ఉల్లి కిలో రూ.35 : హెల్మెట్ పెట్టుకుని విక్రయాలు

10TV Telugu News

దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఉల్లిపాయ రేటు విపరీతంగా పెరిగిపోయింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కిలో ఉల్లి 80-110 రూపాయల మధ్య పలుకుతోంది. అటు ఉత్తర భారతంలోనూ అదే విధమైన పరిస్ధితి ఏర్పడింది. వంటలో ఉల్లి వాడకాన్ని ప్రజలు మర్చిపోతున్నారు. ఉల్లి కొనటానికే భయపడే పరిస్ధితి ఏర్పడింది. బీహార్  ప్రభుత్వం ప్రజలకు ఉల్లిని కిలో రూ.35 కి ఇవ్వాలని నిర్ణయించింది. ఇందుకోసం బీహార్ స్టేట్ ట్రేడింగ్ కార్పోరేటివ్ మార్కెటింగ్ యూనియన్ ద్వారా ఉల్లిపాయలు సరఫరా చేసేందుకు కౌంటర్లు ఏర్పాటు చేశారు. 

దీంతో ప్రజలు శనివారం ఉదయం నుంచే బారులు తీరారు. ఉల్లిపాయలు అయిపోతాయనే భయంతో జనాలు ఎగబడ్డారు. దీంతో ఉద్యోగులు హెల్మెట్లు పెట్టుకుని ఉల్లిపాయలు అమ్ముతున్నారు. ఉల్లిపాయలు అందరికీ అందకపోతే ఒకవేళ ప్రజలు తిరగబడి రాళ్ళతో దాడి చేస్తారేమో అనే భయంతో ఇలా హెల్మెట్ లు పెట్టుకున్నామని స్టేట్ ట్రేడింగ్ కార్పోరేటివ్ మార్కెటింగ్ సిబ్బంది చెప్పారు.  ఉల్లిపాయలు అమ్మేందుకు ప్రభుత్వం మాకు రక్షణ కల్పించలేదని వారు వాపోయారు.