బడ్జెట్ 2019 : బంగారంపై పన్ను తగ్గిస్తారా!

  • Published By: veegamteam ,Published On : January 30, 2019 / 05:59 AM IST
బడ్జెట్ 2019 : బంగారంపై పన్ను తగ్గిస్తారా!

ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టబోతోంది. ఇందులో బంగారానికి ప్రోత్సాహం లభిస్తుందా? లేదా? అనేది ఆసక్తిగా మారింది. పెద్ద నోట్ల రద్దు..జీఎస్‌టీ గోల్డ్ బిజినెస్ పై ప్రభావం చూపింది. అప్పటి నుంచి సమస్యలు ఎదుర్కొంటున్నామని బంగారం వ్యాపారులు అంటున్నారు. ఆ ప్రభావం కొనుగోలుదారులపై కూడా పడుతుంది. ఈ క్రమంలో ఈసారి బడ్జెట్‌లో బంగారంపై ఉన్న 10 శాతం దిగుమతి సుంకాన్ని 4 శాతానికి తగ్గించాలని..కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖను రత్నాభరణాల పరిశ్రమ కోరుతుంది.

వజ్రాలు, రాళ్లపై ప్రస్తుతం 7.5 శాతం పన్నును 2.5 శాతానికి తగ్గించాలని డిమాండ్ చేస్తోంది ఇండస్ట్రీ. వీటికి అదనంగా అప్పు నిబంధనలను కూడా సరళతరం చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు లేఖ రాసింది  రత్నాభరణాల పరిశ్రమ. రూ.2 లక్షలు అంతకుమించి బంగారు ఆభరణాల కొనుగోలు చేస్తే పాన్‌ నంబర్‌ విధిగా ఇవ్వాలి. ఈ నిబంధన సడలించాలని కూడా వ్యాపారులు కోరుతున్నారు. పాన్ కార్డ్ నిబంధనను రూ.5 లక్షలకు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. 

 

దేశంలో 50 శాతం మందికి పాన్‌ కార్డులే లేవు. గ్రామీణ ప్రాంతాలవారికి పాన్ కార్డ్ రూల్ అనేది ఇబ్బందిగా మారిందని బంగారం వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రంగు రాళ్లు, వజ్రాల ఎగుమతులకు సంబంధించి తీసుకునే రుణాలపై 5 శాతం వడ్డీ రాయితీని తిరిగి ప్రవేశపెట్టాలని కోరుతున్నారు. మరోవైపు బంగారంపై అధిక దిగుమతి ట్యాక్స్ కారణంగా అక్రమ రవాణా పెరిగిన విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు వ్యాపారులు.