GVK గ్రూప్ చైర్మన్ జి.వి.కృష్ణారెడ్డి, ఆయన కొడుకుపై CBI అవినీతి కేసు

GVK గ్రూప్ చైర్మన్ జి.వి.కృష్ణారెడ్డి, ఆయన కొడుకుపై CBI అవినీతి కేసు

జీవీకే గ్రూప్‌ కంపెనీస్‌ ఛైర్మన్‌ జి.వి.కృష్ణారెడ్డితో పాటు ఆయన కొడుకు, ముంబై అంతర్జాతీయ ఎయిర్ పోర్టు లిమిటెడ్(MIAL) మేనేజింగ్‌ డైరెక్టర్‌ సంజయ్‌రెడ్డిపై సీబీఐ అవినీతి కేసు నమోదు చేసింది. ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధి, నిర్వహణ పనుల్లో నిధుల దుర్వినియోగానికి, అవినీతికి సంబంధించి సీబీఐ ఈ కేసు నమోదు చేసింది. రూ.705 కోట్ల నిధుల దుర్వినియోగం జరిగినట్టు సీబీఐ గుర్తించింది.

కాంట్రాక్టుల పేరుతో నిధుల గోల్ మాల్:
జీవీ సంజయ్ రెడ్డి.. జీవీకే గ్రూప్ వైస్ చైర్మన్ గా, ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు లిమిటెడ్ కు(మియాల్-MIAL) ఎండీగా ఉన్నారు. ముంబై ఎయిర్ పోర్టు అభివృద్ధి కోసం 2006లో ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ), జీవీకే ఎయిర్ పోర్ట్ హోల్డింగ్స్ లిమిటెడ్ తో ఒప్పందం కుదుర్చుకుంది. జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసింది. ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధి, నిర్వహణ కోసం వీరు ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య సంస్ధ మియాల్ తో(MIAL) ఒప్పందం చేసుకున్నారు. ఈ క్రమంలో 2017-18లో 9 కంపెనీలకు బోగస్ వర్క్ కాంట్రాక్టులు ఇచ్చినట్లు చూపించి రూ.310 కోట్లను వీరు దారి మళ్లించినట్లు సీబీఐ ఆరోపిస్తోంది. ఇందులో పాత్రధారులుగా ఉన్న జీవీకే గ్రూప్ అధినేత కృష్ణారెడ్డి, ఆయన కొడుకు సంజయ్ రెడ్డిలతో పాటు తొమ్మిది కంపెనీలు, ఎయిర్‌ పోర్టు అథారిటీకి చెందిన కొందరు అధికారులపైనా సీబీఐ అవినీతి కేసు నమోదు చేసింది. ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు చెందిన కొందరు అధికారుల సహకారంతో జీవీకే గ్రూప్ ప్రమోటర్లు మోసానికి పాల్పడ్డారని సీబీఐ తెలిపింది.

బోగస్ వర్క్ కాంట్రాక్టులు, రిజర్వ్ ఫండ్‌ దుర్వినియోగం:
ముంబై ఎయిర్‌పోర్ట్‌ను అభివృద్ధి చేసే క్రమంలో బోగస్ వర్క్ కాంట్రాక్టులు, రిజర్వ్ ఫండ్‌ను దుర్వినియోగం చేయడం, ఖర్చు అంచనాలను పెంచడం ద్వారా నిధులను విత్‌డ్రా చేశారని సీబీఐ స్పష్టం చేసింది. ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (ఎంఐఏఎల్) అనేది ఎయిర్‌ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ), జీవీకే, ఇతర విదేశీ సంస్థల జాయింట్ వెంచర్. ముంబై ఎయిర్ పోర్టు అభివృద్ది కాంట్రాక్టు దక్కించుకున్న జీవీకే గ్రూప్ కు చెందిన ఎయిర్ పోర్ట్స్ హోల్డింగ్స్ కు ఈ జాయింట్ వెంచర్ లో 50.5 శాతం వాటా ఉండగా… ఎయిర్‌పోర్ట్ అథారిటీకి 26 శాతం వాటా ఉంది. ఎయిర్‌పోర్ట్ ఆధునికీకరణ, నిర్వహణ కోసం 2006లో జీవీకేతో ఏఏఐ ఒప్పందం చేసుకుంది. దీన్నే ఎంఐఏఎల్‌గా పిలుస్తున్నారు. ఎయిర్‌పోర్ట్ సమీపంలోని 200 ఎకరాల ఏఏఐ భూముల అభివృద్ధి కోసం ఎంఐఏఎల్ రూ.200 కోట్ల బోగస్ వర్క్ కాంట్రాక్టులు ఇచ్చినట్లు చూపించింది. ఫలితంగా రూ.305 కోట్ల నిధులను మళ్లించింది.

రూ.395 కోట్ల మిగులు నిధుల దారి మళ్లింపు:
నేరపూరిత ఉద్దేశాలతో ప్రమోటర్లు ఎంఐఏఎల్‌కు చెందిన రూ.395 కోట్ల మిగులు నిధులను దుర్వినియోగం చేశారని ఎఫ్ఐఆర్‌లో తెలిపారు. ఎంఐఏఎల్ బోర్డు సమావేశాల తీర్మానాలను సృష్టించిన నిందితులు ఆ నిధులను జీవీకే ప్రధాన కార్యాలయం ఉన్న హైదరాబాద్‌లోని బ్యాంకుల్లో డిపాజిట్ చేశారని ఎఫ్ఐఆర్‌లో తెలిపారు. ఆ డిపాజిట్లపై జీవీకే గ్రూప్ సంస్థలు రుణాలు, ఓవర్ డ్రాఫ్ తీసుకున్నాయని కూడా సీబీఐ ఆరోపించింది.

సంబంధం లేని ఉద్యోగులకు కూడా జీతాలు:
ఎంఐఏఎల్‌తో సంబంధం లేని ఉద్యోగులకు కూడా జీతాలు చెల్లించాలరని.. దీని వల్ల ఏఏఐకి నష్టం వాటిల్లిందని సీబీఐ తెలిపింది. జీవీకే గ్రూప్‌కి చెందిన కుటుంబ సభ్యులు, బంధువులు, ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనాలు కలిగేలా గ్రూప్ ఉదాసీనంగా వ్యవహరించిందని.. ఫలితంగా ఏఏఐకి నష్టం చేకూరిందని సీబీఐ తెలిపింది. ఎయిర్‌పోర్టులోని ప్రీమియం రిటైల్ ఏరియాలను కుటుంబ సభ్యులకు తక్కువ ధరకే కట్టబెట్టిందని.. ఫలితంగా అద్దెలు, అమ్మకాల రూపంలో ఎంఐఏఎల్‌కు సమకూరాల్సిన ఆదాయంపై తగ్గిందని సీబీఐ తెలిపింది. కుటుంబ సభ్యులు, బంధువులు, ఉద్యోగులకు రైలు, విమాన టికెట్లు బుక్ చేయడానికి తమతోపాటు ఎంఐఏఎల్‌తో ఏమాత్రం సంబంధం లేని వ్యక్తులకు హోటల్ రూమ్‌లు బుక్ చేయడానికి ఎంఐఏఎల్ నిధులను జీవీకే గ్రూప్ వాడిందని ఎఫ్ఐఆర్‌లో సీబీఐ చెప్పింది.

టోటల్ గా రూ.705 కోట్ల అవినీతి:
2012 నుంచి ఎయిర్ పోర్టు అభివృద్ధికి వెచ్చించాల్సిన రూ.395 కోట్ల రిజర్వు ఫండ్స్ ను తన గ్రూప్‌ కంపెనీలకు జీవీకే అధినేత, ఆయన కొడుకు మళ్లించినట్లు సీబీఐ తమ ఎఫ్ఐఆర్ లో ఆరోపించింది. తద్వారా బోగస్ కాంట్రాక్టుల ద్వారా కూడబెట్టిన రూ.310 కోట్లు, రూ.395 కోట్ల దారి మళ్లింపు మొత్తం కలిపి రూ.705 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడినట్లు కేసులు నమోదు చేసింది. దేశంలో విద్యుత్, నిర్మాణ రంగంతో పాటు పలు కీలక రంగాల్లో సేవలందిస్తున్న జీవీకే గ్రూప్ కు మంచి గుర్తింపు ఉంది. అలాంటి సంస్థపై సీబీఐ అవినీతి కేసు నమోదు చేయడం జీవీకే గ్రూప్ కి అతిపెద్ద ఎదురుదెబ్బ అని నిపుణులు అంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ పలు కీలక రంగాల్లో పేరు ప్రతిష్టలున్న కృష్ణారెడ్డి కుటుంబంపై కేసు నమోదు కావడం చర్చనీయాంశంగా మారింది.

Read:రెండు చైనా కంపెనీలపై అమెరికా నిషేధం.. భారత్‌పై ప్రభావం ఉంటుందా?