాదుడు వారికి మాత్రమే

ఉద్యోగులకు ఊరట: ఐటీ బాదుడు వారికి మాత్రమే

కేంద్రం ఆమోదం తెలిపితే చిరుద్యోగుల నుంచి ఓ మాదిరి ఉద్యోగులందరికీ భారీ ఊరట లభించినట్లే. పది లక్షల ఆదాయం వరకు ఉంటే పది శాతం. 20 లక్షల వరకు ఆదాయం ఉంటే 20 శాతం చెల్లించాలి. అఖిలేశ్‌ రంజన్‌ నేతృత్వంలోని టాస్క్‌ఫోర్స్‌  కేంద్రానికి ఈ సిఫారసును పంపింది. దీనిని అంగీకరిస్తే ఉద్యోగులకు భారీ ఊరట లభించినట్లే. ఆదాయపు పన్ను బాదుడు నుంచి ఉపశమనం ఆశిస్తున్న వర్గాలన్నింటికీ ఈ టాస్క్‌ఫోర్స్‌ నివేదిక ఊరటనిస్తోంది. ఆదాయపు పన్నుల్లో సంస్కరణలు సూచించేందుకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) సభ్యుడు అఖిలేశ్‌ రంజన్‌ కన్వీనర్‌గా ప్రత్యేక కమిటీ ఏర్పాటైంది. 

ఈ కమిటీ ఇటీవలే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు తన నివేదికను సమర్పించింది. కొద్ది రోజుల ముందు ప్రకటించిన బడ్జెట్‌లో రూ.5లక్షల లోపు ఆదాయం ఉన్నవారు పన్ను కట్టాల్సిన అవసర్లేదని కేంద్రం తెలిపింది. ప్రస్తుతం రూ.2.50 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఆదాయంపై ఉన్న ఐదు శాతం పన్నును ఎత్తేశారన్న మాట. రూ.5 లక్షల నుంచి 10 లక్షల లోపు ఆదాయంపై 20 శాతం పన్ను వసూలు చేస్తోంది. దీనిని 10 శాతానికి తగ్గించాలని టాస్క్‌ఫోర్స్‌ కమిటీ నివేదికలో పేర్కొంది. ఆదాయం రూ.10 లక్షలు దాటితే ఏకంగా 30 శాతం పన్ను కట్టాల్సి వస్తోంది. దీనిని 20 శాతానికి కుదించాలని కమిటీ సూచించింది. 

20 లక్షల నుంచి 2 కోట్ల మధ్య ఆదాయాన్ని ఒక శ్లాబుగా నిర్ణయించి 30 శాతం పన్ను వసూలు చేయాలని తెలిపింది. రూ.2 కోట్లకు మించి ఎంత ఆదాయమున్నా… 35 శాతం చొప్పున పన్ను విధించాలని సిఫారసు చేసింది. మొత్తంగా ‘సూపర్‌రిచ్‌’పై మరింత అదనంగా పన్ను విధించాలని అభిప్రాయపడింది. ఆదాయాన్ని బట్టి 5.. 10.. 20.. 30.. 35 శాతం అనే 5 శ్లాబుల్లో పన్ను విధించాలని ప్రభుత్వానికి సూచించింది.
 
గతేడాది నవంబరులో కేంద్ర ఆర్థిక శాఖ అఖిలేశ్‌ రంజన్‌ కన్వీనర్‌గా ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. 58 ఏళ్లుగా ఉన్న ఆదాయపు పన్ను చట్టాన్ని మార్చడం, పన్ను విధానంలో మార్పులే లక్ష్యంగా ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ ఏర్పడింది. ఆగష్టు 19న అందిన కమిటీ నివేదికను ప్రభుత్వం ఇంకా బహిర్గతం చేయలేదు. మధ్య తరగతి ప్రజల చేతిలో డబ్బులుంటేనే వస్తు వినియోగం పెరుగుతుంది. ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతోంది. డివిడెండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ ట్యాక్స్ ఎత్తివేయాలని సూచించింది. మినిమమ్‌ ఆల్టర్నేట్‌ ట్యాక్స్‌ కూడా పక్కన పెట్టాలని తెలిపింది. పన్నులపై ‘సర్‌చార్జి’లు విధించరాదని సూచించింది.