మారటోరియంపై కేంద్రం గుడ్ న్యూస్..? రుణదారులకు భారీ ఊరటేనా?

  • Published By: sreehari ,Published On : October 3, 2020 / 08:10 PM IST
మారటోరియంపై కేంద్రం గుడ్ న్యూస్..? రుణదారులకు భారీ ఊరటేనా?

EMI Moratorium : కరోనా కష్టకాలంలో మారటోరియంపై కేంద్ర ప్రభుత్వ శుభవార్త చెప్పబోతుందా? అంటే అలాంటి అవకాశాలు ఉన్నాయనే మాట వినిపిస్తోంది. తీసుకున్న రుణాలపై వడ్డీలను కేంద్రం రద్దు చేస్తే.. రుణగ్రహీతలకు భారీ ఊరట లభించినట్టే..? కరోనా కాలంలో వివిధ వర్గాల రుణాల చెల్లింపులపై కేంద్రం మారటోరియం విధించింది.



చెల్లించాల్సిన వడ్డీపై తిరిగి వడ్డీ విధించడంపై కోర్టులో వాదోపవాదాలు జరిగాయి. ఈ సందర్భంగా కేంద్రం తన స్టాండ్ మార్చుకున్నట్టు కనిపిస్తోంది. వడ్డీపై వడ్డీ వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేసింది. దీంతో చిన్న మధ్యతరహా పరిశ్రమలనుంచి దేశంలోనే కోట్లాదిమంది రుణగ్రహీతలకు భారీ ఊరట కలగనుంది.



ఈ వడ్డీపై వడ్డీ రద్దు చేయడమంటే దాదాపుగా ఈ 6 నెలల కాలంలో ఒక్క పైసా కూడా అదనంగా కట్టకుండా మినహాయింపు పొందినట్టే అవుతుంది. కరోనా లాక్‌డౌన్‌తో ఉద్యోగాలు కోల్పోయి ఉపాధి లేనివారికి పెద్ద రిలీఫ్ అనే చెప్పాలి. స్తోమత ఉండి లోన్ల నెలవారీ వాయిదాలు కట్టిన వారికి కూడా మారటోరియం వర్తింపజేస్తామని కేంద్రం చెప్పడంతో రుణగ్రహీతలకు ఊరట కలిగించే విషయమే. దీనిపై సుప్రీంకోర్టులో ఆమోదం పొందితే గత 6 నెలలకాలం చెల్లించిన మొత్తాలు కూడా ఆదా అయినట్లే అవుతుంది.

కేంద్రం సుప్రీంకోర్టుకు దాఖలు చేసిన అఫిడవిట్ ప్రకారం.. మార్చి నెల నుంచి ఆగస్ట్ వరకూ చెల్లింపుల వాయిదా వడ్డీ మినహాయింపు లభించనుంది. రెండు కోట్ల రూపాయల లోపు ఉన్న రుణాలకే ఈ స్కీమ్ వర్తిస్తుంది. దీంతో ఆగస్ట్‌తో ముగిసిన ఆరునెలల కాలానికి MSME, పర్సనల్, హోమ్ లోన్, ఎడ్యుకేషన్, ఆటో, కన్జూమర్ డ్యూరబుల్ లోన్స్, క్రెడిట్ కార్డు బకాయిలకు వడ్డీపై వడ్డీ మినహాయింపు లభించే అవకాశం ఉంది.



ఆరునెలల కాలంలో ఎవరైతే తమ రుణాలపై వాయిదాలు చెల్లించారో వారికి కూడా మారటోరియం పథకం వర్తింపజేస్తామని కేంద్రం చెప్పడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. కేంద్రం అన్నిరకాల రుణాలకు మారటోరియం వర్తింపజేస్తే.. బ్యాంకులపై తలకి మించిన భారం పడుతుందని చెబుతోంది. వడ్డీని మినహాయించి ఆ భారం కేంద్రమే భరిస్తే.. ఆర్థిక భారం దాదాపు 6 లక్షల కోట్ల రూపాయలు పడుతుందని కేంద్రం అఫిడవిట్‌లో దాఖలు చేసింది. ఈ ఆర్థికభారం మోసేందుకు పార్లమెంట్ పర్మిషన్ తీసుకుంటామని కూడా కేంద్రం సుప్రీంకోర్టుకి విన్నవించింది.



తాజా నిర్ణయానికి ముందు సుప్రీంకోర్టులో ఈ అంశంపై విచారణ జరిగింది. కేంద్రం, ఆర్బీఐ, ఆర్థికశాఖ మధ్య ఆసక్తికర చర్చ సాగింది. కేంద్రం కానీ.. బ్యాంకులు కానీ కరోనా కష్టకాలంలో వడ్డీ వ్యాపారుల్లా కాకుండా ప్రజల పక్షాన నిలవాలంటూ సుప్రీంకోర్టే కోరిన నేపథ్యంలో ఈ అంశం తెరపైకి వచ్చింది. దీనిపై మాజీ కాగ్ మాజీ జనరల్ రాజీవ్ మెహ్రిషీ‌ ఆధ్వర్యంలో ఓ కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది. ఆ కమిటీ కూడా వడ్డీపై వడ్డీ విషయంలో వైఖరి మార్చుకోవాలని కోరింది.