ప్రపంచ అపర కుబేరుడిగా మళ్లీ బిల్ గేట్స్

  • Published By: sreehari ,Published On : November 16, 2019 / 02:06 PM IST
ప్రపంచ అపర కుబేరుడిగా మళ్లీ బిల్ గేట్స్

మైక్రోసాఫ్ట్ సహా వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ మళ్లీ ప్రపంచ అపర కుబేరుడి స్థానాన్ని కైవసం చేసుకున్నారు. అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్ ను వెనక్కి నెట్టేసి ఆయన స్థానాన్ని బిల్ గేట్స్ మరోసారి దక్కించుకున్నారు. ప్రపంచ కుబేరుల జాబితాలో బిల్ గేట్స్ టాప్ ర్యాంకులో నిలిచారు.

రెండేళ్లలో బిల్ గేట్స్ టాప్ ర్యాంకు జాబితాలో చేరడం ఇదే తొలిసారి. బ్లూమ్ బెర్గ్ బిలియనీర్ సూచిక ప్రకారం.. ప్రపంచంలో 500మంది అత్యంత సంపన్నుల జాబితాను గత నెలలో విడుదల చేసింది. అమెజాన్ తమ నికర ఆదాయం క్షీణించినట్టు ప్రకటించడంతో బిల్ గేట్స్ విలువ ఒక్కసారిగా పెరిగిపోయింది. 

తాజా నివేదికల ప్రకారం.. యూఎస్ మార్కెట్లు శుక్రవారం మూతపడటంతో బిల్ గేట్స్ నికర ఆదాయం 110 బిలియన్ డాలర్ల దగ్గర స్థిరపడింది. మరోవైపు బెజోస్ నికర ఆదాయం 108.7 బిలియన్ డాలర్లకే పరిమితమైంది. బిల్ గేట్స్ ర్యాంక్ ఉన్నట్టుండి పెరగడానికి అసలు కారణం.. ఇటీవలే మైక్రోసాఫ్ట్ అమెజాన్ కు బదులుగా పెంటగాన్ తో 10 బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీంతో బిల్ గేట్స్ మరోసారి అపర కుబేరుడిగా అవతారమెత్తారు. 

ఈ తాజా ఒప్పందంతో మైక్రోసాఫ్ట్ షేర్ల ధరలు కూడా భారీగా పెరగనున్నాయి. అయినప్పటికీ, బిల్ గేట్స్ 1 శాతం మైక్రోసాఫ్ట్ షేర్లను మాత్రమే సొంతం చేసుకున్నారు. రిపోర్టుల ప్రకారం.. 7 బిలియన్ డాలర్లకు 1 శాతం మాత్రమే సాధించారు. గేట్స్ నికర ఆదాయం కూడా అత్యధిక స్థాయికి పెరిగి ఉండాల్సి ఉండగా, 1994 నుంచి బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ కోసం 35 బిలియన్ల డాలర్లను విరాళంగా ఇస్తూ వస్తున్నారు. 

ప్రపంచ 10 టాప్ సంపన్నుల జాబితాలో వారెన్ బఫెట్, లూయిస్ వియిట్టాన్ అధినేత బెర్నార్డ్ అర్నాల్ట్ ఉన్నారు. ఫేస్ బుక్ సీఈఓ మార్క్ జూకర్ బర్గ్ కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. రిలయన్స్ చైర్మన్ ముఖేశ్ అంబానీ కూడా 57బిలియన్ల నికర ఆదాయంతో ప్రపంచ సంపన్నుల 10వ ర్యాంకు జాబితాలో ఉన్నారు.